ఇంటా బయటా బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించాలంటే ఎవరికైనా కత్తి మీద సాము లాంటిదే.. అలాంటిది మహిళలు ఇటు కుటుంబ బాధ్యతలు, అటు ఉద్యోగ వ్యవహారాలు నిర్వర్తించాలి. పురుషులతో పోలిస్తే మహిళలు శారీరకంగా బలహీనంగా ఉంటారు. దానికితోడు ఒత్తిడికి లోనైతే తీవ్రంగా అలసిపోతారు. వారికి శారీరక విశ్రాంతి కంటే మానసిక ఒత్తిడి ఎంతో అవసరం.. మానసికంగా ఒత్తిడికి గురైతే ఎన్నో అనారోగ్యాలు వచ్చే అవకాశముంది. అందుకే మంచి ఆహారం తీసుకుంటే అనారోగ్య సమస్యలను సులభంగా జయించొచ్చు అంటున్నారు వైద్యులు. ప్రొటీన్లతో కూడుకున్న ఆహారమైతే ఇంకా మేలు. మరి ఆ ఆహార పదార్థాలు ఏంటంటే..
బాదం:వీటిలో విటమిన్ బి2, విటమిన్ ఇ ఉంటాయి. ఇవి శరీరంలో సెరటోనిన్ ఉత్పత్తికి సహాయపడతాయి. ఇది ఒత్తిడీ, వ్యాకులతకు కారణమయ్యే కారకాలతో పోరాడుతుంది. వ్యాధినిరోధక శక్తి పెంచుతుంది. అందుకే రోజూ నాలుగైదు బాదం పప్పులనైనా తినండి.
జామ/కమలా/ బొప్పాయి:ఇవి విటమిన్-సికి కేరాఫ్ అడ్రస్ లాంటివి. రక్తపోటును నియంత్రిస్తుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోనును అదుపులో ఉంచుతుంది. అల్పాహారం తర్వాత ఓ పండు తిని చూడండి. ఫలితం మీకే అర్థమవుతుంది.