తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

పండ్లు, కాయగూరలు ఎలా కడగాలో తెలుసా? - కరోనా సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

అసలే అటు ఇంటి పనులు, ఇటు ఆఫీస్‌ పనులతో క్షణం తీరిక దొరకదు మన మహిళా లోకానికి. అలాంటిది కరోనా మహమ్మారి మన జీవితంలో అడుగుపెట్టిన దగ్గర్నుంచి ఇంటి శుభ్రత విషయంలో మనం మరింత బిజీగా మారిపోయాం. బయటి నుంచి ఇంటికి తెచ్చిన ప్రతిదీ శుభ్రం చేస్తే గానీ ఇంట్లోకి తీసుకురావట్లేదు. ఈ క్రమంలో ఫుడ్‌ ప్యాకెట్స్ లేదా ఇతర ప్యాక్‌ చేసిన వస్తువులైతే శానిటైజర్‌తో శుభ్రం చేసినా పర్లేదు. మరి, కాయగూరలు, పండ్లను కూడా ఇలాగే శుభ్రం చేస్తానంటే కుదరదంటున్నారు నిపుణులు. శానిటైజర్‌లో ఉండే ఆల్కహాల్‌ వల్ల కాయగూరలు, పండ్లలోని పోషకాలు నశించే ప్రమాదం ఉండడమే అందుకు ప్రధాన కారణం. అందుకే బయటి నుంచి ఇంటికి తెచ్చిన పండ్లు, కాయగూరల్ని ఎలా శుభ్రం చేయాలో సూచిస్తూ ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ)’ కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. అవేంటో మనమూ తెలుసుకొని ఫాలో అయిపోదామా?

fssai has come up with some guidelines on how to clean fruits and vegetables
పండ్లు, కాయగూరలు ఎలా కడగాలో తెలుసా?

By

Published : Jul 6, 2020, 1:16 PM IST

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇక మహిళలకైతే ఇంటి శుభ్రత విషయంలో మరింత శ్రద్ధ పెరిగింది. బయటి నుంచి ఇంటికి తెచ్చిన ఏ వస్తువునైనా శానిటైజ్‌ చేసి గానీ లోపలికి తీసుకురావట్లేదు. అయితే నిత్యావసర సరుకులంటే నెలకు సరిపడా ఒకేసారి తెచ్చి శానిటైజ్‌ చేసి పెట్టుకోవచ్చు. కానీ కాయగూరలు, పండ్లు మాత్రం వారానికోసారి తెచ్చుకోవాల్సిందే. మరి, ఇలాంటి ఆహార పదార్థాలను ఎలా శుభ్రం చేయాలో వివరిస్తూ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ తన అధికారిక ట్విట్టర్‌ పేజీ వేదికగా కొన్ని మార్గదర్శకాలను విడుదల చేసింది.

ఇలా ఈజీగా కడిగేయండి!

బయటి నుంచి ఇంటికి తెచ్చిన పండ్లు, కాయగూరలను శుభ్రం చేయాలంటే ఈ సులభమైన చిట్కాలను పాటించండి.. అంటూ బొమ్మలతో కూడిన ఐదు చిట్కాలను మన ముందుంచిందీ సంస్థ.

  1. సంచుల్లో తెచ్చిన కాయగూరలు, పండ్లను అలాగే ఓ మూలన పెట్టేయండి.
  2. ఇప్పుడు గోరువెచ్చటి నీళ్లు తీసుకొని అందులో కొద్దిగా క్లోరిన్‌ వేసి బాగా కలిపి.. ఈ కాయగూరలు, పండ్లను అందులో కాసేపు ముంచి ఉంచాలి.
  3. ఆ తర్వాత శుభ్రమైన నీటితో వాటిని మరోసారి కడగాలి.
  4. క్రిమి సంహారకాలు, క్లీనింగ్‌ వైప్స్‌, సబ్బు.. వంటి వాటిని కాయగూరలు, పండ్లపై స్ప్రే చేయకూడదు.
  5. ఇలా శుభ్రం చేసిన కాయగూరలు, పండ్లలో ఏవైతే ఫ్రిజ్‌లో పెట్టాలో వాటిని ఫ్రిజ్‌లో పెట్టేయడం, మిగతా వాటిని బుట్టల్లో అమర్చి గది ఉష్ణోగ్రత వద్ద నిల్వ చేయాలి.

ఈ సింపుల్‌ టిప్స్‌ని పాటించడం వల్ల కాయగూరలు, పండ్లు శుభ్రపడడంతో పాటు ఎక్కువ కాలం తాజాగా ఉంటాయంటూ చెబుతోందీ సంస్థ.

షాపింగ్‌కి వెళ్లొచ్చాక..!

పండ్లు, కాయగూరల విషయంలోనే కాదు.. షాపింగ్‌కి వెళ్లి ఇంటికొచ్చాక ఎలాంటి జాగ్రత్తలు పాటించాలో వివరిస్తూ ఇటీవలే మరో పోస్ట్‌ కూడా పెట్టింది భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ. ప్రస్తుతం అన్‌లాక్‌లో భాగంగా నిత్యావసరాలు, వృత్తి ఉద్యోగాల రీత్యా జనసంచారం బాగా పెరిగిపోయింది. ఓవైపు కరోనా బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటూనే, మరోవైపు సాధారణ జీవితానికి అలవాటు పడే ప్రయత్నం చేస్తున్నారంతా! అయితే ఈ క్రమంలో బయటి నుంచి ఇంటికొచ్చాక స్నానం చేయడంతో పాటు తమతో తీసుకొచ్చిన ప్రతి వస్తువునూ శానిటైజ్‌ చేసుకుంటున్నారు. అలాగే షాపింగ్‌ పూర్తి చేసుకొని ఇంటికొచ్చాక కూడా ఈ జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలంటూ సూచిస్తోంది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ.

అవేంటంటే..!

  • బయటి నుంచి ఇంటికి రాగానే చెప్పులను గుమ్మం బయటే విప్పేయాలి.
  • ఇప్పుడు షాపింగ్‌ బ్యాగ్స్‌ని ఎవరికీ అందకుండా (ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు) ఓ మూలన పెట్టేయాలి.
  • ఆ తర్వాత చేతుల్ని సబ్బుతో, పరిశుభ్రమైన నీటితో కడుక్కోవాలి. వీలైతే ఇంటి గుమ్మం వద్దే శానిటైజర్‌ లేదా సబ్బు - బకెట్‌ నీటిని అందుబాటులో ఉంచుకోవడం మంచిది.
  • ఇంటికి రాగానే బట్టలు మార్చుకోవాలి. వాటిని అన్ని బట్టలతో కలిపి కాకుండా సెపరేట్‌గా ఉతుక్కోవాలి.
  • ఇప్పుడు షాపింగ్‌ బ్యాగ్స్‌లోని వస్తువులు లేదంటే ఇతర ఆహార పదార్థాలను బయటికి తీసి ఎవరికీ అందకుండా ఓ పక్కన పెట్టేయాలి.
  • ఆహార భద్రతను దృష్టిలో ఉంచుకొని.. ఇంటి బయట, కార్లలో, గ్యారేజెస్‌లో ఆహార పదార్థాలను ఉంచకూడదు.
  • ఆల్కహాల్‌ ఆధారిత ద్రావణాలతో లేదంటే సబ్బు-పరిశుభ్రమైన నీటితో మనం బయటి నుంచి తెచ్చిన ఆయా ప్యాకెట్స్‌ను శుభ్రం చేయాలి.
  • ఇక ఆఖర్లో ఈ ప్యాకెట్స్‌ని శుభ్రం చేసిన సింక్‌, ప్లాట్‌ఫామ్‌ను కడిగేయాలి. ఈ క్రమంలో నేలపై పడిన నీటి చుక్కల్ని సైతం వెంటనే తుడిచేయాలి.

ఇలా ప్రతి విషయంలోనూ పకడ్బందీగా జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కరోనా మహమ్మారి బారిన పడకుండా ఉండచ్చంటూ తమ పోస్టుల ద్వారా వివరిస్తోందీ ఆహార సంస్థ. మరి, మనమూ ఈ విషయాలను గుర్తుపెట్టుకొని అనుసరిద్దాం.. కరోనాకు దూరంగా ఉందాం..!

ఇదీ చూడండి:మీకు చుండ్రు ఉందా... అయితే దానికి ఇలా చెక్​ పెట్టండి..!

ABOUT THE AUTHOR

...view details