తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

రోజూ శృంగారంతో ఆ సమస్యలన్నీ మాయం - శృంగారం చేయడం వలన కలిగే లాభాలు

శృంగారమంటే ఆనందం, సంతోషం, ఉత్సాహాన్ని కలిగించటమే కాదు ఆరోగ్య సంబంధాల మీదా గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. శృంగార లేమితో రక్తపోటు పెరుగుతుంది, నిద్ర అస్తవ్యస్తమవుతుంది, మతిమరుపూ వస్తుంది. మరి శృంగారంతో కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందామా.

sex education
శృంగార లాభాలు

By

Published : Aug 30, 2022, 8:58 AM IST

Sex Benefits : ఆనందం, సంతోషాన్ని కలిగించటమే కాదు.. ఆరోగ్యం, సంబంధాల మీదా శృంగారం గణనీయమైన ప్రభావం చూపిస్తుంది. అవును. నమ్మినా నమ్మకపోయినా శృంగార లేమితో రక్తపోటు పెరుగుతుంది. నిద్ర అస్తవ్యస్తమవుతుంది. మతిమరుపూ తలెత్తుతుంది. మరి శృంగారంతో ఒనగూరే ప్రయోజనాలేంటో చూద్దామా

ఆందోళన తగ్గుముఖం
ఒత్తిడి నుంచి బయటపడే మార్గాలు అనగానే వ్యాయామం, ధ్యానం వంటివే గుర్తుకొస్తాయి గానీ శృంగారం తక్కువదేమీ కాదు. ఇదీ మానసిక ఒత్తిడి, ఆందోళన తగ్గటానికి తోడ్పడుతుంది. ఒత్తిడికి శరీరం స్పందించే క్రమంలో విడుదలయ్యే హార్మోన్ల మోతాదులు శృంగారంతో తగ్గుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ మాటకొస్తే చురుకైన శృంగార జీవనం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. ఒకరకంగా ఇదీ ఆందోళన దరిజేరకుండా చూసేదే.

గుండెకు హుషారు
శృంగారం గుండె ఆరోగ్యానికీ మేలు చేస్తుంది. వారానికి రెండుసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే సగటున నెలకు ఒకసారి, అంతకన్నా తక్కువగా శృంగారంలో పాల్గొనేవారికి గుండె జబ్బు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటున్నట్టు పరిశోధనలు చెబుతున్నాయి. శృంగారంతో శరీరానికి వ్యాయామం లభించటం దీనికి కొంతవరకు కారణం కావొచ్చు. ఆందోళన, కుంగుబాటు తగ్గటమూ గుండెకు మేలు చేస్తాయి. అన్నింటికన్నా ముఖ్యంగా చురుకుగా శృంగారంలో పాల్గొనేవారు శారీరకంగా, మానసికంగా మరింత ఆరోగ్యంగా ఉండటం గమనార్హం.

వ్యాయామ ప్రయోజనం
శృంగారంలో పాల్గొన్నప్పుడు నిమిషానికి సుమారు 6 కేలరీలు ఖర్చవుతాయి. ఇది కాస్త వేగంగా నడిచినప్పుడు ఖర్చయ్యే కేలరీలతో సమానం. ఇది అంత ఎక్కువగా అనిపించకపోవచ్చు గానీ దీర్ఘకాలంలో చూస్తే తక్కువేమీ కాదు. శృంగారం మూలంగా తోటపని, నడక, మెట్లు ఎక్కుతున్నప్పుడు తీసుకునేంత ఆక్సిజన్‌ శరీరానికి లభిస్తుంది కూడా. పైగా శృంగారంతో ఉత్సాహం ఇనుమడించటం వల్ల ఇతరత్రా వ్యాయామాలు చేయటం మీదా ఆసక్తి పెరుగుతుంది.

జ్ఞాపకశక్తి మెరుగు
మెదడు సమర్థంగా పనిచేయటానికీ శృంగారం తోడ్పడుతుంది. కచ్చితమైన కారణమేంటన్నది తెలియదు గానీ ఇది జ్ఞాపకశక్తిని మెరుగు పరుస్తున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 50 ఏళ్లు దాటినవారిలో మరింత ప్రభావం చూపిస్తున్నట్టు బయటపడింది. భాగస్వాముల మధ్య సాన్నిహిత్యం మూలంగా మెదడులో జ్ఞాపకశక్తితో ముడిపడిన హిప్పోక్యాంపస్‌ వంటి భాగాలు ప్రేరేపితమవటం దీనికి కారణం కావొచ్చని భావిస్తున్నారు.

కంటి నిండా నిద్ర
భావప్రాప్తి పొందినప్పుడు ఆక్సిటోసిన్‌ అనే హార్మోన్‌ విడుదలవుతుంది. దీన్ని ‘ప్రేమ’ హార్మోన్‌ అనీ పిలుచుకుంటారు. ఇది భాగస్వాముల మధ్య ప్రేమానురాగాలను పుట్టించి, అనుబంధాలను బలోపేతం చేస్తుంది. అలాగే శృంగార సమయంలో హాయి భావన కలిగించే ఎండార్ఫిన్లు సైతం పుట్టుకొస్తాయి. ఈ రెండింటి కలయిక మత్తుమందులా పనిచేసి నిద్ర పట్టేలా చేస్తుంది. మహిళలకైతే ఈస్ట్రోజెన్‌ హార్మోన్‌ ప్రయోజనమూ చేకూరుతుంది. కంటి నిండా నిద్ర పోతే చెప్పేదేముంది? రోగనిరోధకశక్తి పుంజుకోవటం, ఆయుష్షు పెరగటం, పగటిపూట హుషారుగా ఉండటం వంటి ఇతరత్రా లాభాలెన్నో చేకూరతాయి.

బంధం బలోపేతం
శృంగార ఉత్సాహ ప్రభావం దాదాపు రెండు రోజుల వరకు కొనసాగుతుంది. ఇది భాగస్వామితో దీర్ఘకాల అనుబంధానికి బీజం వేస్తుంది. ఆరోగ్యకరమైన, ఆనందమైన శృంగార సంబంధం భాగస్వాముల మధ్య అన్యోన్యమైన ప్రేమానుబంధాన్ని పెంచుతుంది. కనీసం వారానికి ఒకసారి శృంగారంలో పాల్గొనే దంపతులు చాలా ఆనందంగా ఉంటున్నట్టు పరిశోధనలు పేర్కొంటున్నాయి.

ప్రోస్టేట్‌కు రక్షణ
మగవారిలో ప్రోస్టేట్‌ గ్రంథి ఆరోగ్యంగా ఉండటానికీ శృంగారం దోహదం చేస్తుంది. కచ్చితమైన కారణమేంటో తెలియదు గానీ నెలకు కనీసం 21 సార్లు స్ఖలనం అయిన వారితో పోలిస్తే ఏడు కన్నా తక్కువసార్లు స్ఖలనం అయినవారికి ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు ఎక్కువగా ఉంటున్నట్టు ఒక అధ్యయనంలో బయటపడింది. కానీ అపరిచితులతో అసురక్షిత శృంగారం, ఎక్కువమందితో శృంగారంతో ప్రోస్టేట్‌ క్యాన్సర్‌ ముప్పు పెరిగే అవకాశముందని తెలుసుకోవాలి. కాబట్టి జాగ్రత్త!

నొప్పుల నుంచి ఉపశమనం
నొప్పులు, బాధల నుంచి దృష్టిని మరల్చటానికి శృంగారం మంచి సాధనం. దీంతో నొప్పులు తగ్గిన భావన కలుగుతుంది. అంతేనా? భావప్రాప్తి పొందినప్పుడు విడుదలయ్యే ఎండార్ఫిన్లు, ఇతర హార్మోన్లు తలనొప్పి, వెన్ను నొప్పి, కాళ్ల నొప్పులు తగ్గటానికీ తోడ్పడతాయి.

భవిష్యత్‌ సమస్యల నివారణ
వాడుకోకపోతే ఏదైనా పనికిరాకుండా పోతుందంటారు. విచిత్రంగా అనిపించినా ఇది శృంగారానికీ వర్తిస్తుంది. అంగాంగ సంభోగం లేకపోతే నెలసరి నిలిచిన మహిళల్లో యోని కణజాలం పలుచగా అవ్వచ్చు. ముడతలు పడొచ్చు, పొడిబారొచ్చు. ఇది సంభోగ సమయంలో నొప్పికి దారితీస్తుంది. శృంగారం మీద ఆసక్తీ తగ్గొచ్చు. సగటున వారానికి ఒకటి కన్నా తక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారితో పోలిస్తే కనీసం వారానికోసారైనా శృంగారం నెరిపే మగవారికి స్తంభనలోపం ముప్పు రెండు రెట్లు ఎక్కువగా ఉంటున్నట్టు కొన్ని పరిశోధనలు చెబుతున్నాయి.

రక్తపోటు అదుపు
శృంగారంతో రక్తపోటు అదుపులో ఉండే అవకాశముంది. ఎందుకంటే శృంగారం ఒకరకమైన ఏరోబిక్‌, కండరాలను వృద్ధి చేసే వ్యాయామాల మాదిరి ప్రభావాన్ని చూపుతుంది. ఇది ఆందోళనను తగ్గించి, హాయి భావన కలిగిస్తుంది. ఇవి రెండూ రక్తపోటు పెరగకుండా చూసేవే.

రోగనిరోధక వ్యవస్థ బలోపేతం
అంతగా శృంగారం చేయనివారితో పోలిస్తే వారానికి ఒకట్రెండు సార్లు శృంగారంలో పాల్గొనేవారిలో రోగనిరోధకశక్తి బలంగా ఉంటున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. దీనికి కారణం సూక్ష్మక్రిములతో పోరాడే ఇమ్యునోగ్లోబులిన్‌ ఏ మోతాదులు పెరగటం. అయితే అతి శృంగారంతో ఉపయోగం లేదు. అంతగా శృంగారంలో పాల్గొననివారిలోనూ వారానికి మూడు కన్నా ఎక్కువసార్లు శృంగారంలో పాల్గొనేవారిలోనూ ఐజీఏ మోతాదులు ఒకేలా ఉంటున్నట్టు పరిశోధకులు గుర్తించారు.

ఇవీ చదవండి :ఈ ఆయుర్వేద చిట్కాలతో మీ కిడ్నీలు సేఫ్​

వారు శృంగారం పట్ల ఆసక్తి చూపరు, పెంపకమే కారణమా

ABOUT THE AUTHOR

...view details