Green Tea Side Effects : భారతీయులు చాయ్(టీ) ప్రియులు. దిన చర్య ప్రారంభం కావాలంటే టీ ఉండాల్సిందే. అది లేని రోజు చాలా మందికి గడవదు. వృద్ధులు, ఆరోగ్యం పట్ల శ్రద్ధ ఉన్న వారు గ్రీన్ టీని తాగడానికి ఇష్టపడతారు. గ్రీన్ టీ తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నమ్ముతారు. గ్రీన్ టీ తాగితే అధిక బరువు నుంచి బయటపడవచ్చని అశపడుతుంటారు. అయితే.. గ్రీన్ టీ తాగడం వల్ల ఆరోగ్యపరంగా సైడ్ ఎఫెక్ట్లు వస్తాయని ఇటీవల చేసిన ఓ పరిశోధనలో వెల్లడైంది. దీనికి సంబంధించిన వివరాలు గాస్ట్రో హెచ్ఈపీ అనే అకడమిక్ జర్నల్లో ప్రచురితమయ్యాయి.
గ్రీన్ టీ మొక్కలపై క్లాలిట్ హెల్త్ సర్వీస్, కప్లన్ మెడికల్ సెంటర్ అండ్ టొరంటో యూనివర్సిటీకి చెందిన ఇజ్రాయెల్, కెనడా దేశాలకు చెందిన శాస్త్రవేత్తలు అధ్యయనం చేశారు. గ్రీన్ టీ మొక్కలు.. బొటానికల్ టాక్సిన్లు కలిగి ఉన్నాయని ఈ అధ్యయనంలో వెల్లడైంది. వాటి వల్ల కొందరిలో మెటబాలిక్ రియాక్షన్తో పాటు కాలేయం దెబ్బతింటున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. వీరు జరిపిన అధ్యయనంలో 100 మందికి పైగా ప్రజలు గ్రీన్ టీ వల్ల కాలేయ వాపు వ్యాధి వచ్చినట్లు తేలింది. మహిళల్లో గ్రీన్ టీ తాగిన వారి కాలేయం తీవ్రంగా దెబ్బతింటుందని అధ్యయనం వెల్లడైంది. వివిధ రకాలైన పానీయాలు తాగడం వల్ల.. దేని కారణంగా లివర్ డ్యామేజ్ అవుతుందో స్పష్టంగా చెప్పలేకపోతున్నామని తెలిపింది. కానీ.. కొందరిలో మందులు, మూలికలతో పాటు గ్రీన్ టీ తీసుకోవడం వల్ల కాలేయం దెబ్బతింటుందని పేర్కొంది.