కొందరికి నిద్ర లేచింది ఆలస్యం.. కాఫీ లేదా టీ గొంతులో పడకపోతే ఉండలేరు. అయితే వీటికి బదులు పరగడుపున కొన్ని పదార్థాల్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అంతేకాదు.. ఇలా తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా మన సొంతమవుతాయట! అయితే ఆలస్యమెందుకు.. ఆ పదార్థాలేంటో తెలుసుకొని మనమూ వాటితో రోజును ప్రారంభించేద్దాం రండి..!
ఉసిరిలో విటమిన్-సి అధికంగా ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో ఎంతో తోడ్పడతాయి. ఈక్రమంలో పరగడుపునే దీనిని తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఉసిరి గుజ్జును గోరువెచ్చని నీటిలో కలుపుకొని ఉదయాన్నే తీసుకోవడం ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. ఉసిరిలో చర్మ సౌందర్యం, శిరోజాల సంరక్షణకు సంబంధించిన పోషకాలు కూడా సమృద్ధిగా ఉంటాయట! క్రమం తప్పకుండా ఉసిరిని తీసుకోవడం ద్వారా చర్మానికి మెరుపు, జుట్టుకు పటుత్వం లభిస్తాయి.
పరగడుపునే గోరువెచ్చటి నీటిలో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు సొంతం చేసుకోవచ్చు. ఇందులోకి కాస్త నిమ్మరసం జోడిస్తే రుచితో పాటు రోగనిరోధక శక్తిని సైతం పెంపొందించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు శరీరంలోని హానికారక బ్యాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులతో పోరాడడానికి కావాల్సిన శక్తిని శరీరానికి అందిస్తాయి. ఇలా తేనెను రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల అధిక బరువు నుంచి కూడా ఉపశమనం పొందచ్చు. చర్మ సౌందర్యమూ ఇనుమడిస్తుంది.