Flurona and Delmicron: ఫ్లూ, కొవిడ్-19.. రెండూ శ్వాసకోశ సమస్యలే. రెండూ శ్వాసమార్గాల మీద దాడిచేసేవే. వీటి లక్షణాలూ దాదాపు సమానమే. రెండింటిలోనూ జ్వరం, ముక్కు కారటం, ఆకలి తగ్గటం, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, దగ్గు, తుమ్ములు, తలనొప్పి, నిస్సత్తువ వంటివే ఉంటాయి. అదృష్టం కొద్దీ ఫ్లూ, కరోనా రెండు కలిసి ఉన్నా లక్షణాలు మరీ తీవ్రమేమీ కావటం లేదు. మరి భయపడాల్సిన పనేముంది? చాలామందికి.. ముఖ్యంగా టీకాలు పూర్తిగా తీసుకున్నవారికి లక్షణాలు, ఇబ్బందులు స్వల్పంగానే ఉంటున్నా ఫ్లూ, కొవిడ్-19 తోడైతే తీవ్ర పరిణామాలకు దారితీయొచ్చు. ఈ రెండూ న్యుమోనియా తలెత్తేలా చేయొచ్చు. న్యుమోనియాలో ఊపిరితిత్తుల్లోని కణజాలం, గాలిగదులు ఉబ్బి పరిస్థితి విషమిస్తుంది. దీంతో కొందరికి కృత్రిమ శ్వాస కల్పించాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఒక్క కరోనా వైరస్‌తోనే కాదు.. ఫ్లూ వైరస్‌తోనూ గుండె, కండరాలు, మెదడులో వాపు ప్రక్రియ (ఇన్‌ఫ్లమేషన్) తలెత్తొచ్చు. ఇది తదనంతర బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్లకు కారణం కావొచ్చు. ఫలితంగా రక్తంలోకి ఇన్‌ఫెక్షన్ వ్యాపించొచ్చు, అవయవాలు విఫలం కావొచ్చు. ఫ్లూరోనాలో రెండు వైరస్‌లను ఒకేసారి ఎదుర్కోవాల్సి రావటం వల్ల రోగనిరోధకవ్యవస్థ మీద ఒత్తిడి బాగా పెరుగుతుంది కూడా. మరో ఆందోళనకర విషయం ఏంటంటే- ఫ్లూ, కరోనా రెండూ లక్షణాలు లేనివారి నుంచీ ఇతరులకు వ్యాపిస్తుండటం. ఇన్‌ఫెక్షన్ తలెత్తిన 1-4 రోజుల తర్వాత ఫ్లూ లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇక కొవిడ్-19 లక్షణాలు 5-14 రోజుల్లో ఎప్పుడైనా ఆరంభం కావొచ్చు. ఈలోపు వీరి నుంచి వైరస్ ఇతరులకు వ్యాపించే అవకాశం లేకపోలేదు.
నిర్ధరణ ఎలా?
Coronavirus third wave: ఫ్లూ, కొవిడ్ లక్షణాలు ఒకేలా ఉండటం వల్ల ఫ్లూరోనాను గుర్తించటం కష్టం. రెండింటి పరీక్షలు చేస్తే గానీ నిర్ధరణ కాదు. ఇజ్రాయెల్‌లో ఒక గర్భిణిలో తొలి ఫ్లోరోనా కేసును ఇలాగే గుర్తించారు. రెండు పరీక్షలను మళ్లీ చేసి నిర్ధరించుకున్నారు. అక్కడే కాదు, ఇతర దేశాల్లోనూ ఇలాంటి కేసులు పెరుగుతూ వస్తున్నాయి.
టీకాల రక్షణ
Omicron Vaccine: ఫ్లూ జ్వరాలు ఏటా చూసేవే. కొవిడ్-19 విజృంభణలో వీటి మీద అంతగా దృష్టి పెట్టడం లేదు. నిజానికివి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంటాయి. కానీ వృద్ధులు, గర్భిణులు, పిల్లలకు ప్రమాదకరంగా పరిణమిస్తుంటాయి. అలాగే ఆస్థమా, మధుమేహం, క్యాన్సర్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, గుండెజబ్బుల వంటి సమస్యలు గలవారికీ తీవ్ర చిక్కులు తెచ్చి పెడుతుంటాయి. అందుకే కొవిడ్-19 టీకాలతో పాటు ఫ్లూ టీకా తీసుకోవటం ప్రాధాన్యం సంతరించు కుంటోంది. వృద్ధులు, గర్భిణులు, పిల్లలు, ఇతరత్రా జబ్బులు గలవారికిది మరింత ముఖ్యం. రెండు టీకాలు ఒకేసారి తీసుకున్నా సురక్షితమేనని బ్రిటన్ అధ్యయనం ఒకటి పేర్కొంటోంది.