Health Benefits of Drinking Hot Water : మన జీవితంలో ఆరోగ్యంగా ఉండడానికి రోజూ ఆహారం తీసుకోవడం ఎంత ముఖ్యమో.. శరీరానికి సరిపడా నీరు తాగడం అంతే ముఖ్యం. తగిన మొత్తంలో డైలీ వాటర్ తీసుకోవడం ద్వారా అనేక ఆరోగ్య సమస్యలను మన దరిచేరకుండా కాపాడుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. అయితే చాలా మంది ఎక్కువగా చల్లని నీటిని తాగడానికి ఇష్టపడుతుంటారు. కానీ, అదే ప్లేస్‌లో గోరువెచ్చని నీరు(Hot Water)తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంబంధించి అనేక ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు నిపుణులు. అలాగే ఆయుర్వేదం కూడా వేడినీటి తీసుకుంటే బోలెడు లాభాలున్నాయని తెలుపుతుంది. కానీ, చాలా మందికి ఈ విషయం తెలియదు. అయితే, ఇంతకీ హాట్ వాటర్ తాగడం ద్వారా ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ పొందవచ్చో ఈ స్టోరీలో తెలుసుకుందాం..
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది :మీరు భోజనం తర్వాత గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకున్నారంటే మంచి ప్రయోజనాలు పొందవచ్చు. తిన్నాక వేడి నీటిని తాగితే వేగంగా ఆహారాన్ని జీర్ణం చేయడంతో పాటు బాడీకి తగిన పోషకాలను ఈజీగా పంపిణీ చేస్తుంది. అలాగే గోరు వెచ్చని నీరు తాగడం వల్ల కలిగే మరో ప్రయోజనమేంటంటే.. మలబద్ధకాన్ని నివారిస్తుంది.
డీహైడ్రేషన్ సమస్య ఉండదు :మనం బాడీ జీర్ణక్రియ సమయంలో కోల్పోయిన ద్రవాలను తిరిగి నింపడంలో హాట్ వాటర్ బాగా పనిచేస్తుంది. అలాగే వేడి నీరు ఎప్పుడూ టాక్సిన్లకు వ్యతిరేకంగా పనిచేస్తూ.. శరీరాన్ని డీహైడ్రేషన్ కు లోనుకాకుండా కాపాడుతుంది. బాడీ టెంపరేచర్‌ను నియంత్రించడంలోనూ ఇది తోడ్పడుతుంది.
బరువు తగ్గడంలో సహాయపడుతుంది : భోజనం తర్వాత వేడి నీటిని తాగాలని చాలా మంది నిపుణులు సిఫార్సు చేస్తారు. ఎందుకంటే ఇది బరువు తగ్గడానికి ఎంతో బాగా సహాయపడుతుంది. భోజనానికి ముందు గోరువెచ్చని నీరు తాగడం వల్ల జీవక్రియ రేటు 32 శాతం పెరుగుతుందని తాజా పరిశోధనలో తేలింది. అలాగే కడుప్పు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను చాలా వరకు తగ్గిస్తుంది.
నెలసరి నొప్పిని తగ్గిస్తుంది : భోజనం చేసిన తర్వాత వేడి నీటిని తాగడం వల్ల మహిళలకు మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా డైలీ గోరువెచ్చని నీటిని తాగితే గర్భాశయంలోని గట్టి కండరాలు సడలింపుతో పాటు రక్తప్రసరణ మెరుగుపడుతుంది. అలాగే పిరియడ్స్ టైమ్ లో వచ్చే కడుపు నొప్పిని తగ్గిస్తుంది.