Sitting can Reduce Weight: అధిక బరువును తగ్గించే శక్తి నీళ్లకు ఉంది. అందుకే బరువును బట్టి సరైన మోతాదులో నీళ్లు తాగడం ఇటు ఆరోగ్యానికి, అటు ఫిట్నెస్కూ మంచిదని చెబుతుంటారు నిపుణులు. అలాగని గ్లాసులకు గ్లాసులు ఒకేసారి గటగటా తాగేయడం కాకుండా కూర్చొని నెమ్మదిగా సిప్ చేయాలంటున్నారు. ఇలా రోజంతా ఇదే పద్ధతిని పాటించడం వల్ల ఎలాంటి శ్రమ లేకుండా ఎంచక్కా బరువు తగ్గేయచ్చంట..!
కాస్త కదిలిస్తే పోయేదేముంది:రోజంతా కూర్చున్న చోటు నుంచి లేవకుండా పనితోనే గడిచిపోతుంది. అలాంటప్పుడు వ్యాయామం చేసే సమయమెక్కడిది? ఫిట్నెస్ విషయంలో ఇది చాలామందిని వేధించే ప్రశ్నే! కానీ అలా కూర్చున్న చోటు నుంచి లేవకుండా శరీరంలో చేరిన అదనపు క్యాలరీలను కరిగించుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు. అదెలాగంటే పనిచేసే క్రమంలో మధ్యలో ఓ ఐదు-పది నిమిషాల పాటు విరామం తప్పకుండా దొరుకుతుంది. అలాంటప్పుడు బద్ధకంగా ఓ కునుకు తీయడమో, మొబైల్ చూడడమో కాకుండా.. చేతులు, కాళ్లతో చిన్నపాటి వ్యాయామాలు చేయండి. దీనివల్ల ఒకేచోట ఎక్కువ సేపు కూర్చోవడం వల్ల కండరాలు బిగుసుకుపోకుండా జాగ్రత్తపడచ్చు.. అలాగే శరీరానికి చక్కటి వ్యాయామమూ అందుతుంది. బరువు తగ్గించుకోవడానికి ఇదీ ఓ మార్గమే!
మనస్ఫూర్తిగా నవ్వేద్దా:కూర్చున్న చోటే హ్యాపీగా నవ్వుతూ బరువు తగ్గేయచ్చంటున్నారు నిపుణులు. అదెలాగంటే.. మనస్ఫూర్తిగా నవ్వడం వల్ల మన శరీరంలో బేసల్ మెటబాలిక్ రేటు (విశ్రాంతిలో ఉన్నప్పుడు జీవక్రియల పనితీరుకు అవసరమైన క్యాలరీల సంఖ్య) సుమారు 10-20 శాతం పెరుగుతుందని ఓ అధ్యయనం చెబుతోంది. అంటే రోజు మొత్తం మీద కనీసం ఒక పదిహేను నిమిషాల పాటు నవ్వితే దాదాపు 40-170 క్యాలరీల దాకా కరుగుతాయట! అంతేకాదు.. ఇలా మనం నవ్వే నవ్వు మనలోని ఒత్తిడి, ఆందోళనల్ని కూడా దూరం చేస్తుంది. బరువు తగ్గడానికి ఇదీ ఓ మార్గమే!