High BP for pregnant woman: గర్భిణులకు అధిక రక్తపోటు ఉంటే మందులు ఇవ్వాలా? వద్దా? అనేది చాలాకాలంగా సందిగ్ధంగానే ఉండిపోయింది. రక్తపోటు తగ్గించే మందులు పిండం మీద దుష్ప్రభావాలు చూపొచ్చని అనుమానించటమే దీనికి కారణం.
అయితే గర్భిణుల్లో చాలామందికి అధిక రక్తపోటు చికిత్స సురక్షితమేనని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ (ఏహెచ్‌ఏ) తాజాగా పేర్కొంది. ఇది తల్లికి అధిక రక్తపోటు తీవ్రం కాకుండా చూస్తుందని.. పిండానికి, పుట్టిన తర్వాత శిశువులకు ముప్పేమీ పెరగకపోవచ్చని తెలిపింది. గర్భిణుల్లో రక్తపోటును సూచించే పై అంకె (సిస్టాలిక్ ప్రెషర్) 140, అంతకన్నా ఎక్కువుంటే అధిక రక్తపోటుగా భావిస్తారు.
ప్రపంచవ్యాప్తంగా గర్భిణుల మరణాలకు రెండో అతిపెద్ద కారణమిదే. సమస్య తీవ్రమైతే గర్భిణిలో గుండెజబ్బులకు దారితీయొచ్చు. కాన్పు అయిన వెంటనే లేదా కొన్నేళ్ల తర్వాత కూడా గుండెజబ్బు తలెత్తొచ్చు. నెలలు నిండక ముందే కాన్పు కావొచ్చు.