Healthy heart tips: గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవటం, గుండెజబ్బుల బారినపడకుండా చూసుకోవటం ఎంత ముఖ్యమో కొవిడ్-19 మహమ్మారి మరోసారి గుర్తుచేసింది. గుండెజబ్బులతో బాధపడేవారికి కరోనాజబ్బు తీవ్ర చిక్కులు తెచ్చిపెట్టటం చూస్తున్నదే. కరోనాతో మరణించినవారిలో గుండెజబ్బులు గలవారి సంఖ్యా ఎక్కువగా ఉండటం తెలిసిందే.
మనకు కొవిడ్-19 కారక సార్స్-కోవీ-2 కొత్తదే కావొచ్చు. ఇది విసిరిన సవాళ్లు కొత్తవి కావొచ్చు. కానీ గుండెజబ్బుల మీద దశాబ్దాలుగా అధ్యయనాలు సాగుతూనే ఉన్నాయి. జీవనశైలి పరమైన అలవాట్లు గుండె మీద ఎంతగానో ప్రభావం చూపుతాయన్నది ఇవన్నీ స్పష్టంగానే పేర్కొంటున్నాయి. పొగ మానెయ్యటం, ఆరోగ్యకరమైన ఆహారం తినటం, చురుకుగా ఉండటం, బరువు తగ్గటం, రక్తపోటు అదుపులో ఉంచుకోవటం, కొలెస్ట్రాల్ పెరగకుండా చూసుకోవటం, రక్తంలో గ్లూకోజును తగ్గించుకోవటం.. ఈ ఏడు సూత్రాలు గుండెకు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చాలాకాలంగా చెబుతూనే ఉన్నారు. ఇవి ఒక్క గుండె ఆరోగ్యానికే కాదు, కొవిడ్-19, ఫ్లూ వంటి ఇన్‌ఫెక్షన్ల ముప్పులు తగ్గటానికీ దోహదం చేస్తాయి.
మరీ ఏడు సూత్రాలంటే ఎలా? అన్నీ పాటించటం ఎక్కడ కుదురుతుంది? అనుకునేవారు కొన్ని ఆచరించినా చాలు. ఆ మాటకొస్తే అందరికీ బరువు తగ్గాల్సిన, గ్లూకోజు అదుపులో ఉంచుకోవాల్సిన అవసరం ఉండకపోవచ్చు. చాలామందికి పొగ తాగే అలవాటూ లేకపోవచ్చు. నిజానికి ఇక్కడ సూత్రాల సంఖ్య ప్రధానం కాదు. ఎంతవరకు ఆచరిస్తున్నామన్నదే ముఖ్యం.
మనలో చాలామంది కూరగాయలు, పొట్టుతీయని ధాన్యాలు, చిక్కుళ్లు, పండ్ల వంటివి అంతగా తిననే తినరు. వ్యాయామాలూ సరిగా చేయరు. వారానికి కనీసం 150 నిమిషాల సేపు వేగంగా నడవటం వంటి ఒక మాదిరి తీవ్రమైన వ్యాయామం చేయాలన్నది నిపుణుల సిఫారసు. అలాగే వారానికి కనీసం 2 సార్లు బరువులు ఎత్తటం వంటి కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలూ చేయాలి. ఈ ఆహార, వ్యాయామ నియమాలు రెండింటిని పాటిస్తేనే బరువూ అదుపులో ఉంటుందనుకోండి.
దీంతో రక్తపోటు, కొలెస్ట్రాల్, గ్లూకోజు సైతం నియంత్రణలో ఉంటాయి. అందువల్ల కొన్ని చిన్న మార్పులతో గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవడం మీద దృష్టి పెట్టినా పెద్ద ఫలితమే కనిపిస్తుంది. ఇందులో ఎలాంటి సందేహం లేదు.