కొత్త కరోనా వైరస్ పిల్లలకు అంతగా సోకటం లేదు. సోకినా తేలికపాటి లక్షణాలకే పరిమితమవుతోంది. ఇప్పటివరకూ మనం భావిస్తున్నది, మనకు భరోసా ఇస్తున్నది ఇదే. నిజమే. కరోనా వైరస్ పిల్లల్లో 2.5% మందిలోనే కనిపిస్తోంది. ఇన్ఫెక్షన్ తలెత్తినా మామూలు చికిత్సతోనే తగ్గిపోతోంది. కొవిడ్ బాధితుల్లో శ్వాసకోశ వ్యవస్థ ముఖ్యంగా ఊపిరితిత్తులు తీవ్రంగా దెబ్బతింటుండటం చూస్తున్నదే. ఇలాంటి తీవ్ర సమస్య కూడా పిల్లల్లో చాలా తక్కువే. కథ అక్కడితోనే ముగియటం లేదు. కొందరు పిల్లల్లో కరోనా జబ్బు గుండెను, ఇతర అవయవాలను తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఇదే పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ (పీఎంఎస్‌ఐఎస్). ఇటలీ, స్పెయిన్, బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా వంటి దేశాల్లో ఎంతోమంది పిల్లలు దీని బారినపడుతుండటం, అత్యవసరంగా చికిత్స చేయాల్సిన పరిస్థితి తలెత్తుతుండటం కలవరపెడుతోంది. కొందరు మృత్యువాత పడుతున్నారు కూడా. మనదేశంలోనూ ఇలాంటి సమస్య కనిపించటం ఆరంభమైంది. కానీ దీన్ని చాలామంది పోల్చుకోలేకపోతున్నారు. ప్రపంచవ్యాప్తంగానూ ఇలాంటి పరిస్థితే నెలకొంది. నిపుణులను సైతం అయోమయంలో పడేస్తోంది. ఉన్నట్టుండి గుండె, ఇతర అవయవాలు, రక్తనాళాలు, రోగనిరోధక వ్యవస్థలన్నీ ఎందుకు, ఎలా ప్రభావితం అవుతున్నాయనేది అంతు పట్టటం లేదు. దీని బారినపడుతున్న పిల్లలంతా అంతకుమందు ఎలాంటి గుండెజబ్బులు లేనివారే. అంతా ఆరోగ్యంగా ఉన్నవారే కావటం గమనార్హం. కొవిడ్-19 ఉద్ధృతంగా ఉన్న ప్రాంతాల్లోని పిల్లలకు దీని ముప్పు ఎక్కువగా కనిపిస్తోంది. ఇది 5 నెలల పసికందు దగ్గర్నుంచి 18 ఏళ్ల పిల్లల వరకూ ఎవరికైనా రావొచ్ఛు అదృష్టవశాత్తు చికిత్సతో చాలావరకు పిల్లలు పూర్తిగా కోలుకుంటున్నారు. కాకపోతే దీన్ని సత్వరం గుర్తించి, స్పందించటం అత్యవసరం. లేకపోతే ప్రాణాపాయానికి దారితీసే అవకాశముంది.
కొందరిలోనే వైరస్
కొత్త కరోనా వైరస్‌లో ‘ఎల్’, ‘ఎస్’ అని రెండు రకాలున్నాయి. ‘ఎల్’ రకం చాలా తీవ్రమైంది. దీంతో పోలిస్తే ‘ఎస్’ రకం అంత ప్రమాదకరమైంది కాదు. మనదేశంలో చాలావరకు ‘ఎస్’ రకం వైరసే వ్యాపిస్తున్నట్టు తోస్తోంది. అలాగని అజాగ్రత్త పనికిరాదు. పిల్లల విషయంలో నిర్లక్ష్యం అసలే వద్ధు కొవిడ్-19తో బాధపడుతున్న సమయంలో గానీ ఇన్ఫెక్షన్ తగ్గిపోయిన తర్వాత గానీ గుండె వైఫల్యం వంటి లక్షణాలు పొడసూపే అవకాశముంది. మరో ముఖ్యమైన విషయం- దాదాపు సగం మందిలోనే వైరస్ పాజిటివ్‌గా ఉండటం. మిగతా సగం మందిలో నెగెటివ్‌గా తేలుతున్నా అప్పటికే ఇంట్లో ఎవరో ఒకరు వైరస్ బారినపడి ఉంటుండటం, కొందరు పిల్లల్లో కొవిడ్‌ను ఎదుర్కొనే యాంటీబాడీలు కనిపిస్తుండటం గమనార్హం. అంటే పెద్దవాళ్ల నుంచి పిల్లలకు వైరస్ సోకి, పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోయి ఉండొచ్చన్నమాట. ఆ తర్వాతే తీవ్ర సమస్యగా పరిణమిస్తోందన్నమాట. మనదేశంలో ప్రస్తుతం లక్షణాలు లేనివారికి కరోనా పరీక్షలు నిర్వహించటం లేదు. అందువల్ల ఎవరికి కరోనా ఉందో, ఎవరికి లేదో తేల్చుకోవటం కష్టమైపోతోంది. ఇంట్లో పెద్దవాళ్లకు కరోనా సోకినా కొందరిలో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్ఛు లక్షణాలున్నా అంత తీవ్రంగా ఉండకపోవచ్ఛు ఇన్ఫెక్షన్ అంతటితోనే తగ్గిపోనూ వచ్ఛు కానీ వారి నుంచి వైరస్ పిల్లలకు సోకకూడదనేమీ లేదు. కొందరిలో కొవిడ్ పాజిటివ్‌గా రావటానికి, కొందరిలో లేకపోవటానికి ఇదే కారణమవుతుండొచ్ఛు ఏదేమైనా ప్రస్తుతం పిల్లల్లో హఠాత్తుగా గుండె వైఫల్యం వంటి లక్షణాలు కనిపించటం కొవిడ్-19 దుష్ప్రభావాల ఫలితమేనని ప్రపంచ ఆరోగ్యసంస్థ సైతం పేర్కొంటోంది. కొవిడ్ వచ్చి పోయిన ఒకట్రెండు వారాల్లో ఇలాంటి సంకేతాలు కనిపించే ప్రమాదం లేకపోలేదని హెచ్చరిస్తోంది. అందుకే పిల్లల్లో ఆయాసం, కాళ్లవాపు, దద్దు వంటి విపరీత లక్షణాలు కనిపిస్తే ముందుగా ఇంట్లో ఎవరికైనా కరోనా సోకిందా అనేది చూడటం ముఖ్యం. తల్లిదండ్రులకు తప్పకుండా కరోనా పరీక్ష చెయ్యాల్సి ఉంటుంది.
ఏంటీ కారణం?
ఏదైనా కొత్త వైరల్ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత ఒంట్లో రోగనిరోధకశక్తి దాన్ని ఎదుర్కొనే సామర్థ్యాన్ని సంతరించుకుంటుంది. పిల్లల్లో ఇది పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందదు. మరోవైపు రోగనిరోధకశక్తి అతిగా స్పందించటమూ ప్రమాదకరంగా పరిణమిస్తోంది. ఇన్ఫెక్షన్లు తలెత్తినప్పుడు రోగనిరోధక వ్యవస్థలో భాగమైన టి కణాలు వైరస్‌ను ఎదుర్కొవటానికి ఇమ్యునోగ్లోబులిన్ అనే ప్రొటీన్‌ను ఉత్పత్తి చేస్తాయి (కణ మాధ్యమ రోగనిరోధకశక్తి). వైరస్‌ను ఎదుర్కోవటానికిది సరిపోతుంది. కొందరు పిల్లల్లో ఇన్ఫెక్షన్ తలెత్తకపోవటానికి కారణం ఇదే. ప్రొటీన్ తగినంత తీసుకోనివారిలో, పోషణలోపం గలవారిలో ఇమ్మునోగ్లోబులిన్ సరిగా ఉత్పత్తి కాకపోవచ్ఛు కొందరిలో స్వభావరీత్యానూ అంతగా తయారుకాకపోవచ్ఛు ఫలితంగా ఇన్ఫెక్షన్ తలెత్తుతుంది. మరోవైపు- కొందరిలో వైరస్‌ను ఎదుర్కోవటానికి యాంటీబాడీలు పెద్ద సంఖ్యలో ఉత్పత్తి అవుతుండొచ్చు (యాంటీబాడీ డిపెండెంట్ ఎన్హాన్స్మెంట్). ఇవి విపరీతంగా స్పందిస్తూ అదేపనిగా దాడిచేయొచ్చు (రోగనిరోధక వ్యవస్థ గతి తప్పటం). అంటే ఒంట్లో వైరస్ లేకపోయినా యాంటీబాడీలు గుండె, రక్తనాళాలు, పేగుల వంటి వాటిపై దాడిచేసి దెబ్బతీయొచ్చన్నమాట. పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్‌కు ఇదే కారణమవుతుండొచ్చని భావిస్తున్నారు. కొవిడ్-19 ఇన్ఫెక్షన్ వచ్చిపోయిన తర్వాత 2-4 వారాల్లో ఇది తలెత్తే ప్రమాదముంది.
సమస్యలు 3 రకాలు
పీడియాట్రిక్ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ప్రధానంగా మూడు రకాలుగా కనిపిస్తోంది. ఇవి ఒకదాంతో మరోటి కలిసిపోయి ఉండటం వల్ల గుర్తించటం, చికిత్స చేయటం కష్టమైపోతోంది. ఈ నేపథ్యంలో వీటి గురించి అవగాహన కలిగుండటం అత్యవసరం.
1. టాక్సిక్ షాక్ సిండ్రోమ్:
పిల్లలు హఠాత్తుగా జబ్బు పడిపోవటం దీని ప్రత్యేకత. దీనికి మూలం ఇన్ఫెక్షన్ మూలంగా పుట్టుకొచ్చే విషతుల్యాలు అవయవాల మీద దాడి చేయటం. అలాగే రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన శరీరం
మీదే దాడి చేయటం, ఇన్ఫెక్షన్ వచ్చిపోయాక రోగనిరోధక శక్తి మారిపోవటమూ ఇందుకు దోహదం చేస్తుండొచ్ఛు షాక్ సిండ్రోమ్ బారినపడ్డవారిలో ఉన్నట్టుండి రక్తపోటు పడిపోతుంది. గుండె, శ్వాస వేగం పెరుగుతాయి. చివరికి షాక్‌లోకి వెళ్లిపోతారు. మొదట్లో ఇది ఇటలీ, బ్రిటన్‌లో ఎక్కువగా కనిపించగా.. ఇప్పుడు అమెరికాలోనూ అధికంగా కనిపిస్తోంది. మనదేశంలోనూ ఇలాంటి కేసులు ఇప్పుడిప్పుడు వస్తున్నాయి గానీ గుర్తించటంలో పొరపడుతున్నారు. జాగ్రత్తగా పరిశీలిస్తే గానీ అసలు విషయం బయటపడటం లేదు.