మీ వయసెంతని అడిగితే చాలామంది ఒకట్రెండు సంవత్సరాలు తక్కువగానే చెబుతుంటారు. ఇలా ఎందుకు చెబుతారో తెలియదు గానీ నిజంగానే ఇది ఆరోగ్యానికి మేలు చేస్తుందంటున్నారు పరిశోధకులు. అసలు వయసు కన్నా తక్కువ వయసుతో ఉన్నట్టు భావించే వృద్ధులు కాస్త ఎక్కువ కాలం జీవిస్తుండటమే దీనికి కారణం. తాము భావించే వయసుకూ క్యాన్సర్ మరణాలకు సంబంధం కనబడటం లేదు గానీ గుండెజబ్బు మరణాలతో బలమైన సంబంధం ఉంటోంది. తక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం మరింత మంచి అలవాట్లకు దారితీస్తుండొచ్చన్నది పరిశోధకుల మాట. అసలు వయసు కన్నా తక్కువ లేదా ఎక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం ఆరోగ్యంపై ప్రభావం చూపుతున్నట్టు కనబడుతోందని హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ రోనాల్డ్ డి.సీగెల్ చెబుతున్నారు.
వయసు తక్కువ అనుకుంటే.. మీకు ఎన్నో లాభాలు! - తక్కువ వయసున్నట్లు భావించడం
మన అసలు వయసు కన్నా తక్కువ వయసు ఉన్నట్లు భావించడం వల్ల ఎన్నో లాభాలున్నాయని చెబుతున్నారు పరిశోధకులు. ఈ విషయం మన ఆయుష్షును పెంచడం సహా ఆనందంగా జీవించడానికి దోహదం చేస్తుందని అంటున్నారు.
వయసు
మానసికంగా తక్కువ వయసుతో ఉన్నట్టు భావించటం రకరకాలుగా మెరుగైన ఆరోగ్యానికి దారితీయొచ్చు. వీటిల్లో ఒకటి వ్యాయామం. ఎక్కువ వయసుతో ఉన్నామని అనుకునేవారు చిన్నపాటి శారీరక శ్రమ, వ్యాయామాలు, ఆటలను కూడా చాలా కష్టమైనవని భావిస్తుంటారు. తమ చేతకాదని వెనకడుగు వేస్తుంటారు. అదే వయసు తక్కువని భావించేవారు కష్టపడకపోతే ఫలితం లేదని అనుకొని ముందడుగు వేస్తారు. అలాగే వయసు మీరిందని అనుకునేవారు ఆహారం విషయంలోనూ అశ్రద్ధ చూపిస్తారు.
ఇదీ చూడండి:ఆరోగ్యంగా ఉండేందుకు ఈ చిన్న మార్పు చాలు!