Healthy Breakfast: ఉదయాన్నే అల్పాహారం తీసుకోవడం మంచిది. ఎందుకంటే ఇది మనం రోజంతా ఉత్సాహంగా ఉండటంలో కీలక పాత్ర పోషిస్తుంది. చాలా మందికి ఏం తినాలో తోచదు. కొందరు ఏది అందుబాటులో ఉంటే దాన్ని తీసుకుంటారు. మరికొందరు కొంత సమయం వెచ్చించి పోషక విలువలున్న ఆహారాన్ని తయారు చేసుకుని తింటారు. సరైన ఆహారం తీసుకోకపోతే అది ఆ రోజు పనుల మీదే కాదు.. మొత్తం మన జీవక్రియ మీద తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రముఖ పోషకాహార నిపుణురాలు నేహా సహాయ తెలిపారు. రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినకూడని 4 పదార్థాలను ఆమె వివరించారు. అవేంటంటే..
You must Avoid These 4 Foods On An Empty Stomach :
1. నిమ్మరసంలో తేనె కలుపుకుని తాగడం
ఇదేంటీ.. వేడి నీటిలో నిమ్మకాయ, తేనె కలిపి తాగడం ఆపడమేంటీ అని అనుకుంటున్నారా..? మీరు చదివింది కరెక్టే. చాలా మంది తమ శరీరంలోని అదనపు కొవ్వును తగ్గించుకోవడానికి దీన్ని తాగుతారు. కానీ ఇది మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తుందని నేహ తెలిపారు. చెక్కరతో పోలిస్తే.. తేనెలో అధికంగా గ్లైసెమిక్ ఇండెక్స్, క్యాలరీలు ఉంటాయి. ప్రస్తుతం మార్కెట్లో దొరికే అధిక శాతం తేనె అంత స్వచ్ఛమైనది కాదని, దాన్ని షుగర్ సిరప్‌తో తయారు చేస్తున్నారని నేహ పేర్కొన్నారు. ఇలాంటి తేనెను పరిగడుపున తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు పెరిగే అవకాశముందని ఆమె హెచ్చరిస్తున్నారు. నిమ్మరసంలో తేనె కలుపుకొని తాగడం వల్ల రోజూ సాధారణం కంటే అధికంగా ఆహారం తీసుకోవడానికి దారితీస్తుందని వివరించారు.
2. పండ్లు
ఉదయం లేవగానే ఒక గిన్నెడు తాజా పండ్లను తీసుకుంటే ప్రయోజనం ఉంటుందని మనలో చాలా మంది అనుకుంటారు. కానీ ఇది సరైంది కాదని, ఇలాంటి అలవాటు ఉంటే మానుకుంటే ఉత్తమమని నేహ తెలిపారు. మిగతా అల్పాహారాలతో పోలిస్తే.. పండ్లు తొందరగా జీర్ణం అవుతాయని, అందువల్ల గంట తిరక్కుండానే మళ్లీ ఆకలి అవుతుందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఖాళీ కడుపుతో కొన్ని సిట్రస్ జాతి పండ్లు తినటం వల్ల ఎసిడిటీ వస్తుందని అన్నారు.