వ్యాయామం శరీర సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. రోగనిరోధకశక్తిని బలోపేతం చేస్తుంది. మధుమేహం, అధిక రక్తపోటు, క్యాన్సర్ వంటి రకరకాల జబ్బుల బారినపడకుండా కాపాడుతుంది. అందుకే రోజూ కనీసం 30 నిమిషాల సేపు వ్యాయామం చేయాలన్నది నిపుణుల సూచన. అయితే పని ఒత్తిళ్ల మూలంగానో, ఇతరత్రా కారణాలతోనో చాలామందికి రోజూ వ్యాయామం చేయటం కుదరకపోవచ్చు. అంతమాత్రాన దిగాలు పడాల్సిన అవసరం లేదని తాజా అధ్యయనం భరోసా ఇస్తోంది. వారాంతాల్లో వ్యాయామం చేసినా మంచిదేనని చెబుతోంది.
వారంలో రెండు మూడు సార్లు తీవ్రంగా 75 నిమిషాల సేపు.. లేదంటే ఒక మాదిరిగా 150 నిమిషాల సేపు వ్యాయామం చేసినవారికి మరణం ముప్పు తగ్గుతున్నట్టు తేలటం గమనార్హం. ఇలాంటి 'వారాంత యోధులకు' అన్ని రకాల కారణాలతో సంభవించే మరణం ముప్పు 30% తగ్గుతుండగా.. క్యాన్సర్ మరణం ముప్పు 18%, గుండెజబ్బు మరణాల ముప్పు 40% తగ్గుతుండటం విశేషం.