Sleep Helps Reduce Weight: బరువు తగ్గించుకోవాలని అనుకుంటున్నారా? అయితే రాత్రిపూట ఒక గంటసేపు ఎక్కువ నిద్రపోండి! ఆశ్చర్యంగా అనిపించినా బరువు తగ్గించుకునే మార్గం పడకగదిలోనూ ఉంటున్నట్టు యూనివర్సిటీ ఆఫ్ షికాగో, యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్-మాడిసన్ అధ్యయనం సూచిస్తోంది. అధికబరువు గలవారు రాత్రిపూట మరో గంటసేపు అదనంగా నిద్రిస్తే తక్కువగా తినటమే దీనికి కారణం. వీరిలో కొందరు రోజుకు 270 కేలరీల ఆహారం తగ్గిస్తే, మరికొందరు ఏకంగా 500 కేలరీల ఆహారం తక్కువగా తినటం గమనార్హం.
రోజుకు 270 కేలరీలు తగ్గటం వల్ల ఒనగూరే దీర్ఘకాల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకొని చూస్తే మూడేళ్లలో సుమారు 13 కిలోల బరువు తగ్గే అవకాశముంది. చాలావరకు అధ్యయనాలు నిద్ర తగ్గితే ఎక్కువగా తినటం మీద దృష్టి సారిస్తుంటాయి. దీనికి భిన్నంగా తాజా అధ్యయనంలో నిద్రను పెంచుకుంటే ఏమవుతుందనే దాన్ని పరిశోధకులు పరిశీలించారు. ఇందులో సానుకూల ఫలితం వెల్లడి కావటం ముదావహం.