కళ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ సమస్య రాకుండా జాగ్రత్త పడాలి. కానీ కొందరు నయనాల్ని ఎక్కువగా పట్టించుకోరు. అందువల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో సాధారణంగా మనం కళ్ల విషయంలో చేసే తప్పులేంటో తెలుసుకుందాం.
కంటి పరీక్ష చేయించుకోకపోవటం
కనీసం ఏటా ఒకసారి కంటి పరీక్ష చేయించుకోవటం మంచిది. 40 ఏళ్లు పైబడినవారికిది మరింత ముఖ్యం. కంటి పరీక్షలో చూపు ఎలా ఉందనేది చూస్తారు. కంట్లో చుక్కల మందు వేసి నీటికాసుల వంటి సమస్యలేవైనా ఉన్నాయా అని పరీక్షిస్తారు. అవసరమైతే ఏటా రెండు మూడు సార్లు పరీక్ష చేయాల్సి రావొచ్చు.
దురదపై నిర్లక్ష్యం
కంటి నుంచి నీరు కారటం, దురద, మంట వంటి అలర్జీ లక్షణాలు ఇన్‌ఫెక్షన్లలోనూ కనిపించొచ్చు. ముఖ్యంగా నొప్పి, గరగర వంటివి ఉంటే నిర్లక్ష్యం అసలే పనికిరాదు.
దెబ్బలు పట్టించు కోకపోవటం
కంటికి ఎలాంటి దెబ్బ తగలినా వీలైనంత త్వరగా డాక్టర్‌కు చూపించుకోవాలి. చూపు మసకబారినట్టు అనిపించినా, కళ్లు తెరవలేకపోతున్నా, తెల్లగుడ్డు మీద రక్తం చారలు కనిపించినా, కన్ను సరిగా కదలకపోతున్నా, కంటిపాప పెద్దదిగా లేదా ఆకారం మారినట్టు ఉన్నా ఆలస్యం చేయరాదు.
పొగ తాగటం
పొగ తాగే అలవాటు కళ్లకూ హాని చేస్తుంది. శుక్లాలు, దృశ్యనాడి దెబ్బతినటం, రెటీనా మధ్యభాగం క్షీణించే ముప్పులు పెరిగేలా చేస్తుంది.