ముప్పయ్యో పడిలోకి అడుగుపెట్టామో లేదో.. ముడతలు, వృద్ధాప్యఛాయలంటూ కంగారుపడే అమ్మాయిలెందరో. అందుకే క్రీములకు తెగ ఖర్చు పెట్టేస్తుంటాం. పూర్తిగా వాటిపైనే ఆధారపడక ఈ ఫేస్ ఎక్సర్‌సైజ్‌లనూ ప్రయత్నించమంటున్నారు నిపుణులు.
- మెడ దగ్గర చర్మం ముడతలు పడినట్లు అనిపిస్తోందా? నెమ్మదిగా అది డబుల్ చిన్‌కీ దారి తీయొచ్చు. అలాంటప్పుడు.. నిటారుగా నిల్చొని తలను వీలైనంత వెనక్కి వంచండి. నాలుకను పైపెదవికి ఆన్చి కొద్దిసేపు అలాగే ఉంచండి. మెడ నొప్పి అనిపించగానే యధాస్థితికి వచ్చేయాలి. ఇలారోజూ ఐదు సార్లు చేస్తే సరి.
- నుదుటిమీద గీతల్ని తగ్గించుకోవాలా? అయితే ఆశ్చర్యపోండి. ఏం లేదూ.. కళ్లను వీలైనంత పెద్దగా చేసి, వీలైనంతసేపు ఉంచండి. ఇలా రోజుకు 8-10 సార్లు చేస్తే సమస్య తగ్గుముఖం పడుతుంది.
- ఉబ్బిన కళ్లు, కంటి చివరన గీతలు.. వృద్ధాప్యఛాయలకు సంకేతాలే. వీటిని తగ్గించాలంటే.. మధ్యవేళ్లను కనుబొమల వద్ద ఉంచి రెండు చూపుడు వేళ్లతో కను కొనలవద్ద ఒత్తినట్లుగా ఉంచాలి. తలను నిటారుగా ఉంచి, పైకి చూడటం, గట్టిగా కళ్లు మూయడం లాంటివి చేయాలి. ఇలా 6-10 సార్లు చేసి చూడండి. ఫలితం కనిపిస్తుంది.
- నోరు తెరిచి పెదాలను లోపలికి ముడవాలి. తలను పైకెత్తి గడ్డం దగ్గర వేలితో గట్టిగా లాగిపట్టి ఉంచాలి. నెమ్మదిగా నోరు మూయడం తెరవడం చేయాలి. ఇలా అయిదుసార్లు చేశాక పళ్లు కనిపించకుండా నవ్వినట్లుగా చేయాలి. దీన్నీ రోజూ అయిదారుసార్లు చేస్తే సరి.. బుగ్గల దగ్గర సాగినట్లుగా తయారవుతున్న చర్మానికి చెక్ పెట్టేయొచ్చు.