తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

ఇంట్లో తేనె ఉంటే... అన్నీ ఉన్నట్లే!!

బరువు తగ్గాలా?? ఉదయాన్నే తేనె, నిమ్మరసం తాగండి. మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా..? తేనె, నిమ్మరసం, శనగపిండి కలిపి ముఖానికి రాసుకోండి. వంటచేస్తూ చెయ్యి కాల్చుకున్నారా..? దివ్యౌషధం తేనె ఉందిగా.. కాలిన చోట పూయండి. మంట మాయం..! ప్రతి సమస్యకూ పరిష్కారం 'తేనె' అనిపిస్తోంది కదూ.. అవును.. ప్రకృతి ప్రసాదించిన వరాల్లో ఒకటి ఈ మధురమైన మకరందం. తేనె వల్ల ఉపయోగాలు అనంతం! వాటిలో కొన్ని ప్రధానమైన వాటి గురించి తెలుసుకుందామా..

honey is like a medicine for health and beauty
honey is like a medicine for health and beauty

By

Published : Mar 15, 2021, 1:33 PM IST

తేనెటీగలు ఎంతో కష్టపడి ప్రతి పువ్వుపైనా వాలి.. తేనెను సమకూర్చుకుంటాయి. ఇందులో వాటి శరీరం నుంచి విడుదలయ్యే కొన్ని ఎంజైములు కూడా కలవడం వల్ల అది ఎప్పటికీ పాడై పోకుండా ఉంటుంది. ఎన్ని సంవత్సరాలైనా తేనె పాడవ్వదు. అందుకే పూర్వం రాజులు చనిపోయిన తర్వాత వారి శరీరాలను తేనెలో ఉంచేవారట. అదే దాని ప్రత్యేకత. ఏ రకంగా ఉపయోగించినా తేనె వల్ల లాభాలే తప్ప నష్టాలు లేవు. అంత అద్భుతంగా పని చేస్తుంది. ప్రత్యేకించి మన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడటంలో తేనెను మించిన ఔషధం మరొకటి లేదు.


సంపూర్ణ ఆరోగ్యానికి..

  • మన శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులను నాశనం చేయడానికి తేనె ఓ నేచురల్ యాంటీబయాటిక్‌లా ఉపయోగపడుతుంది.
  • గొంతు బొంగురుపోతే గోరువెచ్చని నీటిలో తేనెను కలిపి తీసుకుంటే త్వరగా బాగవుతుంది. దగ్గును తగ్గించే శక్తీ తేనెలో ఉంది.
  • ఏదైనా ఆపరేషన్ జరిగిన తర్వాత కుట్లు మానడానికి దానిపైన తేనెను పూస్తే అవి త్వరగా మానతాయి.
  • కాలిన చోట తేనెను పూస్తే వెంటనే మంట తగ్గుతుంది. నల్లని మచ్చ పడకుండా ఉంటుంది.
  • తేనె సింపుల్ కార్బోహైడ్రేట్. త్వరగా రక్తంలో కలిసే లక్షణం వల్ల ఇది త్వరగా శక్తిని అందిస్తుంది.
  • రోజూ తేనె తీసుకునే మగవారిలో వీర్యకణాల సంఖ్య ఎక్కువగా ఉంటుందని నిపుణుల అభిప్రాయం.
  • తేనె జ్ఞాపకశక్తిని పెంచడానికీ ఉపయోగపడుతుందని ఇటీవల జరిగిన పరిశోధనల్లో వెల్లడైంది.
  • తేనె, అల్లం రసం కలిపి తీసుకోవడం వల్ల జీర్ణశక్తి పెరుగుతుంది. తేనె వల్ల జీర్ణాశయం శుద్ధవుతుంది.
  • నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారా.. అయితే రాత్రి పాలు, తేనె కలిపి తాగండి. నిద్ర బాగా పడుతుంది.
  • ఆర్థ్రయిటిస్, ఆస్తమా వంటి వ్యాధులున్న వారు తేనెను తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.
  • కళ్లకలక వచ్చినప్పుడు తేనెను కళ్లమీద రాసుకోవడం వల్ల ఉపశమనం ఉంటుంది.
  • తేనెను తీసుకోవడం వల్ల కాల్షియంని గ్రహించే శక్తి మన శరీరంలో పెరుగుతుంది.
  • తేనె శరీరంలోని కొవ్వును కరిగిస్తుంది.


మచ్చలేని సౌందర్యానికి..

  • కాలిన గాయాల పైన తేనెను పూయడం వల్ల మచ్చలు పడవు.
  • మొటిమల మీద తేనెను రాయడం వల్ల అవి త్వరగా తగ్గుతాయి.
  • తేనె రాయడం వల్ల మొటిమల మచ్చలు చర్మపు రంగులో కలిసిపోతాయి.
  • తేనెను పూయడం వల్ల పెదాలు పొడిబారకుండా ఉంటాయి.
  • తేనె చర్మకాంతిని పెంచడమే కాకుండా చర్మంలో తేమ ఉండేలా చేసి మృదువుగా మారుస్తుంది. అంటే చక్కటి మాయిశ్చరైజర్‌గా ఉపయోగపడుతుందన్నమాట!
  • మోచేతులు, మోకాళ్ల దగ్గర చర్మం నల్లగా మారిందా..? తేనెను పూయడం వల్ల ఈ నలుపు తగ్గి మృదువుగా మారుతుంది.
  • పరగడుపున తేనె, నిమ్మరసం కలిపి తీసుకోవడం వల్ల త్వరగా సన్నబడే అవకాశాలు ఎక్కువ.
  • రోజూ తేనెను తీసుకోవడం వల్ల రక్తశుద్ధి జరిగి చర్మం కాంతులీనుతుంది.
  • తేనె జుట్టుకు నేచురల్ కండిషనర్‌గా ఉపయోగపడుతుంది.
  • తేనె, ఆలివ్ ఆయిల్ కలిపి జుట్టుకు పట్టించి అరగంట తర్వాత తల స్నానం చేయడం వల్ల జుట్టు పట్టులా మెరుస్తుంది.
  • తలస్నానం చేసేముందు తేనె, పాలు కలిపి తలకు పట్టిస్తే జుట్టు ఒత్తుగా, ఆరోగ్యంగా తయారవుతుంది.
  • టీ, కాఫీ, జ్యూస్, స్వీట్స్, సలాడ్స్‌లో చక్కెరకు బదులుగా తేనెను వాడొచ్చు. దీని వల్ల త్వరగా సన్నబడే అవకాశాలుంటాయి.
    అపోహలు వద్దు..
  • తేనె తియ్యగా ఉంటుందని అది తీసుకుంటే లావవుతారని చాలామంది భావిస్తూ ఉంటారు. అయితే అది ఓ అపోహ మాత్రమే.. తేనె తీసుకోవడం వల్ల శరీరంలోని కొవ్వు త్వరగా కరిగి త్వరగా సన్నబడతారు.
  • గర్భిణులు తేనె తీసుకోకూడదని భావిస్తూ ఉంటారు. ఇది కూడా అపోహే. పెద్దవాళ్లెవరైనా తేనెను తీసుకోవచ్చు. అయితే సంవత్సరంలోపు పిల్లలకు మాత్రం తేనెను ఇవ్వకూడదు. ఎందుకంటే వారికి అది అరగకపోవచ్చు.
  • తేనె జుట్టుకు రాయడం వల్ల జుట్టు త్వరగా తెల్లబడుతుందనుకోవడం ఓ పెద్ద అపోహ. తేనె రాయడం వల్ల జుట్టు పట్టులా మెరిసిపోతుంది తప్ప నెరిసిపోదు!

చూశారా..? తేనెలో ఎన్ని సుగుణాలున్నాయో.. అందుకే ఈసారి సరుకులు కొనడానికి వెళ్లినప్పుడు మీ లిస్టులో తప్పనిసరిగా తేనె ఉండేలా చూసుకోండి.

ఇదీ చూడండి:పాలిచ్చే తల్లులూ.. కాస్త కంఫర్టబుల్‌గా, కాస్త స్టైలిష్‌గా..!

ABOUT THE AUTHOR

...view details