చలికాలంలో చాలా మంది వేడినీటితో తలస్నానం చేస్తారు. ఇలా చేయడం వల్ల జుట్టు దెబ్బతింటుంది. మరి మనం ఈ కాలంలో జుట్టు సంరక్షణ విషయంలో పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు చూసేద్దాం..
- చలికాలంలో జుట్టుకు పదే పదే షాంపూ పెట్టొద్దు. ఇలా చేయడం వల్ల దాంట్లోని రసాయనాలు మాడుపై ఉండే సహజనూనెలను పీల్చేసి జుట్టును పొడిబారేలా చేస్తాయి. కాబట్టి వారంలో ఒకట్రెండు సార్లకంటే ఎక్కువగా తలను శుభ్రం చేసుకోవద్దు.
- ఈ కాలంలో తప్పనిసరిగా కండిషనర్‌ను వాడాల్సిందే. తలను శుభ్రం చేసుకున్న వెంటనే కండిషనర్‌ను తప్పనిసరిగా వాడాలి. కేశాల మధ్య నుంచి చివర్ల వరకు బాగా పట్టించాలి. కొన్ని నిమిషాల తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే సరి.
- చలికాలంలో హీట్ స్టైలింగ్ టూల్స్‌ను సాధ్యమైనంత తక్కువగా ఉపయోగించడం మంచిది. ఎందుకంటే ఈ కాలంలో జుట్టు మరింత బలహీనంగా మారుతుంది. ఈ ఉపకరణాలను వాడటం వల్ల చివర్లు చిట్లుతాయి.
- ప్రతివారం క్రమం తప్పకుండా కండిషనర్‌తో కూడిన హెయిర్ మాస్క్‌ను వేసుకోవడం మరవొద్దు. ఇందుకోసం గుడ్డు, తేనె లాంటి వాటిని ఉపయోగిస్తే చక్కటి ఫలితం ఉంటుంది.
- ఈ కాలంలో గోరువెచ్చటి నీటిని వాడటం మంచిది. చివరగా మగ్గు చల్లటి నీటిని పోసుకుంటే చివర్లు ఆరోగ్యంగా ఉంటాయి.
రెండు నెలలకోసారి వెంట్రుకల చివర్లను ట్రిమ్ చేస్తున్నట్లయితే అవి ఆరోగ్యంగా ఉంటాయి.
- జుట్టు బలంగా, ఆరోగ్యంగా ఉండాలంటే.. మాంసకృత్తులుండే ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి. క్యారెట్లు, గుడ్డు, గుమ్మడి, పాలు, పాల ఉత్పత్తులు, ఆకుకూరలు, చేపలను ఆహారంలో చేర్చుకోవాలి.