Health Benefits Of Seeds In Telugu :మనిషి ఆరోగ్యానికి అవసరమైన ఆహార పదార్థాలు చాలా ఉన్నాయి. మనం రోజూ తినే అన్నం, కూరగాయలతో పాటు మాంసం, గుడ్లు, పండ్ల వల్ల శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయి. అయితే, ఇవే కాకుండా కొన్ని రకాల గింజల వల్ల కూడా మన ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. కానీ వాటి గురించి చాలా మందికి తెలియదు. అందుకే మనకు ఆరోగ్యపరంగా ప్రయోజనం కలగజేసే పలు రకాల గింజల గురించి తెలుసుకుందాం.
మనకు మార్కెట్లో దానిమ్మ, అవిసె, పొద్దుతిరుగుడు, పుచ్చకాయ, చియా, క్వినోవా, నువ్వులు లాంటి చాలా రకాల గింజలు అందుబాటులో ఉన్నాయి. వీటిని మన ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు కలుగుతాయి. ఈ గింజల్లో విటమిన్లు, ప్రొటీన్లు, మినరల్స్, కాల్షియం లభిస్తాయి. కనుక వీటిని కొద్ది మోతాదులో తీసుకున్నా.. మంచి పోషకాలు మనకు లభిస్తాయి. ఈ గింజల్ని స్నాక్స్ లాగా, ప్రొటీన్ బార్స్లాగా తీసుకోవచ్చు. వీలుంటే లడ్డూల మాదిరిగా చేసుకుని ఆరగించవచ్చు. అలాగే ఈ గింజలను రాత్రి నానబెట్టి ఉదయాన్నే తినవచ్చు. ఇప్పుడు మనం పలు రకాల గింజలు, వాటి ప్రయోజనాల గురించి మరింత వివరంగా తెలుసుకుందాం.
1. చియా గింజలు
Chia Seeds Health Benefits : చియా గింజల గురించి ఈ మధ్య చాలా మంది చర్చించుకుంటున్నారు. పోషకాహార నిపుణులు వీటిని సూపర్ ఫుడ్‌గా పేర్కొంటున్నారు. రెండు టేబుల్ స్పూన్ల చియా గింజల్లో 10 గ్రాముల వరకు పీచు పదార్థం లభిస్తుంది. వీటిని కాస్త బరకగా పొడి చేసుకుని సలాడ్లలో, ఇతర ఆహార పదార్థాలపై చల్లుకుని తినవచ్చు. బాదం పాలు, పళ్ల రసాల్లోనూ కలిపి తాగొచ్చు.
2. గుమ్మడి
Pumpkin Seeds Health Benefits :గుమ్మడి గింజల్లో పోషకాలు మెండుగా ఉంటాయి. వీటిలో మన గుండె ఆరోగ్యాన్ని కాపాడే అతి ముఖ్యమైన మెగ్నీషియం అనే ఖనిజం ఉంటుంది. ఈ గుమ్మడి గింజలు మన శరీరానికి శక్తినిస్తాయి. కండరాలకు బలాన్నిస్తాయి. వీటిని సలాడ్స్ రూపంలో కానీ, సూప్స్‌లా కానీ వాడుకోవచ్చు. వాస్తవానికి ఈ గుమ్మడి గింజల్ని సంవత్సరం మొత్తం హాయిగా తినొచ్చు.
3. దానిమ్మ
Pomegranate Seeds Benefits : అతి రుచికరమైన పోషకాలు కలిగిన గింజల్లో దానిమ్మ గింజలు కూడా ఒకటి. వీటిలో విటమిన్- సి సహా, శరీరానికి మేలు చేసే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి.
4. క్వినోవా
Quinoa Seeds Health Benefits : క్వినోవా గింజల్లో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి. ఒక కప్పు క్వినోవాలో 8 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇందులో ప్రొటీన్‌తో పాటు ఫైబర్, ఐరన్, జింక్, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి పోషకాలూ అధికంగానే ఉంటాయి. వీటిని అన్నంలాగా వండుకుని కూడా తినొచ్చు.