చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారం చాలా ముఖ్యం. ఆహారంలో కొద్ది మొత్తంలో కొవ్వు ఉంటే చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. గింజలు, విత్తనాలు, అవకాడో, చేపల నుంచి మనకు లభించే కొవ్వులు మనకు ఆరోగ్యకరమైనవి. వీటిని తినడం వల్ల చర్మం మృదువుగా, యవ్వనంగా ఉంటుంది. ఈ కొవ్వులు గుండె కూడా మేలు చేస్తాయి. చర్మ క్యాన్సర్ పెరుగుదలను, వ్యాప్తిని నివారిస్తాయి. ఈ రకం కొవ్వులు శరీరంలో వాపు, మంట లక్షణాలతో కూడిన ఇన్ఫ్లమేషన్ను ఆపుతాయి. మన శరీరం మనం తీసుకునే ప్రోటీన్లను అమైనో ఆసిడ్లుగా మార్చుతుంది. వీటి ద్వారా మన చర్మ నిర్మాణానికి అవసరమైన కొల్లాజిన్, కెరోటిన్ అనే ప్రోటీన్లు తయారవుతాయి. చేపలు, గుడ్లు, కొవ్వు తక్కువ ఉన్న పాలు, చికెన్, పప్పులు మొదలైన ఆహారాల ద్వారా మనం ప్రోటీన్లను పొందవచ్చు.
"సూర్య కిరణాల వల్ల స్కిన్ డ్యామేజ్ అవుతుంది. అల్ట్రా వైలెట్ రేస్ పడినప్పుడు చాలా వరకు మన స్కిన్ డ్యామేజ్ అవుతుంది. దీని నుంచి కాపాడుకోవడానికి మనం మంచి ఆహార పదార్థాలు తీసుకోవాలి. విటమిన్ 'ఏ', 'ఈ', 'సీ', ప్రొటీన్ ఉన్న ఆహారం తినాలి. వీటితో పాటు 'జింక్' , 'సెలీనియం' ఉన్న వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అప్పుడు చర్మ ఆరోగ్యంగా ఉంటుంది. జింక్ అధికంగా ఉన్న ఆహార పదార్థాలను తీసుకుంటే.. స్కిన్ హీలింగ్ ప్రాసెస్ చాలా వరకు జరుగుతూ ఉంటుంది. ఎండ వల్ల డ్యామేజ్ అయిన చర్మం హీల్ అవ్వాలంటే 'జింక్' ఎంతో ముఖ్యం. నట్స్, కూరగాయలు, ఆర్గాన్ మీట్లో జింక్ ఉంటుంది. గుడ్డు తెల్ల సొనలో ఎక్కువగా ప్రొటీన్స్ ఉంటాయి." అని చెప్పారు డాక్టర్ మధులిక ఆరుట్ల.
చర్మ ఆరోగ్యానికి 'విటమిన్ ఏ'
మన చర్మంలో పైన, కింద ఉండే పొరలు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్ ఏ తగినంత ఉండాలి. మనం ఎండలోకి వెళ్లినప్పుడు చర్మానికి హాని కలగకుండా 'ఏ' విటమిన్ కాపాడుతుంది. చర్మంపైన కోతలు, గాయాలు వంటివి మానాలన్నా విటమిన్ 'ఏ' అవసరం. తగినంత 'విటమిన్ ఏ' లేకపోతే మనం చర్మం పొడిబారిపోయే అవకాశం ఉంటుంది.
'విటమిన్ సీ'తక్కువగా ఉంటే పళ్ల నుంచి రక్తం కారడం, చిగుర్లు ఎరుపెక్కడం లాంటి సమస్యలు వస్తాయి. 'విటమిన్ ఈ' కూడా సీ విటమిన్ తో కలిసి మన కణాల గోడలకు బలాన్నిస్తుంది. జింక్ అనే ఖనిజం మన చర్మంపై ఏదైనా గాయం అయినప్పుడు త్వరగా మానేందుకు సహాయం చేస్తుంది. చర్మ కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు తోడ్పడుతుంది. మన చర్మానికి ఎండ వేడి వలన కలిగిన హానిని తగ్గిస్తుంది. జింక్ తక్కువైతే చర్మంపై దురద, దద్దుర్ల వంటి సమస్యలొస్తాయి.