ఒకవైపు ఆనందం.. మరోవైపు కేలరీల ఖర్చు! అదెలా అని ఆశ్చర్యపోకండి. శృంగారంతో సాధ్యమేనని అధ్యయనాలు పేర్కొంటున్నాయి! వ్యాయామం చేసినంతగా కాకపోయినా శృంగారంలో పాల్గొన్నప్పుడూ కేలరీలు ఖర్చు అవుతాయి మరి. సుమారు అరగంట సేపు ఒక మోస్తరు వేగంతో పరుగెత్తితే సగటున మహిళల్లో 213 కేలరీలు, పురుషుల్లో 276 కేలరీలు ఖర్చు కాగా.. శృంగారం మూలంగా మహిళల్లో 69 కేలరీలు, పురుషుల్లో 101 కేలరీలు ఖర్చు కావటం గమనార్హం. మగవారిలో ఎక్కువ కేలరీలు ఎందుకు ఖర్చవుతున్నాయో తెలుసా? ఆడవాళ్ల కన్నా మగవాళ్లు ఎక్కువ బరువు ఉండటం.. ఆ సమయంలో మగవారు కాస్త చురుకుగానూ ఉండటం వల్లనేనని పరిశోధకులు చెబుతున్నారు.
నిజానికి శృంగారమనేది వ్యాయామ పద్ధతి కాదు గానీ ఇది కూడా కొంతమేరకు వ్యాయామంగా తోడ్పడుతుండటం విశేషం. కేలరీల విషయం పక్కనపెట్టి చూసినా.. శృంగారంతో మానసిక ఆరోగ్యం, మూడ్ మెరుగుపడతాయి. కండరాలను వదులుచేసే, హాయిని కలిగించే రసాయనాలు శరీరమంతా సరఫరా అవుతాయి. అంతేకాదు.. నిద్ర కూడా బాగా పడుతుంది. అంటే శృంగారం.. ఆనందంతో పాటు ఆరోగ్యాన్నీ పెంపొందించే సాధనం కూడా అన్నమాట.
నిద్ర.. వీర్యానికి బాసట
నిద్ర తక్కువైతేనే కాదు.. ఎక్కువైనా ఇబ్బందే. అందుకే రాత్రిపూట త్వరగా పడుకొని, ఉదయం పెందలాడే లేవాలని చెబుతుంటారు. ఇది శాస్త్రీయంగానూ రుజువైంది. ఇప్పుడు దీనికి సంబంధించి మరో కొత్త విషయం బయటపడింది. నిద్ర మరీ తగ్గినా, మరీ ఎక్కువైనా పురుషుల్లో వీర్యం నాణ్యత దెబ్బతింటున్నట్టు పరిశోధకులు గుర్తించారు. ఈ అధ్యయనంలో భాగంగా కొందరికి 6 గంటలు, అంతకన్నా తక్కువసేపు.. మరికొందరికి 7-8 గంటల సేపు.. ఇంకొందరికి 9 గంటలు, అంతకన్నా ఎక్కువసేపు నిద్రపోవాలని సూచించారు.