సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నారు పెద్దలు. అలాంటి కళ్లను కాపాడుకోవటం ఎంతో ముఖ్యం. కళ్లు మనలోని ఎన్నో హావభావాలను వ్యక్తపరుస్తాయి. కంటి ఆరోగ్యమే అన్నింటి కన్నా మిన్నా. కళ్లు బాగుంటేనే ఆరోగ్యంగా ఉన్నట్లు లెక్కని అంటారు కొందరు. ఎందుకంటే కంటి సమస్యలతో బాధపడితే కొన్నాళ్లకు చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ముఖ్యంగా వాహనాలపై వెళ్లేవారికి కంటిలో ధూళి, దుమ్ము పడతాయి. దీంతో కళ్లు ఎర్రగా మారిపోతాయి. అయితే ఈ సమస్య నుంచి బయటపడేందుకు ఏం చేయాలో ఓ సారి తెలుసుకుందాం.
గాలి కాలుష్యం వల్ల..
రోజూ అనేక పనుల మీద బైక్, ఇతరత్రా వాహనాలపై బయటకు వెళ్తుంటాం. ఎండాకాలంలో అయితే వేడి బెడద ఉండనే ఉంటుంది. రోడ్డు మీద దుమ్ము, ధూళి సరేసరి. అయితే దుమ్ము, ధూళి వల్ల కళ్లు తీవ్రంగా దెబ్బతింటాయి. ఉద్యోగ, వ్యాపార నిమిత్తం బైక్పై తిరిగేవారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని నిపుణులు చెబుతున్నారు. అప్పుడు కంటిలో దుమ్ము, ధూళి పడవని అంటున్నారు. అలాగే కళ్లద్దాలు (ప్రొటెక్టివ్ గ్లాసెస్) ఉపయోగించాలని సూచిస్తున్నారు.
'అతి నీలలోహిత (యూవీ ) కిరణాల ముప్పును తప్పించుకునేందుకు కళ్లద్దాలు వాడడం ఉత్తమం. అలాగే కళ్లద్దాలు వాడడం వల్ల కంట్లోకి దుమ్ము, ధూళి కూడా పడవు. అందువల్ల కళ్లు పొడిబారటం, ఎర్రగా అవ్వడం వంటి సమస్యలు తలెత్తవు. అందుకే వాహనదారులు వాయు కాలుష్యం నుంచి తప్పించుకునేందుకు జాగ్రత్తలు పాటించండి.'