Food for Healthy Heart: పని చేసినంతవరకూ గుండె గురించి పెద్దగా పట్టించుకోం. ఎప్పుడైనా మొరాయిస్తే 'ముందే జాగ్రత్త పడితే బాగుండేది కదా' అని చింతిస్తాం. పరిస్థితి అంతవరకూ రాకుండా ముందే మేల్కొంటే? ఈ విషయంలో మంచి ఆహారం జీవితాంతం తోడుంటుంది. గుండెకు మేలు చేసే పదార్థాల గురించి తెలుసుకొని, ఆహారంలో చేర్చుకుంటే ఏంతో మేలు చేస్తాయి.
పెరుగు అండ: పెరుగు.. ముఖ్యంగా వెన్న తీసిన పాలతో చేసిన పెరుగు గుండెకు అండగా నిలుస్తుంది. ఇందులో గుండెపోటును అదుపులో ఉంచే పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం, ఖనిజ లవణాలెన్నో ఉంటాయి. అధిక రక్తపోటు మూలంగా రక్తనాళాల మార్గం సంకోచించి గుండె మీద ఒత్తిడి పెరుగుతుందన్నది తెలిసిందే. కాబట్టి భోజనంలో పెరుగు, మజ్జిగను చేర్చుకోవటం మంచిది.
అక్రోట్ల మేలు:గింజపప్పుల్లో (నట్స్) వృక్ష రసాయనాలు, గుండెకు మేలు చేసే కొవ్వు, పీచు దండిగా ఉంటాయి. సోడియం తక్కువగానూ ఉంటుంది. ఇవన్నీ గుండె ఆరోగ్యానికి తోడ్పడేవే. రోజుకు అరకప్పు అక్రోట్లు తినేవారి రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు చాలా తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటున్నాయి. రక్తంలో కొలెస్ట్రాల్ తగ్గితే రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ముప్పూ తగ్గుముఖం పడుతుంది.