తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

శృంగారం వల్లే వాళ్లు అంత అందంగా ఉంటారట!

Women Secrets: అమ్మాయిల అందానికి కారణం మేకప్ అనేది చాలామంది భావన. కానీ ఇది పూర్తిగా అవాస్తవమని అంటున్నారు ఫ్రెంచ్ భామలు. వేలకు వేలు పోసి ఖరీదైన మేకప్ ఉత్పత్తులు కొనడం కంటే సహజసిద్ధమైన బ్యూటీ ట్రీట్‌మెంట్లు పాటించడం, శారీరక- మానసిక ఉత్తేజాన్ని అందిస్తూ చర్మాన్ని పునరుత్తేజితం చేసే స్పాలలో ఎక్కువ సమయం గడపడం.. వంటివి చేస్తుంటారు ఫ్రెంచ్ మహిళలు.

FRENCH WOMEN BEAUTY SECRETS
ఫ్రెంచ్ భామలు

By

Published : Mar 2, 2022, 8:01 AM IST

గ్లాసు రెడ్‌వైన్..!

రెడ్‌వైన్ అనగానే మనలో కొంతమంది మొహం చిట్లించుకుంటారు. దీన్నో మత్తు పానీయంగా ట్రీట్ చేస్తారు. కానీ ఇదే వైన్‌ను ఫ్రెంచ్ మగువలు తమ అందాన్ని పెంపొందించుకోవడానికి ఉపయోగించుకుంటారు. అక్కడ ఇది బామ్మల కాలం నుంచి వస్తోన్న ఆచారం కూడా! రోజూ గ్లాసు రెడ్‌వైన్ తాగందే ఫ్రెంచ్ మహిళల రోజు ప్రారంభం కాదంటే అది అతిశయోక్తి కాదు. అది వారి సంస్కృతిలో ఓ భాగం కూడా! ఈ వైన్‌లో పుష్కలంగా లభించే రిస్వెరాట్రోల్ అనే యాంటీఆక్సిడెంట్, పాలీఫినోల్స్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు.. వంటివన్నీ చర్మంపై మొటిమలు ఏర్పడేలా చేసే బ్యాక్టీరియాను, ఫ్రీరాడికల్స్‌ను నశింపజేస్తాయి. అలాగే శరీరంలో రక్తప్రసరణ సాఫీగా సాగేలా చేసి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అందుకే గ్లాసు రెడ్‌వైన్ తాగాకే వారు వ్యాయామం, ఇతర పనులు మొదలుపెడుతుంటారు.


శృంగారంతో మెరుపు!

రోజూ శృంగారంలో పాల్గొనడం ఆరోగ్యానికి ఎంత మంచిదో నిపుణులు తరచూ చెబుతూనే ఉంటారు. అయితే ఇదే లైంగిక చర్య చర్మానికి మెరుపును కూడా అందిస్తుందని మీకు తెలుసా? కాస్త ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. ఫ్రెంచ్ మగువల సౌందర్యం వెనకున్న రహస్యం కూడా ఇదే! రోజూ సెక్స్‌లో పాల్గొనడం వల్ల శరీరంలో రక్తప్రసరణ సక్రమంగా జరగడంతో పాటు కొలాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది. తద్వారా చర్మం మెరుపును సంతరించుకుంటుంది. అలాగే నవయవ్వనంగా కనిపించేలా చేయడంతో పాటు చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా మెరిసేలా చేయడంలోనూ ఈ లైంగిక ప్రక్రియ దోహదం చేస్తుంది.

కోల్డ్ షవర్‌తో ముగిస్తారు!

అటు ఆరోగ్యానికి, ఇటు అందానికి చన్నీటి స్నానం ఎంత మంచిదో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఫ్రెంచ్ మగువల అందం వెనకున్న రహస్యం కూడా ఇదే! కాలమేదైనా కోల్డ్ షవర్ చేయడం అక్కడి అతివలకు అలవాటు. ఒకవేళ ముందు వేడి నీటితో స్నానం చేసినా.. ఆఖర్లో మాత్రం కాసేపు కోల్డ్ షవర్ చేయడం మాత్రం అస్సలు మరవరు అక్కడి మగువలు. ఇలా చన్నీటితో స్నానం చేయడం వల్ల చర్మంలో రక్తప్రసరణ సాఫీగా జరుగుతుంది. తద్వారా చర్మం మృదువుగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది.

మేకప్ అవసరమైతేనే!

అమ్మాయిలు తమ అందాన్ని పెంచుకోవడానికి మేకప్‌ను ఉపయోగించడం మామూలే! అయితే ఫ్రెంచ్ మహిళలు మాత్రం మేకప్‌కు ఆమడ దూరంలో ఉండడమే తమ అందానికి అసలు సిసలైన కారణం అంటారు. ఒకవేళ మేకప్ వేసుకోవాల్సి వచ్చినా చాలా తక్కువ మేకప్‌తో మెరిసిపోతుంటారు అక్కడి మగువలు. అది కూడా లిప్‌స్టిక్, మస్కారా, బ్రష్.. వంటివి తక్కువ మొత్తంలో అప్త్లె చేసుకొని తక్కువ మేకప్‌తోనూ అందంగా కనిపించచ్చని నిరూపిస్తుంటారు ఫ్రెంచ్ బ్యూటీస్.

సహజసిద్ధమైన టోనర్!

ముఖాన్ని శుభ్రం చేసి తాజాగా కనిపించేలా చేయడానికి మనం టోనర్‌ని ఉపయోగించడం కామనే! అయితే ఇందుకోసం బయట దొరికే ఉత్పత్తుల కంటే ఇంట్లో తయారుచేసుకునే సహజసిద్ధమైన టోనర్స్ చక్కటి ఫలితాన్ని అందిస్తాయని చెబుతున్నారు ఫ్రెంచ్ మగువలు. ఇందుకోసం కార్న్‌ఫ్లవర్ వాటర్, రోజ్‌వాటర్, థర్మల్ స్ప్రింగ్ వాటర్.. వంటివి ఉపయోగిస్తుంటారు. ఇవి చర్మాన్ని మృదువుగా, యవ్వనంగా మార్చడంలో దోహదం చేస్తాయని పలు అధ్యయనాలలో సైతం తేలింది.

జుట్టు ఆరోగ్యానికి..!

తమ జుట్టుకు సంపూర్ణ పోషణనందించడానికి ఫ్రెంచ్ మగువలు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంటారు. ఇందుకోసం బయట దొరికే ఉత్పత్తుల కంటే ఇంట్లో సహజసిద్ధంగా తయారుచేసుకొనే హెయిర్ మాస్కులనే ఉపయోగిస్తుంటారు. ఈ క్రమంలో రమ్, తేనె, రెండు కోడిగుడ్లలోని పచ్చసొన, నిమ్మరసం.. ఈ పదార్థాలను కలిపి మాస్క్‌లా తయారుచేసుకొని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టిస్తారు. అరగంట తర్వాత గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేస్తారు. ఇలా తరచూ చేయడం వల్ల జుట్టు కుదుళ్లు దృఢమవడంతో పాటు కేశాలు ఆరోగ్యంగా, పట్టులా మారతాయనేది వారి నమ్మకం.

గోళ్లపై మరకలైతే..!

నెయిల్ పెయింట్ కాకుండా అప్పుడప్పుడూ గోళ్లపై సిరా మరకలు పడడం, మనం తిన్న ఆహార పదార్థాల వల్ల గోళ్లు పసుపు పచ్చగా మారడం మనం గమనిస్తుంటాం. ఇలాంటి గోళ్ల సమస్యలకు ఫ్రెంచ్ మగువలు ఎంతో సింపుల్ రెమెడీస్‌ని ఉపయోగిస్తుంటారు. కొద్దిగా నిమ్మరసాన్ని ఒక బౌల్‌లో తీసుకొని అందులో గోళ్లను ఒక పది నిమిషాల పాటు ఉంచుతారు. ఇలా చేయడం వల్ల గోళ్లపై పడిన మరకలు ఇట్టే తొలగిపోతాయని చెబుతున్నారు ఫ్రెంచ్ భామలు. చాలా సింపుల్‌గా ఉంది కదూ వాళ్ల రెమెడీ!!

నిత్య యవ్వనానికి 'మెడిటెరేనియన్ డైట్'!

సాధారణంగా ఫెయిర్ స్కిన్ టోన్ ఉన్న వారి చర్మం త్వరగా ముడతలు పడుతుందని చెబుతుంటారు. కానీ ఫెయిర్ స్కిన్ టోన్‌ని సైతం వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా నిత్య యవ్వనంగా చేసే ట్రిక్ ఫ్రెంచ్ మగువలకే సొంతం అనడంలో సందేహం లేదు. ఈ విషయం వారిని చూస్తే ఇట్టే అర్థమైపోతుంది. మరి, వారు పాటించే ఆ ట్రిక్ ఏంటనేగా మీ సందేహం..? అదే.. డైట్ ట్రిక్. రోజువారీ మెనూలో భాగంగా వారు తీసుకొనే పోషకాహారమే వారి అందాన్ని ద్విగుణీకృతం చేస్తుందని అంటున్నారు అక్కడి సౌందర్య నిపుణులు. ఈ క్రమంలో మెడిటెరేనియన్ డైట్‌లో భాగమైన తృణధాన్యాలు, ఆలివ్ ఆయిల్, చేపలు, పాలు, పాల పదార్థాలు, మాంసం.. వంటివి ఎక్కువగా తీసుకుంటుంటారు. ఇవన్నీ శరీరానికి పూర్తిస్థాయిలో పోషకాల్ని అందించి చర్మం నవయవ్వనంగా మెరిసేలా చేస్తాయి. అలాగే చర్మానికి తేమనందించడానికి సరైన మోతాదులో నీళ్లు తాగడం కూడా వారి రోజువారీ తీసుకునే ఆహారంలో ఓ భాగమే! తద్వారా అన్ని చర్మ సమస్యల నుంచి దూరంగా ఉండడంతో పాటు వృద్ధాప్య ఛాయలు దరిచేరకుండా ఉంటాయనేది వారి నమ్మకం.

మేకప్ ద్వారా వచ్చే కృత్రిమమైన సౌందర్యం కంటే సహజసిద్ధంగా వచ్చే అందమే శాశ్వతమైనది అని నమ్మే ఫ్రెంచ్ భామల సౌందర్య రహస్యాలేంటో తెలుసుకున్నారుగా! మరి, ఎంతో సింపుల్‌గా ఉన్న ఆ బ్యూటీ సీక్రెట్స్‌ని మనమూ ఫాలో అయిపోయి 'న్యాచురల్ బ్యూటీ'గా మెరిసిపోదామా!!

ఇదీ చూడండి:

చిన్నవయసులోనూ గుండెపోటు ముప్పు.. కారణమేంటి?

ABOUT THE AUTHOR

...view details