Raw Vegetables Eating Health Problems : కూరగాయల్ని ఉడికించకుండా పచ్చిగా తినడం మంచిదని కొంత మంది అంటుంటారు. ముఖ్యంగా యోగా, ప్రకృతి వైద్యులు పచ్చి కూరగాయలనే తినాలని సలహా ఇస్తుంటారు. బరువును తగ్గించుకోవడానికి, షుగర్, బీపీనిఅదుపులో ఉంచుకోవడానికి పరగడుపున కొద్దిగా పచ్చి కూరగాయల్ని తీసుకోవడం అలవాటు చేసుకోవడం మంచిదని చెబుతుంటారు.
ఇంకొంత మంది సగం ఉడికించిన కూరగాయల్ని తింటుంటారు. అయితే.. అన్ని కూరగాయలకూ ఈ విధానం సరిపడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కొన్ని రకాల కూరగాయలను పచ్చిగా, సగం ఉడికించి అస్సలే తినకూడదని సూచిస్తున్నారు. ఇలా తినడం వల్ల అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మరి.. ఏ కూరగాయలను పచ్చిగా తినకూడదు? సగం ఉడికించి వేటిని తీసుకోవద్దు? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.
- బచ్చలికూర, గోంగూర, పాలకూరలో ఆక్సలేట్, యూరిక్ యాసిడ్, ఫాస్ఫేట్ వంటి హానికర పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడేలా చేస్తాయి. శరీరం ఐరన్, క్యాల్షియం గ్రహించకుండా చేస్తాయి. అందుకే వీటిని బాగా ఉడికించి తీసుకోవాలి. లేకపోతే మూత్ర పిండాల్లో రాళ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది.
- వంకాయలో పోలనిన్ అనే ఒక రకమైన ఫ్లేవనాయిడ్ ఉంటుంది. ఇది వంకాయకు రంగును ఇస్తుంది. అయితే.. వంకాయలను పచ్చిగా తిన్నా, సగం ఉడికించి తిన్నా కొంతమందిలో వికారం, వాంతులు, మైకం వంటివి వస్తాయి.
- కొందరు పచ్చికోడి గుడ్లను తింటారు. ఇందులో ఉండే బ్యాక్టీరియా ఆరోగ్యానికి హాని చేయొచ్చు. అందుకే తెల్లసొన, పచ్చసొన పూర్తిగా గట్టిపడేంతవరకూ గుడ్లని ఉడికించి తినాలి. ఒకవేళ పచ్చివి వాడాల్సి వస్తే శీతలీకరించిన గుడ్లను వాడటం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
- ఈ రోజుల్లో పాలలో స్వచ్ఛత తక్కువగా ఉంటుంది. కాబట్టి, వీటిని పచ్చిగా అలాగే తాగడం ఏ మాత్రం మంచిది కాదని నిపుణులంటున్నారు. పాలను కాచిన తర్వాతే తాగాలి. లేకపోతే పాశ్చరైజ్డ్ (శీతలీకరించిన) పాలు వాడాలని సూచిస్తున్నారు.
- క్యాబేజ్, క్యాలీఫ్లవర్, బ్రొకలీ వంటి కూరగాయలలో పాథోజన్స్ అధికంగా ఉంటాయి. వీటిని పచ్చిగా తీసుకున్నా లేదా సగం ఉడికించి తీసుకున్నా జీర్ణమవక ఇబ్బందులు తలెత్తుతాయంటున్నారు. అలాగే సగం ఉడికించి తినడం వల్ల వాటిలోని పోషకాలు, విటమిన్ సి, ఫోలేట్, కెరోటిన్లు ఎక్కువగా నష్టపోతామంటున్నారు.
- పిల్లలు, గర్భిణులు, పాలిచ్చే తల్లులు, ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్లు, గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవాళ్లు కచ్చితంగా ఈ జాగ్రత్తలను పాటించాలని నిపుణులు చెబుతున్నారు.
- అయితే వంటల్లో ఉపయోగించే ప్రతి కూరగాయనూ మార్కెట్ నుంచి తీసుకొని ఇంటికి రాగానే శుభ్రంగా కడిగి ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. లేకపోతే కూరగాయలపై ఉండే కెమికల్స్ మన శరీరంలోనికి వెళ్లి హాని చేసే అవకాశం ఉందంటుందని హెచ్చరిస్తున్నారు.