Heel Pain Exercises : సాధారణంగా పాదాల్లో వచ్చే నొప్పుల్లో మడమ నొప్పి ప్రధానమైంది. కాలి వెనుక మడమ భాగంలో ఉదయాన్నే మడమ బిగుసుకుపోయినట్లు అనిపించి తీవ్రమైన నొప్పి రావడం వచ్చి వాపు కూడా వస్తుంది. పాదంలో మడమ నుంచి వేళ్ల వరకు ప్లాంటర్ ఫాసియా అనే మెత్తని కణజాలం ఉంటుంది. ఇది ఎలాస్టిక్ లక్షణం కలిగి ఉండటం వల్ల మనం నడుస్తున్నప్పుడు పాదం కదలికలు సులువుగా మారతాయి.
Heel Pain Treatment : ఈ కణజాలానికి ఏదైనా దెబ్బతగిలినా, ఎక్కువ సేపు ఎత్తు పల్లాల ప్రాంతాల్లో నడచినా మడమ భాగంలో నొప్పి వస్తుంది. పాదాలపై ఎక్కువ సమయం నిలుచుని ఉండేవారిలో, షుగర్ వ్యాధిగ్రస్థులకు సైతం ఈ నొప్పి వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. నడక సరిగ్గా లేకపోవడం, ఊబకాయం, నేల గట్టిగా ఉండటం, సరైన పాదరక్షలు ధరించకపోవడం, పాదాలు, చీలమండకు సంబంధించిన ఆర్థరైటిస్ వంటి అంశాలు ఈ నొప్పికి దారితీస్తాయి.
పాదానికి సరిపడా పాదరక్షలు వేసుకోకపోవడం, అవి లేకుండానే నడిచే వారిలో, పరిగెత్తేవారు, జంపింగ్ ఎక్కువగా చేసే వారిలోనూ మడమ నొప్పి ఎక్కువగా ఉంటుంది. యూరిక్ యాసిడ్ సమస్య, కీళ్లవాతం ఉన్న వాళ్లలోనూ దీన్ని తరచూ గమనించవచ్చు. దీంతోపాటు శరీర బరువంతా పాదంపై పడటం వల్ల అధిక బరువు ఉన్న వారూ దీని బాధితులవుతారు.
మడమ చుట్టూ ఉండే అకిలిస్ టెండోనైటిస్ అనే కండరం అక్కడి ఎముకకు అతుక్కుని ఆ చోట వాపు రావడం వల్ల ఈ నొప్పి వస్తుంది. మడమ చుట్టూ ఉండే కాపు తిత్తులు ఉబ్బడం, లోపలి పక్కన లేదా అంచున ప్లాంటర్ ఫేసియా అనే పొర వాపు రావటం వల్ల ఇది వస్తుంది. దీన్ని ప్లాంటార్ ఫేసియేటిస్ అంటారు. ఈ బాధితులు ఉదయం లేవగానే విపరీతమైన నొప్పితో బాధపడతారు. నాలుగైదు అడుగులు వేయగానే నొప్పి తగ్గుముఖం పడుతుంది. ఇలాంటి వారు తగిన పాదరక్షలు ధరించాల్సి ఉంటుంది.
Heel Pain Remedy : మడమ నొప్పి వల్ల రోజు వారీ జీవితంలో చాలా ఇబ్బందులు ఉంటాయి. పాదాల్ని కదల్చలేకపోవడం వల్ల ఎక్కువగా కూర్చుని ఉండేందుకు ఇష్టపడతారు. నొప్పి వారం కంటే ఎక్కువ రోజులు ఉన్నా.. నడవకపోయినా నొప్పి వస్తున్నా.. వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది. వారి సూచనల మేరకు అవసరమైతే ఎక్స్‌రే తో పాటు ఎంఆర్ఐ, అల్ట్రా సౌండ్ పరీక్షలు చేసుకోవాలి. సర్జరీ లేకుండానే కాలక్రమేణా నొప్పి తగ్గే మందులు ఇస్తారు. అవసరమైతే పాదరక్షల పరిమాణంలో మార్పులు చేసుకోవాలి. నెలల తరబడి నొప్పి అలాగే ఉంటే అప్పుడు సర్జరీ చేస్తారు.
ఉపశమన పద్ధతులు..
మడమ నొప్పికి కొన్ని ఉపశమన పద్ధతుల్ని ఇంట్లోనే పాటించవచ్చు. మొదటిగా పాదానికి తగిన విశ్రాంతిని ఇవ్వాలి. శారీరక శ్రమ, నడక తగ్గించాలి. ఎక్కువ సేపు నిలబడకూడదు. పాదాల ఒంపుకు తగినట్లుండే షూ వాడాలి. ఆ ప్రాంతంలో ఐస్ పెట్టుకోవడం, పాదాలకు, నొప్పి ఉన్న భాగంలో సున్నితంగా మసాజ్ లాంటివి చేయాలి. కాలి పిక్కలు, పాదాలను సాగదీసే వ్యాయామాలు మేలు చేస్తాయి. ఇలాంటి జాగ్రత్తలు పాటించినా నొప్పి తగ్గకుంటే వైద్యుల్ని సంప్రదించాలి. ఎక్కువగా జాగింగ్, రన్నింగ్ చేసే వాళ్లు మంచి ఉపరితలం మీదే చేయాలి. ఎత్తుపల్లాల ప్రాంతాల్లో ఇలాంటివి చేయకూడదు.
వ్యాధి నిర్ధరణ, చికిత్స..
క్లినికల్‌గా బాధితులకు నొప్పి, వాపు ఎక్కడ ఉందో గమనించాలి. బాధితులు కొన్నిసార్లు ఎక్కువ దూరం నడవలేరు. ఎక్స్ రే తీస్తే.. కొంతమందిలో మడమ చుట్టూ ఉన్న ఎముక పెరుగుతుంది. కాపుతిత్తులు ఉబ్బాయా అనేది నిర్ధరించుకుని అందుకు అనుగుణంగా చికిత్స తీసుకోవచ్చు. నొప్పి తగ్గడానికి నాన్ స్టిరాయిడల్ యాంటీ ఇన్ ఫ్లమేటరీ మందులు, దీంతో పాటు వాపు తగ్గేందుకు కొన్ని మందులు వాడి, ఫిజియోథెరపీ చేసుకుంటే నొప్పి నుంచి విముక్తి కలుగుతుంది.
మడమ నొప్పికి కారణాలు.. చికిత్స విధానాలు ఇవే