మొదటి వారం ఇలా చేయండి !ఒత్తిడిని జయించడంలో మానసిక వైద్యులు సూచించిన మొదటి స్టెప్.. రాత్రి సమయంలో మీ ఫోన్లని పక్కన పెట్టేయడమే ! గ్యాడ్జెట్ల నుంచి కొద్దిసేపైనా మనకి మనం కాస్త విరామాన్ని ప్రకటించుకోవడమే ఈ దశ ఉద్దేశం. అందుకే డిజిటల్ ప్రపంచానికి విరామాన్ని ప్రకటిస్తూ రాత్రి 8 నుండి ఉదయం లేచే వరకు ఫోన్, ఇతర గ్యాడ్జెట్లకు రెస్ట్ ఇవ్వమంటున్నారు వైద్యులు.
- ఇక ఈ వారంలో చేయాల్సిన మరో పని.. ఓ లిస్ట్ తయారు చేసుకోవడం. ఏంటా లిస్టు అంటారా ? చిన్న చిన్న విషయాల్ని మార్చుకోవడం వల్ల మన జీవితంలో చాలా పెద్ద మార్పులొస్తాయని వైద్యులు అంటున్నారు. అందుకే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకునే వరకు మీరు చేసే ప్రతి పనినీ నోట్ చేసుకోమంటున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఏ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నారో తెలిసిపోతుందంటున్నారు.
- ఇక చివరగా పాటించాల్సింది సుఖ నిద్ర. వివిధ రకాల సమస్యలు కేవలం మంచి నిద్ర వల్ల నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్ర విషయంలో మనల్ని మనం పసిపిల్లల్లా భావించుకొని స్ట్రిక్ట్‌గా వ్యవహరించుకోవాలంటున్నారు.
రెండో వారంలో ఇలా చేయాలి !ఒత్తిడికి లోనయ్యే వారు ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటుంటారు. చాలామంది ఊబకాయులుగా మారడానికి ఇదే కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు బిర్యానీ, స్వీట్లు, ఇతరత్రా జంక్ ఫుడ్స్, బయట చిరుతిండ్ల జోలికి పోవద్దని నిపుణులు సూచిస్తున్నారు.
- అలాగే ఆహారాన్ని తక్కువ మోతాదులో ఎక్కువ సార్లు తీసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఈ క్రమంలో కూరగాయలు, పండ్లను భాగం చేసుకోవడం మర్చిపోవద్దు.