కొత్త కరోనా జబ్బు జిత్తులమారిలా వ్యవహరిస్తోంది. రోజుకో కొత్త వేషం ధరిస్తోంది. అవటానికిది వైరల్ ఇన్‌ఫెక్షనే అయినా జీవక్రియ రుగ్మతనూ (మెటబాటిక్ డిసీజ్) తలపింపజేస్తోంది. రోగనిరోధక వ్యవస్థను అస్తవ్యస్తం చేస్తూ (ఇమ్యునోజెనిక్), రక్తాన్ని చిక్కబరుస్తూ (థ్రాంబోజెనిక్), వాపు ప్రక్రియను ప్రేరేపిస్తూ (ఇన్‌ఫ్లమేటరీ) పలు చిక్కులు తెచ్చిపెడుతోంది. ఉద్ధృత దశలో ఇబ్బంది పెట్టటమే కాదు.. పూర్తిగా నయమైన తర్వాతా సుదీర్ఘంగా వెంటాడుతోంది (లాంగ్ కొవిడ్). కొవిడ్ బారినపడి, ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయిన సగానికి పైగా మంది 2-3 నెలలు దాటినా ఆయాసం, నిస్సత్తువ, ఆందోళన, కుంగుబాటు వంటి సమస్యలతో బాధపడుతుండటమే దీనికి నిదర్శనం.
సాధారణంగా కొవిడ్ లక్షణాలు రెండు వారాల్లో పూర్తిగా తగ్గిపోతాయి. కొందరికివి మరో వారం వరకు కొనసాగొచ్చు అంటే గరిష్ఠంగా 21 రోజుల్లో లక్షణాలన్నీ తగ్గిపోవాలన్నమాట. అదేంటో గానీ కొద్దిమందికి దగ్గుతో పాటు తలనొప్పి, ఆయాసం, ఒళ్లు నొప్పులు, నీళ్ల విరేచనాల వంటి లక్షణాలు విడవకుండా కొనసాగుతూ వస్తున్నాయి. కొందరిలో ఇవి 90 రోజుల వరకూ కొనసాగుతుండటం గమనార్హం. ఇలాంటి ఇబ్బందులు అన్నిసార్లూ ఒకేలా ఉండటం లేదు. వస్తూ పోతున్నాయి. మంచి విషయం ఏంటంటే- చాలామందిలో ఇవేవీ తీవ్రం కావటం లేదు. ప్రాణానికి అపాయమేమీ కలిగించటం లేదు. కానీ బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ఇప్పటికిప్పుడు వీటి గురించి తీవ్రంగా భయపడాల్సిన పనిలేదు గానీ ఒకింత జాగ్రత్త అవసరం.
ముప్పు ఎవరికి?
* కొవిడ్ నిర్ధారణ అయినా, కాకపోయినా.. కొవిడ్‌కు చికిత్స తీసుకున్నా, తీసుకోకపోయినా.. ఒకటి కన్నా ఎక్కువ లక్షణాలు కనిపించేవారికి సుదీర్ఘ కొవిడ్ వచ్చే అవకాశముంది. అంటే దగ్గుతో పాటు తలనొప్పి, జ్వరం, ఆయాసం, నీళ్ల విరేచనాలు వంటి లక్షణాల్లో ఏదో ఒకటి.. లేదూ ఇంకా ఎక్కువ లక్షణాలు కనిపించినవారు సుదీర్ఘ కొవిడ్ బారినపడే అవకాశం ఎక్కువగా ఉంటోందన్నమాట.
* కరోనా జబ్బు మగవారిలో ఎక్కువగా కనిపిస్తున్నప్పటికీ సుదీర్ఘ కొవిడ్ మాత్రం మహిళల్లోనే అధికం. ఇది పిల్లల్లోనూ, 55 ఏళ్లు దాటినవారిలోనూ ఎక్కువగానే కనిపిస్తోంది.
మధుమేహం ప్రధానం
కరోనా జబ్బు బారినపడ్డవారిలో కొత్తగా మధుమేహం తలెత్తుతుండటం, గ్లూకోజు స్థాయులు మరీ ఎక్కువగా లేకపోయినా మధుమేహంలో మాదిరిగా రక్తంలో ఆమ్ల స్థాయులు విపరీతంగా పెరిగిపోతుండటం (కీటోఅసిడోసిస్) మనకు తెలిసిందే. ఇలాంటి ప్రభావాలు ఉద్ధృత దశలోనే కాదు.. 21 రోజుల తర్వాతా కనిపిస్తుండటం గమనార్హం. ఎందుకిలా? ఐఎల్6, సీఆర్‌పీ వంటి వాపు ప్రక్రియల సూచికలు ఇన్సులిన్‌కు వ్యతిరేకంగా పనిచేస్తుంటాయి. దీంతో తీవ్రమైన ఇన్సులిన్ నిరోధకత తలెత్తుతుంది. ఇది టైప్2 మధుమేహానికి దారితీస్తుంది. కొవిడ్ చికిత్సలో స్టిరాయిడ్ల వాడకమూ ఇందుకు దోహదం చేస్తోంది.
గ్లూకోజు బాగా పడిపోవటం: కొవిడ్‌తో గానీ స్టిరాయిడ్ల వాడకంతో గానీ కొత్తగా మధుమేహం బారినపడ్డ కొందరిలో మూత్రపిండాలు, కాలేయం పనితీరు తాత్కాలికంగా అస్తవ్యస్తం కావటమూ సమస్యగా పరిణమిస్తోంది. ఇది హఠాత్తుగా గ్లూకోజు స్థాయులు పడిపోవటానికీ దారితీస్తోంది (హైపోగ్లైసీమియా).
కీటోఅసిడోసిస్: సాధారణంగా మధుమేహంలో గ్లూకోజు స్థాయులు బాగా పెరిగిన సందర్భాల్లోనే రక్తంలో కీటోన్స్ పెరుగుతాయి (హైపర్ అస్మలార్ కీటోసిస్). కానీ సుదీర్ఘ కొవిడ్‌లో గ్లూకోజు స్థాయులు అంత ఎక్కువ లేకపోయినా, మామూలు స్థాయిలో ఉన్నా కూడా ఇవి పెరిగిపోవచ్ఛు ఎస్‌జీఎల్‌టీ2 ఇన్‌హిబిటార్స్ (గ్లిఫ్లోజిన్లు) వాడేవారిలో ఇలాంటి ప్రమాదం ఎక్కువగా కనిపిస్తోంది. రక్తంలో ఆమ్లం స్థాయులు పెరగటం వల్ల స్పృహ తప్పిపోవచ్చు పిల్లల్లో మధుమేహం: ఒకప్పుడు కాక్స్‌సాకీ బి వైరల్ ఇన్‌ఫెక్షన్‌తో పిల్లల్లో మధుమేహం రావటం గమనించాం. సైటోమెగాలో వైరస్‌ల వంటివీ పిల్లల్లో మధుమేహానికి దారితీస్తుంటాయి. ఇలాంటి ధోరణి కరోనా జబ్బులోనూ కనిపిస్తున్నట్టు కొన్ని అనుభవాలు చెబుతున్నాయి.