Health Benefits Of Eating Early Dinner : మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం తినటం ఎంత ముఖ్యమో.. దాన్ని వేళకు తినటమూ అంతే ముఖ్యం. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం వరకు మన శరీరంలో జీవక్రియలు వేగంగా జరుగుతాయి. కాబట్టి.. ఈ సమయంలో ఆహారం తీసుకోవడం మంచిది. రాత్రి సమయంలో ఆలస్యంగా భోజనం చేయడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
"మనకున్న 24 గంటల సమయంలో .. 10 గంటల పరిధిలో ఆహారం తీసుకుని, మిగిలిన సమయంలో ఉపవాసం ఉండటం ఆరోగ్యానికి మేలు చేస్తుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సమయం దాటిన తర్వాత తినటం వల్ల.. రోజంతా ఆకలిగానే అనిపిస్తుంది. ఉదయం లేచిన వెంటనే ఎలాగైతే అల్పాహారం భుజిస్తామో.. అలాగే రాత్రి కూడా త్వరగా భోజనం చేయాలి. ఆలస్యంగా తినటం వల్ల ఆహారం తొందరగా జీర్ణం కాదు. ఫలితంగా శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది." అని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.
చాలా మంది ఆహారం ఆలస్యంగా తీసుకోవడం లేదా బిజీ షెడ్యూల్ వల్ల మానేయడం లాంటివి చేస్తూ ఉంటారు. కొంతమందికి ఉద్యోగ రీత్యా.. టైమింగ్స్ ఇర్రెగ్యులర్ వల్ల ఇలా జరుగుతుంది. ఇలాంటి వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. షిఫ్టుల మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ లేకపోవడం, జీవన శైలిలో మార్పుల వల్ల డయాబెటిస్, బీపీ, గుండె సంబంధ తదితర వ్యాధులు వస్తాయి. ఇవి రావడానికి గల ప్రధాన కారణం ఆహారం సరైన సమయంలో తీసుకోకపోవడమేనని నిపుణులు అంటున్నారు.
ఆహారం తీసుకునే కాల పరిధిని 10 గంటలకు కుదించడం వల్ల ఎన్నో లాభాలున్నాయని పలు అధ్యయనాలు రుజువు చేస్తున్నాయి. షిఫ్టుల పద్ధతిలో పనిచేసే వారు దీన్ని పాటించడం వల్ల వారిలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతాయని తేలింది. దీని వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. ముఖ్యంగా బ్రేక్ ఫాస్ట్ని స్కిప్ చేయడానికి వీలులేదు. ఒక వేళ చేస్తే.. ఆ రోజంతా మన శరీరానికి కావాల్సిన శక్తి అందక నీరసంగా ఉంటుంది. ఫలితంగా వేటిపైనా దృష్టి సారించలేం.
ఉదయం 7.30 నుంచి 8.30 మధ్యలో అల్పాహారం తీసుకోవడం ఉత్తమమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఉదయం 8 గంటల మధ్య మొదలు పెట్టి.. సాయంత్రం 6, 7 గంటల మధ్య రాత్రి భోజనం ముగించడం మంచిదని అంటున్నారు. తీసుకునే ఆహారం సమతుల్యంగా ఉండేలా చూసుకోవాలని.. రాత్రి ఆలస్యంగా తినటం వల్ల.. రక్తంలో చెక్కర స్థాయులు పెరిగే అవకాశముందని హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా ఆహారం సరిగా జీర్ణం కాక.. మలబద్దం సమస్య కూడా వస్తుందని చెబుతున్నారు.' రాత్రి భోజనంలో భారీ పదార్థాలు ఉండకుండా చూసుకోవాలి. సులభంగా జీర్ణమయ్యే వాటిని భుజిస్తే బెటర్. బీపీ, షుగర్ ఉన్న వాళ్లు రైస్ బదులు.. చపాతీ, బ్రౌన్ రైన్ తీసుకోవాలి.' అని నిపుణులు సూచిస్తున్నారు.
రాత్రి త్వరగా డిన్నర్ చేస్తే.. బీపీ, గుండె జబ్బులు దూరం!