Good Parenting Tips in Telugu : పిల్లల పెంపకంలో ఒక్కొక్కరు ఒక్కో శైలితో వ్యవహరిస్తుంటారు. అయితే.. కఠినంగా వ్యవహరించినా, గాలికి వదిలేసినా అనర్థాలు తప్పవని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే.. వాళ్లను సరైన దారిలో నడిపించాల్సి ఉంటుంది. కానీ.. ఈ క్రమంలో తల్లిదండ్రులు తీసుకునే పలు చర్యల వల్ల పిల్లలు మానసికంగా ముడుచుకుపోయే అవకాశం ఉంటుంది. ఇది దీర్ఘకాలం కొనసాగితే.. అదో అలవాటుగా మారుతుంది. అందుకే.. పిల్లలు నిత్యం నవ్వుతూ ఎదిగేలా చూడాలని చెబుతున్నారు. ఇందుకోసం పలు సూచనలు చేస్తున్నారు.
నిజాయితీని అభినందించాలి.. పిల్లలు ఏదైనా తప్పు చేసినప్పుడు దానిని దాచడానికి అబద్ధాలు చెబుతుంటారు. పేరెంట్స్ కోపానికి భయపడి ఎక్కువ మంది ఇలా చేస్తారు. అయితే.. వాళ్లు చెప్పే చిన్నచిన్న అబద్ధాలను సరిచేయకపోతే.. పిల్లల్లో అబద్ధాలు చెప్పే ధోరణి పెరుగుతుంది. కాబట్టి చిన్నప్పుడే వారిలో ఈ గుణాన్ని నిర్మూలించాలి. ముఖ్యంగా నిజాయితీని అలవాటు చేయాలి. ఇందులో భాగంగా.. మీ బిడ్డ నిజం చెప్పినప్పుడు.. ప్రశంసించాలి. అబద్ధాలు చెప్పినప్పుడు.. వారికి నిజం విలువను తెలియజేయాలి.
మా ఆనందానికి కారణం నువ్వే అని చెప్పాలి..మీ బిడ్డను మీరు ఎంతగా ప్రేమిస్తున్నారో వాళ్లు అర్థమయ్యేలా చెప్పాలి. మీ ప్రేమను పొందడానికి పిల్లలు ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదని చెప్పండి. మీ ముందు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదని కూడా చెప్పండి. మేమంతా నిన్ను చాలా ప్రేమిస్తామని చెప్పండి. ఇలా చెప్పడం ద్వారా మీ బిడ్డకు కుటుంబంలో తనకు కూడా ప్రాముఖ్యత ఉందనే భావన కలుగుతుంది. అది లైఫ్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనే ఆత్మవిశ్వాసాన్ని వారిలో నింపుతుంది.