మనకు నచ్చకపోయినా ఊడిపోవటం జుట్టు నైజం. మొలవటం ఎంత సహజమో, ఊడటమూ అంతే. నిజానికి ఎంతో కొంత రాలిపోవటమే మేలు. ఊడకుండా అలా పెరుగుతూ వస్తుంటే శుభ్రం చేసుకోవటం, దువ్వుకోవటం, ముడేసుకోవటం ఎంత కష్టమయ్యేదో! తల మీద నిరంతరం పెద్ద బరువును మోయాల్సి వచ్చేది. అదృష్టవశాత్తు ప్రకృతి మనకు అలాంటి 'కష్టాలు' పెట్టదలచుకోలేదు. కొన్ని వెంట్రుకలను కొంత కాలానికి రాలిపోయే 'వరం' ప్రసాదించింది! కాకపోతే.. అతిగా, అదేపనిగా రాలిపోవటమే కలవరం కలిగిస్తుంది. వెంట్రుకలు ఒక క్రమ పద్ధతిలో ఎదుగుతూ, ఆగుతూ, రాలిపోతూ వస్తుంటాయి.
ఇది మూడు దశలుగా సాగుతుంది..
- ఎదిగే (అనాజెన్) దశ- ఇది 3-6 ఏళ్ల పాటు కొనసాగుతుంది. ఇందులో వెంట్రుకల కుదుళ్లలోని కణాలు చాలా వేగంగా వృద్ధి చెందుతుంటాయి.
- స్తబ్ధ (కెటాజెన్) దశ- సుమారు 2-3 వారాల పాటు సాగే ఈ దశలో వెంట్రుకలు పెరగటం ఆగిపోతుంది. ఏ సమయంలోనైనా మొత్తం వెంట్రుకల్లో దాదాపు 3% ఈ దశలో ఉంటాయి.
- విశ్రాంతి (టిలోజెన్) దశ- ఇది దాదాపు 100 రోజుల వరకు కొనసాగుతుంది. వెంట్రుకలు రాలిపోయేది ఇందులోనే. సుమారు 6-8% జుట్టు ఈ దశలో ఉంటుంది.
ఇదంతా ఒక చట్రంలా అత్యంత సహజంగా, నిరంతరంగా సాగిపోయే ప్రక్రియ. మగవారికి సుమారు లక్ష, ఆడవారికి లక్షన్నర వెంట్రుకలు ఉంటాయి. వీటిల్లో రోజుకు 50-100 వరకు వెంట్రుకలు రాలిపోతుంటాయి. ఒకవైపు రాలేవి రాలుతున్నా పెరిగేవి పెరుగుతుండటం వల్ల పెద్ద తేడా ఏమీ కనిపించదు. కొందరికి రోజూ కాకుండా వారానికి సరిపడా ఒకరోజే ఊడిపోవచ్చు. దీంతో ఏదో అయిపోయిందని, బట్టతల వచ్చేస్తోందని భయపడిపోతుంటారు. ఇలాంటి భయాలేవీ అవసరం లేదు. విశ్రాంతి దశ తర్వాత ఊడిపోయే వెంట్రుకలు తిరిగి మొలుస్తాయి. వెంట్రుకల ఎదుగుదల, విశ్రాంతి దశలు అస్తవ్యస్తమైతే మాత్రం జుట్టు ఎక్కువగా రాలిపోవటం మొదలెడుతుంది.
బట్టతల- ప్రత్యేక సమస్య
బట్టతల వంశపారం పర్యంగా వచ్చే సమస్య. జన్యు ప్రభావాలతో హార్మోన్లు అస్తవ్యస్తం కావటం దీనికి మూలం. అందుకే దీన్ని ఆండ్రోజెనెటిక్ అలోపేషియా అంటారు. ఒకప్పుడు 40 ఏళ్ల తర్వాత మొదలయ్యే బట్టతల ఇప్పుడు 20ల్లోనే మొదలవుతోంది. జన్యువులు త్వరగా వ్యక్తీకరణ కావటం ఇందుకు దోహదం చేస్తోంది. మన ఆహార అలవాట్లు మారటం, పెరుగుతున్న కాలుష్యం వంటివన్నీ దీనికి పురికొల్పుతున్నాయి. తండ్రి, తాతలకు బట్టతల ఉంటేనే తర్వాతి తరానికి వస్తుందని భావిస్తుంటారు. తల్లి, అమ్మమ్మలకు బట్టతల ఉన్నా రావొచ్చు. తండ్రికి, తల్లికి ఇద్దరికీ బట్టతల ఉంటే మరింత త్వరగా వచ్చే అవకాశముంది.
సాధారణంగా బట్టతల మగవారికే వస్తుందని భావిస్తుంటారు గానీ ఆడవారికీ వస్తుంది. కాకపోతే వేరుగా ఉంటుంది. మగవారిలో ఆయా భాగాల్లో జుట్టు మొత్తం ఊడిపోతే.. ఆడవారిలో మధ్యమధ్యలో వెంట్రుకలు ఊడిపోయి, జుట్టు పలుచగా అవుతుంది. మగవారిలో కణతల దగ్గర్నుంచి వెంట్రుకలు ఊడిపోవటం మొదలై.. క్రమంగా నుదురు మీది వరకు 'ఎం' ఆకారంలో వెంట్రుకలు రాలిపోతుంటాయి. కొందరికి కేవలం మాడు మధ్యలో గుండ్రంగా జుట్టు మొత్తం పోవచ్చు. తల వెనక భాగంలోని వెంట్రుకలు బలంగా ఉంటాయి. ఇవి త్వరగా ఊడిపోవు. అందుకే చాలామందిలో తల వెనక గుర్రపు నాడా ఆకారంలో జుట్టు మిగులుతుంటుంది.
కారణాలు- రకరకాలు
జుట్టు ఊడటం సహజమే అయినా.. ఇతరత్రా సమస్యలూ దీనికి ఆజ్యం పోస్తుంటాయి. చర్మం మీద మచ్చ (స్కార్) పడని మామూలు సమస్యలతో ఊడిపోయే జుట్టు మళ్లీ వస్తుంది. అదే మచ్చ పడేలా చేసే సమస్యలతో రాలిన జుట్టు తిరిగి మొలవదు. వీటి గురించి తెలుసుకొని ఉండటం మంచిది.
ఫంగల్ ఇన్‌ఫెక్షన్లు:
పిల్లల్లో జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణం ఇవే. పిల్లలు తరగతిలో దగ్గర దగ్గరగా కూర్చుంటారు. ఒకరినొకరు తాకుతుంటారు. ఇతరుల దువ్వెనలనూ వాడుతుండొచ్చు. వీరిలో ఎవరికైనా ఫంగస్ ఇన్‌ఫెక్షన్ ఉంటే ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది. దీంతో జుట్టు ఊడిపోవచ్చు (టీనియా క్యాపిటస్). యాంటీ ఫంగల్ మందులతో ఇన్‌ఫెక్షన్ పూర్తిగా నయమైపోతుంది. జుట్టు తిరిగి వస్తుంది.
పేను కొరుకుడు (అలోపీషియా ఏరియేటా):
ఇందులో అక్కడక్కడా గుండ్రంగా జుట్టు ఊడిపోయి, నున్నగా అవుతుంది. పేలు కొరకటం వల్ల ఇది వస్తుందని భావిస్తుంటారు. నిజానికి పేలు వెంట్రుకలను కొరకవు. దీనికి మూలం రోగనిరోధక వ్యవస్థ పొరపాటున మన మీదే దాడి చేయటం. దీంతో వెంట్రుకల కుదుళ్లు దెబ్బతిని, రాలిపోతాయి. థైరాయిడ్ సమస్యలు, ఎండు గజ్జి, మధుమేహం, మానసిక ఒత్తిడి గలవారిలో ఇది ఎక్కువ. కొందరికి దీని మూలంగా పెద్ద మొత్తంలోనూ జుట్టు ఊడిపోవచ్చు (అలోపీషియా టోటాలిస్). వీరిలో కనుబొమలు, కనురెప్పల వెంట్రుకలూ రాలిపోతాయి. పేను కొరుకుడుతో రాలిపోయిన వెంట్రుకలు మూడు, నాలుగు నెలల తర్వాత తిరిగి మొలుస్తాయి.
చుండ్రు:
ఇందులో తలలో నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఇది ఎండిపోయి, పొలుసులుగా లేచి దురద తలెత్తుతుంది. అంతేకాదు ఫంగస్, బ్యాక్టీరియా వృద్ధి చెందొచ్చు. ఫలితంగా వెంట్రుకలు ఊడిపోవచ్చు.
పేలు:
కొందరికి పేలు ఎక్కువగా ఉండటంతోనూ ఇన్‌ఫెక్షన్లు మొదలై జుట్టు ఊడిపోవచ్చు.
జుట్టు లాగటం (ట్రైకో టిల్లోమేనియా):
కొందరు పిల్లలు వెంట్రుకలను గట్టిగా పట్టుకొని లాగేస్తుంటారు. ఇదీ జుట్టు ఊడిపోవటానికి దారితీస్తుంది. దీనికి మూలం మానసిక సమస్యలు. వీరిలో వెంట్రుకలు మధ్యలో తెగిపోయి ఉంటాయి. కొన్ని పొడుగ్గా, కొన్ని చిన్నగా కనిపిస్తాయి. అక్కడక్కడా వెంట్రుకలు ఊడి ఉంటాయి.
గట్టిగా జడ బిగించటం (ట్రాక్షన్ అలోపీషియా):
కొందరు జడ గట్టిగా బిగించి వేస్తుంటారు. దీంతోనూ జుట్టు ఊడిపోవచ్చు.
ఒత్తిడి:
దీని బారినపడ్డవారిలో జుట్టు పలుచగా అవుతుంటుంది (డిఫ్యూజ్ హెయిర్‌లాస్). ఒకేచోట కాకుండా తలంతా వెంట్రుకలు ఊడిపోతుంటాయి. జ్వరం, కాన్పు, సర్జరీల వంటివీ శరీరాన్ని ఒత్తిడికి గురిచేస్తాయి. అందుకే కొందరికి జ్వరం తగ్గాక, మహిళల్లో కాన్పు అయ్యాక రెండు మూడు నెలల తర్వాత జుట్టు ఊడిపోతుంటుంది (అక్యూట్ టిలోజెన్ ఎఫ్లూవియమ్). చాలామంది భయపడుతూ వస్తుంటారు గానీ ఇది కొద్దిరోజులకు తిరిగి మొలుస్తుంది. చికిత్స తీసుకోవాల్సిన పనేమీ లేదు.