తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పచ్చబొట్లతో చర్మవ్యాధులు- జర భద్రం! - skin problem with tattoos

ఒకప్పుడు ముచ్చట కొద్దీ పొడిపించుకున్న పచ్చబొట్టు.. ఇప్పుడు సౌందర్య సాధనంగా మారిపోయింది. అయితే ప్రస్తుతం కాలంలో రకరకాల పచ్చబొట్లు కనిపిస్తున్నాయి. వీటి వల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో చూద్దాం.

Health issues arise with tattoos says health experts
పచ్చబొట్లతో చర్మవ్యాధులు- జర జాగ్రత్త!

By

Published : Dec 16, 2020, 11:46 AM IST

పచ్చబొట్టు మనకు కొత్త కాదు. ఒకప్పుడు ముచ్చట కొద్దీ పొడిపించుకునేవారు. ఇప్పుడిదో సౌందర్య సాధనంగానూ మారిపోయింది. ఒకనాటి ఆలివ్‌ గ్రీన్‌లోనే కాదు, రకరకాల రంగుల్లోనూ పచ్చబొట్లు దర్శనమిస్తున్నాయి. వీటితో అందం ఇనుమడించటం మాట అటుంచితే కొన్ని ముప్పులు లేకపోలేదు. జాగ్రత్తలు తీసుకోకపోతే జబ్బుల బారినపడే ప్రమాదముంది.

  • కళాకారులు చేత్తో పట్టుకునే పరికరంతో చర్మం లోపలి పొరల్లోకి రంగు ద్రవ్యాలను జొప్పిస్తారు. మత్తుమందు ఇవ్వకపోవటం వల్ల కొంత నొప్పి పుడుతుంది. కొన్నిసార్లు రక్తస్రావం కావొచ్చు. సూదులను సరిగా శుభ్రం చేయకపోతే ఇన్‌ఫెక్షన్లు తలెత్తొచ్చు. హెపటైటిస్‌ బి, సి వంటి తీవ్ర ఇన్‌ఫెక్షన్లూ సోకొచ్చు.
  • కొన్ని వర్ణద్రవ్యాల్లో లోహాలుంటాయి. మున్ముందు ఎప్పుడైనా ఎంఆర్‌ఐ తీస్తే వీటి మూలంగా మంటతో కూడిన నొప్పి రావొచ్చు. వాపు తలెత్తొచ్చు. ఎంఆర్‌ఐ ఫలితాలూ తప్పుగా రావొచ్చు.
  • రంగులతో.. ముఖ్యంగా ఎరుపు, ఆకుపచ్చ, పసుపు, నీలి రంగులతో కొందరికి అలర్జీ మొదలవ్వచ్చు. ఇది దురదకు దారితీస్తుంది. కొన్నిసార్లు ఏళ్ల తర్వాత కూడా దురద రావొచ్చు.
  • చెమట గ్రంథులు ఉండే పొరల్లో రంగులను జొప్పించటం వల్ల చెమట గ్రంథుల పనితీరు అస్తవ్యస్తం కావొచ్చు. చెమట ఉత్పత్తి 50శాతం వరకు తగ్గిపోవచ్చు. పెద్ద పెద్ద పచ్చబొట్లు పొడిపించుకున్నవారిలో ఇలాంటిది ఎక్కువ. వేడి, తేమతో కూడిన చోట్ల పనిచేసేవారికి, క్రీడాకారులకు ఇది చిక్కులు తెచ్చిపెట్టొచ్చు.
  • ఇన్‌ఫెక్షన్‌ మూలంగా చర్మకణాలు దెబ్బతిని, కణజాలం గట్టి పడొచ్చు. కొందరికి చిన్న చిన్న గడ్డల్లాంటివి ఏర్పడొచ్చు. దీంతో చర్మం సాగే గుణం తగ్గిపోతుంది. కదలికలు కష్టమవుతాయి. ఇలాంటి సమస్యలకు దీర్ఘకాలం చికిత్స అవసరమవుతుంది.

ఇవి చూసుకోవాలి..

  1. పచ్చబొట్టు వేసేవారు విధిగా చేతులకు గ్లవుజులు ధరించేలా, స్టెరిలైజ్‌ చేసిన పరికరాలనే వాడేలా చూసుకోవాలి.
  2. టేబుళ్లు, చర్మాన్ని స్టెరిలైజింగ్‌ ద్రావణాలతో శుభ్రం చేసిన తర్వాతే పచ్చబొట్టు పొడిపించుకోవాలి.
  3. పచ్చబొట్టు వేయించుకున్నాక చర్మాన్ని పొడిగా ఉంచుకోవాలి. దుమ్ముధూళి, ఎండ పడనీయొద్దు. చర్మానికి అంటుకుపోయే దుస్తులు వేసుకోవద్దు. బొట్టు వేసిన భాగం నయం కావటానికి రెండు వారాలు పట్టొచ్చు.
  4. పచ్చబొట్లతో తరచూ ఎదుర్కొనే సమస్య విచార పడటం. మూడ్, స్టైళ్లు, నచ్చిన వ్యక్తులు ఎప్పటికప్పుడు మారిపోతుంటారు కదా. దీంతో మథన పడిపోతుంటారు. శాశ్వత పచ్చబొట్లయితే అదేపనిగా గతం తొలుస్తుంటుంది. వీటిని పూర్తిగా తొలగించటం అసాధ్యం గానీ లేజర్లు, సర్జరీలు, చర్మం పైపొరను తొలగించటం వంటి పద్ధతులతో రంగు వెలిసిపోయేలా చేయొచ్చు. కాకపోతే ఇవన్నీ సంక్లిష్టమైన పద్ధతులు. ఖర్చూ ఎక్కువే అవుతుంది. అందువల్ల గోరింటాకు, వృక్ష రంగులతో తాత్కాలిక పచ్చబొట్లు వేయించుకోవటం మంచిది.

ఇదీ చూడండి:మందులే కాదు.. మంచి తిండీ ముఖ్యమే!

ABOUT THE AUTHOR

...view details