How To Avoid Teeth Stains : మన శరీరంలోని ఇతర అవయవాల్లాగే దంతాల సంరక్షణ కూడా చాలా ముఖ్యం. పళ్లు ఎంత మంచిగా, మెరిసేలా ఉంటే అంత బాగుంటుంది. కానీ చాలా మంది వాళ్ల దంతాలను ఎంత శుభ్రంగా ఉంచుకున్నా పాచిగా ఉంటూ పసుపుగా తయారవుతాయి. దీని వల్ల చూడటానికి ఇతరులకు, మనకూ ఇబ్బందిగానే ఉంటుంది. మరి పళ్లు పాచి పట్టడానికి గల కారణాలు, అందుకు గల పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఇవీ కారణాలు..
Reasons For Teeth Yellowing :పళ్లు పాచి పట్టడానికి గల ప్రధాన కారణాల్లో.. సరిగ్గా బ్రష్ చేయకపోవడం ఒకటి. అంతేకాకుండా దంతాల మధ్యలో గ్యాప్ ఉండటం కూడా పళ్లపై మరకలు రావటానికి ముఖ్య కారణం. ఈ కారణంతో మీ దంతాల్లో సాధారణంగా గార ఏర్పడుతుంది. అలాగే పన్ను మీద పన్ను ఉన్నా, సరైన పళ్ల వరస లేకపోయినా సరే టూత్ బ్రష్ పళ్ల మధ్యలోకి పూర్తిగా వెళ్లలేదు. దీంతో అక్కడ పాచి తయారవుతుంది. ఈ రెండు కారణాలు కాకుండా మన పళ్లల్లో గార తయారవడానికి మరో కారణం మనం రోజూ తీసుకునే ఆహారం. అందుకని మనం ఏ ఆహార పదార్థాలు తింటున్నామో అనే దానిపై కూడా దృష్టి పెట్టాలి.
ఆ ఆహారం తగ్గించండి!
ప్రధానంగా కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉండే ఆహారం తినటం తగ్గించండి. దీంతో పాటు భోజనానికి మధ్యలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే పండ్లను తినండి. యాపిల్, జామ లాంటి పండ్లు తినటం వల్ల పళ్లపై ఉన్న గార క్రమంగా పోతుంది. అంతేకాకుండా.. లాలాజలం ఉత్పత్తి ఎక్కువవుతంది. దీనివల్ల పళ్ల మధ్య పాచి కూడా ఏర్పడకుండా ఉంటుంది. ఆహారం తీసుకున్న తర్వాత నోట్లో నీరు పోసుకుని పుక్కిలించి ఉమ్మడాన్ని అలవాటుగా మార్చుకోండి.
టీ, కాఫీలు తాగాక..
టీ, కాఫీ లాంటి పానీయాలు ఎక్కువగా తాగే అలవాటు ఉన్నవాళ్లు.. వాటిని తాగిన తర్వాత 10 నిమిషాలు విరామం ఇచ్చి నీళ్లు తాగండి. ఆ నీటిని పుక్కిలించి ఉమ్మకుండా మింగేయండి. ఇంత చేసినా పళ్లు గారపడుతుంటే గనుక ఓసారి దంత వైద్యుడ్ని సంప్రదించండి. మీ దంతాల్లో ఏవైనా అసాధారణమైన క్యావిటీస్ ఉన్నాయా లేదా అనేది చెక్ చేయించుకోండి. ఒకవేళ అలాంటివి ఉంటే అందుకు అనుగుణంగా వైద్యులు చికిత్స చేసి మళ్లీ పాచి తయారవకుండా చూస్తారు.