ఉప్పు అనగానే మనకు ముందుగా అధిక రక్తపోటే గుర్తుకొస్తుంది. అయితే ఉప్పు రక్తపోటు పెరగటానికే కాదు, మెదడుకూ చేటు చేస్తుందనే సంగతి మీకు తెలుసా? ఉప్పు ఎక్కువగా గల ఆహారం వల్ల జ్ఞాపకశక్తి, ఆలోచన సమస్యలూ తలెత్తుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది. ఉప్పు వాడకాన్ని చాలావరకు హైబీపీ, గుండెజబ్బులు, పక్షవాతం కోణంలోనే చూస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధనతో మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఇకపై డాక్టర్లు ప్రతి ఒక్కరినీ ఉప్పు వాడకం గురించి ఆరా తీయాల్సిన అవసరమూ రావొచ్చు.
ఉప్పుతో ముప్పేంటి?
ఉప్పు అధికంగా తిన్నప్పుడు చిన్న పేగుల్లో కొత్త ప్రతిస్పందన మొదలవుతున్నట్టు పరిశోధకులు గుర్తించారు. దీంతో టీహెచ్17 అనే తెల్లరక్తకణాలు పెద్ద మొత్తంలో ఉత్పత్తి కావటం.. ఇది రోగనిరోధక వ్యవస్థలో పాలుపంచుకునే ఐఎల్-17 ప్రోటీన్ స్థాయులు పెరగటానికి దారితీయటం సంభవిస్తోంది. ఇలా ఐల్-17 ప్రోటీన్ స్థాయులు బాగా పెరిగిపోతే నైట్రిక్ ఆక్సైడ్ సరఫరా తగ్గిపోతుంది. నైట్రిక్ ఆక్సైడ్ స్థాయులు తగ్గిపోతే రక్తనాళాలు బిగుసుకుపోతాయి. ఫలితంగా మెదడుకూ రక్తసరఫరా తగ్గిపోతోంది. అంటే పేగుల్లో తలెత్తే ప్రతిస్పందనలు జ్ఞాపకశక్తి, ఆలోచనా సమస్యలకు దారితీస్తున్నాయన్నమాట.
కేవలం మూడు నెలల పరిశోధనలోనే ఇలాంటి విషయాలు బయటపడితే పదేళ్ల పాటు చేస్తే ఇంకెన్ని దిగ్భ్రాంతికర అంశాలు బయటపడతాయోనని వీల్ కార్నెల్ మెడికల్ కాలేజీకి చెందిన కోస్టాంటినో లాడెకోలా చెబుతున్నారు. మెదడుకు రక్తసరఫరా తగ్గటం, మెదడులో రక్తనాళాలు సరిగా పనిచేయకపోవటం వంటివి దీర్ఘకాలం కొనసాగితే పెద్ద ప్రమాదమే ముంచుకురావొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఉప్పు ఎక్కువగా తినే దేశాల్లో పక్షవాతం, డిమెన్షియా ఎక్కువగా కనబడుతున్నట్టు కొన్ని ఇతర పరిశోధనలు కూడా పేర్కొంటున్న సంగతిని ఆయన గుర్తుచేస్తున్నారు. అందువల్ల డిమెన్షియా నివారణకు ఉప్పు తక్కువగా తినటం కీలకమైన అడుగు కాగలదని సూచించారు.
ఇదీ చూడండి:పిల్లల చదువు కోసం సమయం కేటాయిస్తున్నారా?