ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంత అవసరమో అందరికీ తెలిసిన విషయమే. మన ఆరోగ్యానికి అవసరమైన అన్ని పోషకాలను ఆకుకూరలు అందిస్తాయి. ముఖ్యంగా వీటిలో కొత్తిమీర గురించి చెప్పుకుంటే.. దీన్ని అన్ని వంటకాల్లో ఉపయోగించుకోవచ్చు. దీని వల్ల వంటకాలు గుమగుమలాడటమే కాకుండా.. మంచి రుచిని కూడా అందిస్తాయి. రోజు మనం తినే ఆహారంలో కొత్తిమీరను కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. అయితే చాలా మంది కొత్తిమీర ఆకులను మాత్రమే వంటల్లో వాడుకొని.. దాని కాడలు పనికిరావని బయటపడేస్తుంటారు. వీటిలో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. కొత్తిమీరలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. దీనిలో ఔషధ విలువలు అనేకం. దీంతో అనేక ప్రయోజనాలు కలుగుతాయి. మరి అవేంటో తెలుసుకుందామా..
కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలు
కొత్తమీర మధుమేహ వ్యాధిగ్రస్తులకు చక్కని ఔషధం. ఇది రక్తంలోని షుగర్ లెవెల్స్‌ను తగ్గిస్తుంది. దీనిలో ఉండే ఐరెన్ గుండె సంబంధిత సమస్యలను దూరం చేస్తోంది. ప్రతి రోజు కొత్తిమీరను ఆహారంలో భాగంగా తీసుకుంటే బీపీ అదుపులో ఉంటుంది. దీనిలో ఉండే ఔషధ గుణాలు చెడు కొలస్ట్రాల్‌ను కరిగించి.. గుండె పనితీరును మెరుగుపరుస్తాయి. అల్సర్లకు చికిత్స చేసే గొప్ప క్రిమి నాశకంగా కూడా కొత్తిమీర పనిచేస్తుంది. కొత్తిమీరలో ఉండే ఫైబర్స్, యాంటీ ఆక్సిడెంట్లు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దీంతో పాటుగా మలబద్దకాన్ని తగ్గిస్తాయి. కొత్తిమీరలో ఉండే యాంటీ యాక్సిడెంట్స్ వృద్ధాప్యంలోనూ కంటికి సంబంధిచిన వ్యాధులు దరి చేరనివ్వకుండా కాపాడుతాయి.
చాలా మంది ఎక్కువగా బయటపడేసే కొత్తిమీర కాడల్లో సిట్రోలినన్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో సూక్షజీవుల పెరుగుదలని తగ్గిస్తుంది. ఎండలో ఎక్కువగా తిరిగి ఇంటికి చేరుకునే వారికి కలిగే ఇన్ఫెక్షన్ దరిచేరినివ్వకుండా సహాయం చేస్తుంది. ఆకలిని నియంత్రణలో ఉంచుతుంది. దీనిలో అధిక పోషకాలతో పాటుగా ఐరన్ కూడా ఉండడం వల్ల అది ఎనీమియాను తగ్గిస్తుంది. ఎముకలు బలంగా ఉండడానికి సహాయం చేస్తుంది. కొత్తిమీర ఆకుల్లో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉన్నందున.. చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది. దీంతోపాటుగా చర్మంపై వచ్చే మొటిమల సమస్యను కూడా తగ్గిస్తుంది.
కొత్తిమీరలో అనేక విటమిన్స్ ఉంటాయి. వీటిలో ఉండే.. విటమిన్-K అల్జీమర్స్ వ్యాధి తగ్గుదలకు సహాయపడుతుంది. దీంతో పాటుగా గాయాలైనప్పుడు రక్తం త్వరగా గడ్డ కట్టడానికి ఎంతగానో దోహదపడుతుంది. రోజు కొత్తిమీరను ఆహారంలో భాగాంగా తీసుకుంటే కాలేయ పనితీరును మెరుగుపడి.. అతిసారాన్ని నివారిస్తుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు విరుగుడుగా కొత్తిమీర పనిచేస్తుంది. నోటి పూత సమస్యను తగ్గించి.. నోటి దుర్వాసనను దూరం చేస్తుంది.
కొత్తిమీర తీసుకోవడం వల్ల అధిక ప్రయోజనాలు ఉన్నాయనే ఉద్దేశంతో.. దీన్ని పచ్చిగా అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఆరోగ్య పరమైన సమస్యలు తలెత్తే అవకాశం కూడా లేకపోలేదు. దేన్నైనా ఎంత మోతాదులో తీసుకోవాలో అంతే తీసుకోవాలి.. అవసరానికి మించి ఎక్కువ తీసుకుంటే దాని ప్రభావం శరీరంపై అధికంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.
కొత్తిమీర వల్ల కలిగే ప్రయోజనాలెన్నో తెలిస్తే.. తినకుండా అస్సలు వదలరు!