Hair Transplantation Doubts Resolved In Telugu : ఒకప్పుడు బట్టతల వస్తే విగ్గు పెట్టుకోవడం మినహా వేరే దారి ఉండేది కాదు. అయితే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చికిత్సా విధానం వచ్చిన తర్వాత బట్టతలపై వెంట్రుకలు రప్పించడం సులువుగా మారింది. అయినప్పటికీ ఈ ట్రీట్మెంట్ విషయంలో సమాజంలో చాలామందికి ఇప్పటికీ అనేక అనుమానాలు ఉన్నాయి. ఈ విధానంతో కొత్త సమస్యలు ఉత్పన్నమవుతాయని.. జుట్టు కూడా ఊడిపోతుందని వాపోతున్నారు. వీటి నుంచి బయటపడేందుకు చాలాకాలం అనేక రకాల మందులు వాడాల్సి వస్తుందని.. అవి ప్రాణాపాయ స్థితులకు దారితీస్తున్నాయని ఆవేదన చెందుతున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయి. అయితే.. ఇవన్నీ అపోహలనే అని కొట్టిపారేస్తున్నారు డెర్మటాలజిస్టులు. ఈ నేపథ్యంలో బట్టతలపై మళ్లీ వెంట్రుకలు మొలిపించే హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విషయంలో కొనసాగుతున్న తప్పుడు ప్రచారాలపై ఉన్న నమ్మకాలు, అపోహలను ఈ కథనంతో నివృత్తి చేసుకుందాం.
హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ఎప్పుడు చేయించుకోవాలి..?
When To Do Hair Transplant : ఏ సమయంలో హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయించుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంది. పురుషుల్లోనైనా, మహిళలల్లోనైనా బట్టతల రావడానికి ప్రధాన కారణం వంశపారంపర్యం. వంశపారంపర్యంలో ఉన్న జీన్స్ కారణంగానే 70 శాతం మంది ఈ సమస్యతో బాధపడుతున్నట్లు అధ్యయనాలు నిరూపించాయి. దీంతో 16 నుంచి 26 ఏళ్ల మధ్య వయస్కులు ఎక్కువగా జుట్టును కోల్పోతున్నారని వైద్యులు అంటున్నారు. అయితే.. ఇందులో అందరికీ హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ ట్రీట్మెంట్ అవసరం పడదు. కానీ, పూర్తిగా బట్టతల వచ్చినవారికి మాత్రమే వైద్యులు ఈ విధానాన్ని సిఫార‌్సు చేస్తారు.
Hair Transplant Types : ఈ చికిత్సలోనూ గ్రేడ్లు ఉంటాయి. పురుషుల్లో 6, మహిళల్లో 3 గ్రేడ్లు ఉంటాయి. పురుషుల్లో 4, 5వ గ్రేడ్‌కు హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేస్తారు. దాదాపుగా జుట్టు అంతా ఊడిపోయి చికిత్సకు అనుకూలంగా ఉన్న వాళ్లకు మాత్రమే ఈ చికిత్స చేస్తారు. అలాగే ఇప్పటికే మందులు వాడుతూ జుట్టు పల్చగా మారి, బట్టతల కనబడుతున్న వాళ్లకీ ఈ చికిత్సను సజెస్ట్ చేస్తారు.
సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయా..?
Hair Transplantation Side Effects :హెయిర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సమయంలో ఇచ్చే అనస్థీషియా వల్లే చాలా వరకు సమస్యలు వస్తాయి. అయితే నూటిలో ఒక్కరిద్దరిలో మాత్రమే ఈ సమస్యను ముందుగానే గుర్తించవచ్చు. అందుకే చికిత్సకు ముందే బీపీ, షుగర్, లివర్, కిడ్నీకి సంబంధించిన పరీక్షలు చేస్తారు. అంతేకాకుండా.. అనస్థీషియా టెస్టింగ్ డోస్ కూడా ఇస్తారు. ఇచ్చిన తర్వాత ఏం అలెర్జీలు రాకపోతే చికిత్సను ప్రారంభిస్తారు. రెండో ప్రధాన సమస్య హెయిర్ రూట్ ఇన్ఫెక్షన్. దీన్ని ఫాలికలైటిస్ అంటారు. ఆ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచకపోయినా, వైద్యుల పర్యవేక్షణలో నిర్లక్ష్యంగా ఉన్నా ఇది వచ్చే అవకాశముంటుంది. అందుకే చికిత్స తర్వాత ఇది రాకుండా జాగ్రత్త పడాలి.
ఎన్ని రోజుల విశ్రాంతి అవసరం..?
Hair Transplantation Rest :చికిత్స తీసుకున్న తర్వాత 3 నుంచి 4 రోజుల వరకు విశ్రాంతి తప్పనిసరి. అయితే ఇప్పుడు అందుబాటులో ఉన్న ఆధునిక సాంకేతికత వల్ల కూడా చికిత్స సులువుగానే పూర్తవుతుంది. చికిత్స అనంతరం కొందరిలో ముఖం వాపు వచ్చే అవకాశముంది. 3 రోజుల రెస్ట్ తర్వాత 4వ రోజు నుంచి తలపై టోపీ పెట్టుకుని పనిచేసుకోవచ్చు. 14 రోజుల తర్వాత మందులు వాడవచ్చు. నెల తర్వాత వ్యాయామం చేయడం కూడా ప్రారంభించవచ్చు.
ఎన్ని రోజుల్లో జుట్టు వస్తుంది..?
అధిక శాతం మందిలో ఉన్న సందేహం.. ఎప్పుడెప్పుడు జుట్టు వస్తుందా అని. జట్టు ఒత్తుగా ఎప్పుడు పెరుగుతుందా అని చాలామంది ఎదురు చూస్తుంటారు. అయితే చాలావరకు ట్రీట్మెంట్ తీసుకున్న వారిలో 3 నెలల తర్వాత జుట్టు పెరగడం మొదలవుతుంది. ఏడాది తర్వాత ఫలితం కనిపిస్తుంది.