Health Benefits Of Honey : ఆరోగ్యానికి తేనె ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మనిషి ఆరోగ్యంగా ఉండటానికి ఉపయోగపడే పదార్థాల్లో తేనె కూడా ఒకటని చెప్పవచ్చు. తేనెతో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అనేక రకాల వ్యాధులకు చికిత్సలో దీన్ని వినియోగిస్తారు. మన దేశంలో పురాతన, సంప్రదాయ వైద్య వ్యవస్థలుగా చెప్పుకునే సిద్ధ, ఆయుర్వేదంలో కూడా తేనెను ప్రధాన మూలికగా వినియోగిస్తున్నారు. అలాంటి తేనె వల్ల మన శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటంటే..
శక్తిమంతమైన ఆహారం..!
Honey Energy Content : తేనెలో అనేక రకాల విటమిన్లు, మినరల్స్ ఉంటాయి. ఇందులో నియాసిన్, ఐరన్, మెగ్నీషియం, మాంగనీస్, పాస్ఫరస్, పొటాషియం, జింక్ తదితర మినరల్స్ ఉంటాయి. అంతేగాక తేనెలో కార్బోహైడ్రేట్స్ కూడా సమృద్ధిగా ఉంటాయి. అందుకే దీన్ని శక్తిమంతమైన ఆహారంగా పరిగణిస్తారు.
జీర్ణ సమస్యలకు చెక్..!
Honey For Digestion :తేనెలో బ్యాక్టీరియాను ఎదుర్కొనే గుణం ఎక్కువ. దగ్గు, గొంతు మంట నుంచి ఇది ఉపశమనాన్ని కలిగిస్తుంది. దీంట్లో ఉండే ప్రోబయాటిక్ ప్రాపర్టీస్ జీర్ణ వ్యవస్థకు సహాయకారిగా పనిచేస్తాయి. శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే ఆరోగ్య సంరక్షణిగా తేనె ఉపయోగపడుతుంది.
చర్మాన్ని సంరక్షిస్తుంది..!
Honey For Skin Care : చర్మ సంబంధిత వ్యాధులను కూడా తేనె నివారిస్తుంది. దీంతో పాటు తలపై ఉండే చుండ్రు, దురద నుంచి చక్కటి ఉపశమనాన్ని కలిగిస్తుంది. తేనె వినియోగం వల్ల పిల్లలు బాగా నిద్రపోతారని అనేక అధ్యయనాల ఫలితాలు సూచిస్తున్నాయి. పొడి దగ్గును కూడా ఇది తగ్గిస్తుంది.
కాలిన గాయాలను నయం చేస్తుంది..!
Honey For Wounds :భారత్‌లోనే కాదు ఈజిప్ట్ లాంటి ప్రాచీన నాగరికత కలిగిన పలు దేశాల్లోనూ వేల ఏళ్ల నుంచి తేనెను వాడుతూ వస్తున్నారు. ఈజిప్ట్‌లో తేనెను చర్మ సంరక్షణ, కళ్లకు సంబంధించిన వ్యాధుల నివారణతో పాటు గాయాలు, కాలిన గాయాలను సహజంగా నయం చేసే మూలికగా దీన్ని వినియోగించేవారు. ఇప్పుడు అనేక వైద్య శాస్త్ర పరిశోధనల ద్వారా తేనెలో దాగిఉన్న ప్రయోజనాల గురించి నేటి తరం వారికీ తెలిసొచ్చింది.