తెలంగాణ

telangana

By

Published : Apr 21, 2021, 10:31 AM IST

ETV Bharat / sukhibhava

వేసవిలో జాగ్రత్త- ఈ ఆహారంతో వడదెబ్బకు చెక్​!

వేసవి కాలంలో ఎండలకు అలసిపోతే వాంతులు, కండరాల నొప్పులు, శరీరం వెచ్చబడటం లాంటి లక్షణాలు వడదెబ్బను సూచిస్తాయి. హైదరాబాద్, వి.ఐ.ఎన్.ఎన్. హాస్పటల్​లో వైద్యులుగా పనిచేస్తున్న డా.రాజేష్ వుక్కల ఎమ్.డి. ఈటీవీ భారత్ సుఖీభవతో మాట్లాడుతూ ఈ వేసవి సమస్యను అధిగమించటానికి తగు సూచనలను ఇచ్చారు, అవి మీకోసం.

Heat Exhaustion And Heat Stroke: Symptoms, Prevention And Foods To Eat.
వడదెబ్బను నిలువరించే ఆహారం..!

ఈ ఎండాకాలంలో మండే సూర్యుడి తాపాన్ని భరిస్తూ బయట తిరుగుతూ ఉంటే శరీరం తనను తాను చల్లబరచుకోవటానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అధిక ఉష్ణోగ్రత శరీర వేడిని పెంచి వడదెబ్బ లక్షణాలను కలగచేస్తుంది. శరీరం లోపలి ఉష్ణోగ్రతను మెదడు నియంత్రించలేకపోయినపుడు ప్రాణానికి ప్రమాదం ఏర్పడుతుంది. వడదెబ్బ లక్షణాలు కొద్దిగా కనిపించగానే తగు జాగ్రత్తలు తీసుకోవాలని డా.వుక్కల అంటున్నారు.

శరీర తాపం, వడదెబ్బ లక్షణాలు:

ప్రారంభ దశలో కింద సూచించిన లక్షణాల్లో కొన్ని కనిపించవచ్చు.

  • నోటిలో నీరూరటం,
  • వాంతులు.
  • శరీరంలో నీటి శాతం తగ్గటం
  • కండరాల నొప్పులు
  • బలహీనత, అలసట
  • పొడిబారిన చర్మం
  • తలనొప్పి
  • ఎక్కువగా చెమటలు పట్టడం

ఇవి ఇలాగే కొనసాగితే వడదెబ్బకు దారితీస్తుంది. అంటే ఉష్ణోగ్రత నియంత్రణలో మెదడు శక్తిహీనమవుతుంది. అపుడు కనిపించే లక్షణాలు:

  • తల తిరగటం
  • గందరగోళం
  • మూర్ఛ
  • గుండె వేగంగా కొట్టుకోవటం
  • చర్మం కందిపోయి పొడిగా, వేడిగా ఉంటుంది

ఈ పరిస్థితిలో చికిత్స అందించకపోతే ప్రాణాపాయం ముప్పు పొంచి ఉంది.

ముందు జాగ్రత్తలు:

  • ఉదయం 11 గం.ల నుంచి మధ్యాహ్నం 3 గం.ల వరకు ఇంటికే పరిమతమవ్వాలి, ముఖ్యంగా వేసవిలో.
  • బయటకు వెళ్లాల్సి వస్తే ముదురు రంగులు లేని వదులైన కాటన్ దుస్తులనే ధరించాలి.
  • టోపీ కానీ, గొడుగు కానీ ధరించాలి.
  • చేతిలో ఒక నీటి సీసా ఉంచుకుని అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా తాగుతూ ఉండాలి.
  • నీరు ఎక్కువగా ఉన్న పుచ్చకాయ లాంటి ఫలాలను తరచూ తింటూ ఉండాలి.
  • వీలైనపుడల్లా నీడలో ఉంటూ ఎండ తగిలే చర్మ భాగాలపై 30 ఎస్.పి.ఎఫ్. ఉన్న సన్ స్క్రీన్ లోషన్​లను రాసుకోవాలి.

ఆహారంలో చేర్చాల్సినవి:

  • పుచ్చకాయ, దోసకాయ, కీర
  • సొరకాయ
  • గుల్కంద్ (గులాబి రేకుల లేహ్యం)
  • అనాస పండు
  • పచ్చి మామిడి రసం
  • కొబ్బరి నీళ్లు, జీలకర్రతో తయారుచేసిన నీరు, కోకమ్ జ్యూస్ లాంటి ఇతర పానీయాలు
  • పెరుగు
  • చింతపండు పానీయం
  • మామిడి పళ్లు
  • మారేడు పానీయం

ఎవరికి ప్రమాదం?

50 సం.ల వయసు దాటిన వారే కాక మూత్రపిండాలు, కాలేయ వ్యాధులు ఉన్నవారూ జాగ్రత్తగా ఉండాలి. మధుమేహం, రక్తపోటు ఉన్నవారు, ఇతరత్రా ఔషధాలు తీసుకుంటున్న వారు వడదెబ్బకు లోనయ్యే అవకాశం ఉంది. అయినా ఈ లక్షణాలు కనిపిస్తే వైద్యులు తగు ఔషధాలిచ్చి స్వస్తత చేకూర్చగలరు. ఎండ వేడికి నీటి శాతం తగ్గిన వారికి పళ్ల రసాలు, నీరు ఎక్కువగా ఉన్న కాయగూరలను ఇస్తూ ఉండాలి. ఎయిర్ కండిషనర్ కానీ, ఎయిర్ కూలర్​ని కానీ ఏర్పాటు చేసుకుని ఉష్ణోగ్రత 26-27 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉండేట్టుగా చూసుకోవాలి. కొన్ని ఔషధాలు శరీరంలో నీటి శాతాన్ని తగ్గించేవిగా ఉంటాయి. వైద్యున్ని సంప్రదించి ఆ ఔషధాల మోతాదు ఎంత మేర తగ్గించాలో సలహా తీసుకోవాలి. పదేపదే ఎండ వేడిమికి అలసిపోతుంటే వైద్యున్ని సంప్రదించండి.

ABOUT THE AUTHOR

...view details