వేసవి రాగానే వీధులు మామిడి పళ్లతో కళకళలాడుతుంటాయి. నోరూరించే ఈ బంగారు రంగు పళ్లను పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టపడని వారుండరు. పండును కోసి ముక్కలు చేసి తినే వారు కొందరు, రంధ్రం చేసి గుజ్జును అలాగే జుర్రుకునే వారు కొందరు, లస్సీ, మ్యాంగో షేక్‌గా చేసి తాగేవారు మరికొందరు.. ఇలా అనేక రకాలుగా మామిడిని రుచి చూస్తారు. ఇందులో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయో తెలుసా?
పోషకాలు:
మామిడి పళ్లలో మన ఆరోగ్యానికి అవసరమైన ఎన్నో విటమిన్లు, ఖనిజాలు ఉన్నాయి. విటమిన్ ఎ, బి5, బి6, సి, ఇ, కె లతో పాటు మాంసకృత్తులు, పొటాషియం, మ్యాంగనీస్, మెగ్నీషియం, ఫోలేట్ మొదలైనవి ఉన్నాయి. ఇది మనకు అందించే క్యాలరీలు కూడా తక్కువే. విటమిన్ సి ఎక్కువగా ఉండటం వల్ల రోగ నిరోధక శక్తికి ఉపయోగపడుతుంది. ఇనుప ధాతువు (ఐరన్) రక్తంలోకి చేరి కణజాలాల్లో మరమ్మతులు వేగంగా జరుగుతాయి. ఒకరోజులో మనకు అవసరమయ్యే విటమిన్ సి పరిమాణంలో 70 శాతాన్ని మామిడి పండు అందించగలదు.
యాంటీ ఆక్సిడెంట్లుగా మామిడి పళ్లు:
శరీరంలో నిత్యం జరిగే కణజీవన చర్యలలో విడుదలయ్యే ఫ్రీ రాడికల్స్ అనే విష పదార్ధాలను సంహరించటంలో యాంటీ ఆక్సిడెంట్లు కీలక పాత్ర వహిస్తాయి. మామిడి పళ్లలో ఇవి.. పాలిఫెనాల్స్ రూపంలో ఉన్నాయి.
మెరిసే చర్మం కోసం:
మామిడి పండులో విటమిన్ ఎ, సి ఉండటం వల్ల చర్మానికి మంచి ప్రభ (గ్లో) కలుగుతుంది. చర్మపు ముడుతలను మామిడి ఎదుర్కోగలదు. విటమిన్ సి కొలాజన్‌ను తయారుచేయటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది కావున చర్మపు బిగుతును రక్షిస్తుంది. వేసవి ఎండలో తీక్షణమైన అల్ట్రా వయోలెట్ కారణాల నుంచి కూడా చర్మాన్ని కాపాడతాయి.