Importance of Smile: మన అంతిమ లక్ష్యం ఆనందమే! కావాలంటే చేస్తున్న పనులను ఒకసారి పరిశీలించండి. పుస్తకం చదివినా, సినిమా చూసినా, స్నేహితులతో షికారు చేసినా, తీర్థయాత్రలకు వెళ్లినా, రుచికరమైన భోజనాన్ని ఆస్వాదించినా.. అన్నింటి పరమార్థం ఆనంద సాధనే. ఒకవైపు మనసులో సంతోషం పెల్లుబుకుతున్నప్పుడు ముఖం మీద నవ్వు విరబూస్తుంటుంది. మరోవైపు నవ్వుతున్నప్పుడు అప్రయత్నంగానే ఆనందమూ కలుగుతుంది. ఇవి రెండూ పరస్పరం ఆధారపడే ఉంటాయి. ఏది ముందు, ఏది వెనక అన్నది చెప్పటం కష్టం.
effect of smile on others: కానీ నవ్వు, ఆనందాల సంయోగం ఆరోగ్యానికి తొలిమెట్టు అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మనసారా నవ్వుకోవటం, సహజంగా నవ్వుని ఆస్వాదించటం గగనమైపోతోంది. నవ్వలేకపోవటం, ప్రశాంతంగా నవ్వే సందర్భాలు రోజురోజుకీ తగ్గిపోవటం ఒకరకంగా మన మనుగడకే సవాలు విసురుతున్నాయి. ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ఎన్నెన్నో జీవనశైలి సమస్యలకు మానసిక ప్రశాంతత కొరవడటమే కారణమవుతోందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఒక్క నవ్వుతోనే ఆనందాన్ని, ప్రశాంతతను సాధించొచ్చు. ఫలితంగా చక్కటి మానసిక, శారీరక ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు.
నవ్వంటే ఏంటి?
what is smile:నవ్వు అనేది ముఖంలో పైకి కనిపించే ఒక సంకేతం. దీనికి మెదడు, మనసు అంతర్గతంగా తోడ్పడతాయి. ఆనందం, సంతోషం, వినోదం వంటి వాటిని మనం నవ్వుతోనే వ్యక్తం చేస్తాం. నవ్వొచ్చేటప్పుడు ఆపుకోవటం లేదా ఆపుకోలేక నవ్వేయటం ఆయా సందర్భాలపై ఆధారపడి ఉంటుంది. పరిసరాలు, పరిచయాలు కూడా ఇందులో పాలు పంచుకుంటాయి. ఆహ్లాదకరమైన పరిస్థితుల్లో, సంతోషంగా ఉన్నట్టు భావించినప్పుడు మెదడులో ఆనంద హార్మోన్లు (ఎండార్ఫిన్లు) ఉత్పత్తి అవుతాయి. అదే సమయంలో ముఖంలోని కండరాలకు నాడీ సంకేతాలు అందుతాయి. నోటి చుట్టూరా ఉండే కండరాలు సంకోచించి నవ్వు పుట్టుకొస్తుంది.
అదే సమయంలో ముఖం కండరాల నుంచి మెదడుకు అందే సంకేతాలు మరింత ఆనందం కోసం పరితపించేలా చేసే కేంద్రాన్ని ప్రేరేపితం చేస్తాయి. దీంతో మరింత ఎక్కువగా ఆనంద హార్మోన్లు ఉత్పత్తి అవుతాయి. ఇదంతా ఒక వలయంలా సాగుతూ వస్తుంది. అంటే మెదడు ఆనందంగా ఉన్నట్టు భావిస్తే నవ్వు పుట్టుకొస్తుంది, నవ్వినప్పుడు మెదడు మరింతగా ఆనందిస్తుందన్నమాట. లాఫింగ్ క్లబ్‌లు, లాఫింగ్ థెరపీల ప్రధాన సూత్రం ఇదే.
ఔషధంగానూ..
నవ్వటంలో పిల్లలే ఛాంపియన్లు. పిల్లలు రోజుకు సగటున 400 సార్లు నవ్వుతారని పరిశోధనలు చెబుతున్నాయి. అదే పెద్దవారు రోజుకు దాదాపు 40-50 సార్లే నవ్వుతారు. పిల్లలు అంత సంతోషంగా, కల్మషం లేకుండా ఉండటానికి కారణం ఇదేనంటే అతిశయోక్తి కాదేమో. ఒకప్పుడు వైద్యులు తమ దగ్గరకు చికిత్స కోసం వచ్చేవారికి మందులతో పాటు రోజుకు 500 సార్లు నవ్వమనీ రాసి ఇచ్చేవారు! మానసిక స్థితిని, దీంతో పాటు ఆరోగ్యాన్నీ నవ్వు మెరుగు పరుగస్తుందని ఆనాడే గ్రహించారనటానికి ఇదో నిదర్శనం.
నవ్వటానికి సరదా చిట్కాలు!
మనసుండాలే గానీ నవ్వుకోవటానికి బోలెడన్ని అవకాశాలు. నవ్వు తెప్పించే పుస్తకాలు, జోక్స్, కార్టూన్లు, వీడియోల సంగతి సరేసరి. ఇవే కాదు, నవ్వటానికి తగిన పరిస్థితులను, సందర్భాలను మనమే సృష్టించుకోవచ్చు. ఇందుకు సరదాగా కొన్ని ప్రయత్నాలు చేయొచ్చు.
పోస్ట్ ఇట్ నోట్ ఛాలెంజ్: విషయాలను గుర్తుంచుకోవటానికి కాగితం మీద రాసి గోడకు అంటిస్తుంటాం కదా. ఇలాంటి 10-20 రంగుల పోస్ట్ ఇట్ నోట్లను సేకరించుకోవాలి. నవ్వు పుట్టించే వ్యక్తులు, స్థలాలు లేదా వస్తువులను వాటిపై రాసుకోవాలి. రోజూ ఉదయం వాటిని ఓసారి చూస్తుంటే అప్రయత్నంగానే ముఖం మీద చిరునవ్వు కదలాడుతుంది.
స్మైల్ కొల్లేజ్:
మనం నవ్వుతున్నప్పుడు తీసిన ఫొటోలు, స్నేహితులతో సరదాగా నవ్వుతున్న ఫొటోలు, మనకు నవ్వు పుట్టించే ఫొటోలను ఒక ఫ్రేమ్‌లో చేర్చి, గుది గుచ్చాలి. దీన్ని వాట్సప్, ఫేస్బుక్ వంటి సామాజిక మాధ్యమాల్లో సరదాగా పోస్ట్ చేసి చూడండి. ఇది మనం నవ్వుకోవటానికే కాదు, ఇతరులను నవ్వించటానికీ తోడ్పడతుంది.
వెయిటింగ్ ఛాలెంజ్:
ట్రాఫిక్‌లో చిక్కుకున్నప్పుడో, క్యూలో ఎక్కువసేపు నిల్చున్నప్పుడో సరదాగా ఓసారి గట్టిగా నవ్వటానికి ప్రయత్నించండి. ఇతరులు తిరిగి నవ్వితే సరదాగా మరోసారి నవ్వి చూడండి.
19 ఛాలెంజ్:
సుమారు 19 రకాల నవ్వులు ఉన్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. వీటిలో మనకు ఎన్ని నవ్వులు వచ్చు? తెలుసుకోవాలని ఉందా? అయితే రకరకాల సందర్భాల్లో నవ్వుతున్నప్పుడు ఫొటోలు తీసుకొని పరిశీలించండి. అలాగే స్నేహితులు, కుటుంబ సభ్యుల చిత్రాలను కూడా తీసి బేరీజు వేయండి. అసంకల్పితంగానే నవ్వు రావటం ఖాయం.