Fatty Liver Disease Treatment In Telugu : శరీరంలో జరిగే జీవక్రియల్లో కాలేయం ముఖ్యపాత్ర పోషిస్తోంది. అలాగే జీవితాంతం పెరిగే ఒకే ఒక అవయవం కూడా కాలేయమే. శరీరంలోని విషపదార్థాలను బయటకు పంపడంలో ఇది కీలకంగా పనిచేస్తుంది. రక్తంలో ఉండే మృతకణాలను, బ్యాక్టీరియా, హానికర హార్మోన్లను కూడా తొలగిస్తుంది. ఈ క్రమంలోనే అప్పుడప్పుడు పలు ఆరోగ్య సమస్యలకు గురవుతు ఉంటుంది. కొన్నిసార్లు మనం తినే ఆహారంలో మార్పుల వల్ల కాలేయం చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోతుంది. దీన్నే ఫ్యాటీ లివర్ సిండ్రోమ్ ( Fatty Liver Disease ) అని అంటారు. ఈ సమస్యకు ప్రధాన కారణం అధిక మొత్తంలో ఆల్కహాల్ తీసుకోవడమే అని అంటున్నారు డాక్టర్లు.
ఫ్టాటీ లివర్ అంటే ఏంటి..?
What Is Fatty Liver Disease : శరీర కణాలు సంగ్రహించేందుకు అనువుగా ఆహారాన్ని మార్చేందుకు కాలేయం తన విధులను నిర్వర్తిస్తుంది. ఇటీవల చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో బాధపడుతున్నారు. అందుకు ప్రధాన కారణం కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం. లివర్‌లో కొవ్వు శాతం కొన్ని సందర్భాల్లో ఉండాల్సిన స్థాయి కన్నా ఎక్కువగా ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ అంటారు. అయితే ఈ సమస్యను ఎలా అధిగమించాలో ఇప్పుడు చూద్దాం.
రెండు రకాలు..
Types Of Fatty Liver Disease : వైద్యపరంగా ఫ్యాటీ లివర్ అని పిలిచే ఈ పరిస్థితి రెండు రకాల కారణాలతో ఏర్పడుతుంది. మొదటిది ఆల్కహాలిక్, రెండోది నాన్ ఆల్కహాలిక్. ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అనేది ఎక్కువగా మద్యం తీసుకోవడం వల్ల సంభవిస్తుంది. అయితే నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ మాత్రం జీవనశైలిలో మార్పుల వల్ల వస్తుంది. ఈ రెండు సందర్భాల్లో కాలేయంలో కొవ్వు పేరుకుపోయి మంట, మచ్చలు ఏర్పడతాయి. తర్వాతి దశలో ఇది కాలేయ వైఫల్యానికి దారితీస్తుంది. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి లక్షణాలు అధికమైతే కాలేయం వాపు, హెపటైటిస్, సిరోసిస్ వంటి వ్యాధులు వస్తాయి.
ఇవి కారణాలు..
Reasons For Fatty Liver :కాలేయంలో వచ్చే ప్రధాన సమస్యల్లో ఫ్యాటీ లివర్ ఒకటి. శరీరంలోని ప్రతి భాగంలో కొవ్వు అనేది ఉంటుంది. ఎప్పుడైతే కొవ్వు కణజాలాలు పెరుగుతాయో అప్పుడు కాలేయపు కణజాలాలు తగ్గిపోతాయి. దాని వల్ల కాలేయం పనితీరు క్షీణించే అవకాశం ఉంటుంది. దీన్నే ఫ్యాటీ లివర్ ( Fatty Liver Reasons ) డిసీజ్ అని అంటారు. దీనికి ప్రధాన కారణాలు అనారోగ్యకరమైన జీవనశైలి. వ్యాయామం చేయకపోవడం, అధిక బరువు ఉండటం, రెడ్ మీట్‌ను ఎక్కువగా తీసుకోవడం. మద్యపానం అలవాటు కూడా దీనికి ఒక ముఖ్య కారణంగా చెప్పవచ్చు.
ఫ్యాటీ లివర్ లక్షణాలు..
Fatty Liver Symptoms : ఫ్యాటీ లివర్ తీవ్రత ఎంతనేది నాలుగు దశలను ఆధారంగా చేసుకొని చెప్పవచ్చు. సమస్య పెరుగుతున్న కొద్దీ కాలేయం పాడైపోవడం, కామెర్లు రావడం, శరీరంలో ప్రొటీన్ తగ్గిపోవడం, కడుపులో నీరు చేరడం, పాదాల్లో వాపులు రావడం జరుగుతుంది. ఫ్యాటీ లివర్ సమస్య మరింత ఎక్కువైతే వాంతుల్లో రక్తం రావడం, మలవిసర్జనలో మలినాలు రావడానికి దారితీసే అవకాశం ఉంది. దీన్ని రాకుండా కాపాడుకోవడానికి ప్రయత్నించాలి. అందుకు ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవాటు చేసుకోవాలి. అంతేకాకుండా రెగ్యూలర్‌గా వ్యాయామాలు చేయాలని సూచిస్తున్నారు వైద్యులు.
వీరిలోనూ గమనించవచ్చు..
Effects Of Fatty Liver :ఫ్యాటీ లివర్ వ్యాధి ప్రమాదకరమైనది కాకపోయినప్పటికీ.. కాలేయం బరువు కంటే పది శాతం కొవ్వు పెరిగితే అనేక దుష్ఫలితాలు మొదలవుతాయి. ఆల్కహాల్ అధికంగా తీసుకునేవారిలో ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌ను.. ఆల్కహాల్ అలవాటు లేకపోయినా బరువు అధికంగా ఉండటమో లేదా చక్కెర వ్యాధితో బాధపడేవారిలోనూ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యను గమనించవచ్చు.