Green Tea for weight loss : ఒక్కసారిగా బరువు పెరిగిన తర్వాత తగ్గడానికి చాలా రోజుల సమయం పడుతుంది. డైట్ పేరుతో కొన్ని ఆహార పదార్థాలను తినకుండా నోరు కట్టేసుకోవాల్సి ఉంటుంది. బరువును పెంచే కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాల్సి ఉంటుంది. ఆహార నియమాలను కొద్ది నెలల పాటు పాటిస్తే కొంచెమైనా బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడానికి చాలామంది గ్రీన్ టీ, తేనె తీసుకుంటూ ఉంటారు. దీని వల్ల ఎంతవరకు లాభముంటుంది? అనే వివరాలు తెలుసుకుందాం.
Weight loss green tea : చాలామంది జంక్ ఫుడ్‌కు బానిసైపోవడం, బిజీ జీవితంలో వ్యాయామం చేసే తీరిక లేకపోవడం, ఒత్తిడిని తగ్గించుకునేందుకు మద్యం సేవించడం వల్ల బరువు పెరుగుతున్నారు. శరీర బరువు పెరిగితే ఊబకాయం లాంటి అనేక అనారోగ్య సమస్యలు ఉంటాయి. కాళ్ల నొప్పులతో పాటు శరీరంలో కొవ్వు పెరగడం వల్ల షుగర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుంది.
Green tea for skin : అయితే బరువును తగ్గించుకునేందుకు గ్రీన్ టీ, తేనె బాగా పనిచేస్తాయని చెబుతూ ఉంటారు. గ్రీన్ టీలో క్యాటెచిన్ అనే పదార్థం ఉంటుంది. ఇవి జీర్ణక్రియను మెరుగుపర్చడంతో పాటు కొవ్వును నియంత్రిస్తాయి. దీని వల్ల బరువు తగ్గుతారు. అలాగే గ్రీన్ టీ వల్ల రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు చర్మ సౌందర్యం మెరుగవుతుంది. కానీ చాలామంది చేదుగా ఉంటుందని గ్రీన్ టీ తాగడానికి ఇష్టపడరు. కానీ గ్రీన్ టీ సేవించడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్ టీలో ఉండే క్యాటెచిన్స్ జీవక్రియను మెరుగుపర్చడంతో పాటు కొవ్వును తగ్గిస్తాయి. దీంతో గ్రీన్ టీ రోజూ తీసుకుంటే కొద్ది నెలల్లో బరువు తగ్గుతారు. ఇక కాఫీలో ఉండే తక్కువ స్థాయి కెఫిన్.. కొవ్వును తగ్గించడంలో ఉపయోగపడుతుంది. ఈజీసీజీ, కెఫిన్ కలిసి కొవ్వును తగ్గించి బరువు రాకుండా అడ్డుకుంటాయి.
తేనెతో అధిక బరువు సమస్యకు పరిష్కారం
Honey for weight loss : ఇక సహజసిద్ధ తీపి పదార్థమైన తేనె కూడా బరువును తగ్గించడంలో సహాయపడుతుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో పాటు స్థూలకాయాన్ని ఎదుర్కొవడంలో తేనె ఉపయోగపడుతుంది. గోరువెచ్చని నీటిలో చిటికెడు తేనె కలుపుకుని తింటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే తేనె స్టామినా స్థాయిలను పెంచి శరీరానికి శక్తిని అందిస్తుంది.
గ్రీన్ టీ ఆకులను నీటిలో 80 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ కాకుండా 3 నుంచి 5 నిమిషాలు ఉంచాలి. ఆ తర్వాత ఆ నీటిలో ఒక చెంచా తేనె కలిపి తీసుకోవాలి. తేనె, గ్రీన్ టీ కలిపి తీసుకోవడం వల్ల ఇంకా మరింత ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. బాగా వేడిగా ఉన్న గ్రీన్ టీలో తేనె కలిపితే ప్రయోజనం ఉండదు. వేడి అధికంగా ఉండటం వల్ల తేనె పోషక విలువలు తగ్గుతాయి. అందుకే చల్లబడిన తర్వాత తేనె కలిపి తీసుకుంటే ప్రయోజనం ఉంటుంది.
అయితే గ్రీన్ టీ, తేనె కలిపి తీసుకోవడం వల్ల మాత్రమే బరువు తగ్గరని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. తరచూ వ్యాయామం, తగినంత నిద్ర కూడా అవసరమని సూచిస్తున్నారు.