High Salt Consumption Effects :ఎలాంటి ఆహారానికి అయినా రుచిని తెచ్చేది ఉప్పే అని మనలో అందరికీ తెలుసు. ఆహారం నాలుకకు రుచిగా అనిపించాలంటే ఉప్పును వేసుకోవాల్సింది. ఉప్పు లేని తిండి అంటే ఏమాత్రం రుచి లేని తిండే అనే నానుడి ఉంది. అయితే ఉప్పు వాడకం అనేది మోతాదుకు మించితే మాత్రం ఆరోగ్యానికి చేటు చేస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మరి వైద్యుల ప్రకారం ఎంత ఉప్పు తీసుకోవాలి, ఉప్పు ఎక్కువ తీసుకుంటే వచ్చే సమస్యలు ఏంటో తెలుసుకుందాం.
ఉప్పు.. అమృతం, విషం:
Salt Intake Per Day :మనం వండిన వంటను అమోఘంగా మార్చే సత్తా ఉప్పుకు ఉంది. అందుకే ఉప్పు లేకుండా వంట పూర్తి కాదు. అయితే ఉప్పు వేస్తే ఎంతైతే అద్భుతంగా వంట రుచి మారుతుందో, ఎక్కువగా ఉప్పు తీసుకుంటే మన శరీరానికి అంతే ఎక్కువ నష్టం కలుగుతుంది.
ప్రపంచంలో ఎక్కువ ఉప్పు వాడే వారి జాబితాలో మనం ఉంటాం. మరీ ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఉప్పు, కారం రెండూ ఎక్కువ వాడుతుంటారు. ఉప్పు అయితే కాసింత ఎక్కువే వేసుకోవడం మనకు ఉన్న ఓ సాధారణ అలవాటు. అయితే మామూలు వాడకం కన్నా మనం దాదాపు మూడు రెట్లు ఎక్కువగా ఉప్పును వినియోగిస్తున్నట్లు వైద్యులు చెబుతున్నారు.
Salt Consumption Per Day :"సాధారణ, ఆరోగ్యవంతులు రోజుకు 3.75గ్రాముల ఉప్పును తీసుకోవాలి. అంతకు మించి ఉప్పును తీసుకోవడం అనేది ఆరోగ్యానికి చేటు చేస్తుంది. కానీ మనం సాధారణంగా తీసుకోవాల్సిన దానిని మించి ఎక్కువ మొత్తంలో ఉప్పును తీసుకుంటున్నాం. సగటున మనం 11గ్రాముల ఉప్పును తీసుకుంటున్నాం. ఇది ఎంత మాత్రం మంచిది కాదు."
- ప్రముఖ డైటీషియన్ డా.శిరీష
ఇక మనం సాధారణంగా తీసుకునే జంక్ ఫుడ్, ఇతర ఆహారాల వల్ల మనకు అవసరమైన దాని కన్నా ఎక్కువ మొత్తంలో ఉప్పు అందుతుంది. దీని ఫలితంగా కాలేయ సమస్యలు, మూత్రపిండాల సమస్యలు, గుండె సంబంధిత సమస్యలతో పాటు కొవ్వు ఎక్కువ అవడం లాంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఉప్పు వాడకాన్ని నియంత్రించాలని, ఉప్పును సగటున రోజుకు 3గ్రాముల నుండి 5గ్రాములకు పరిమితం చేయాలని అంటున్నారు. ఉప్పుకు ప్రత్యామ్నాయంగా నిమ్మకాయ రసాన్ని వాడాలని వైద్యులు సూచిస్తున్నారు.