Temporary paralysis: పక్షవాతం ఎంత ప్రమాదకరమైందో చెప్పక్కర్లేదు. సత్వరం చికిత్స అందకపోతే వైకల్యం బారినపడక తప్పదు. కొన్నిసార్లు ప్రాణాపాయమూ సంభవించొచ్చు. మెదడు భాగానికి రక్త సరఫరా ఆగిపోవటం (ఇస్కెమిక్) లేదా మెదడులోకి రక్తస్రావం కావటం (హెమరేజిక్) వల్ల పక్షవాతం వస్తుంటుంది. సాధారణంగా రక్తనాళాల్లో రక్తం గడ్డలు ఏర్పడటం లేదా పూడికల మూలంగా రక్త సరఫరా నిలిచిపోతుంటుంది. అదృష్టవశాత్తు కొందరికిది కొద్దిసేపే ఉండొచ్చు. కొద్ది నిమిషాల్లోనే లక్షణాలు తగ్గిపోవచ్చు. దీన్నే ట్రాన్సియెంట్ ఇస్కెమిక్ అటాక్ (టీఐఏ) అంటుంటారు. ప్రస్తుతం దీని పేరును 'మైనర్ ఇస్కెమిక్ స్ట్రోక్'గా మార్చాలని వైద్యరంగంలో చర్చ నడుస్తోంది. టీఐఏలో తాత్కాలికమనే అర్థం ధ్వనిస్తుండటంతో తేలికగా తీసుకుంటుండటమే దీనికి కారణం.
పక్షవాతం లక్షణాలు వెంటనే తగ్గిపోవటం వల్ల 'హమ్మయ్య.. ప్రమాదం గడిచింది. గండం నుంచి గట్టెక్కినట్టే' అని చాలామంది భావిస్తుంటారు. మర్నాడో, ఆపై వారమో డాక్టర్ దగ్గరికి వెళ్దామని అనుకుంటుంటారు. కానీ కొందరిలో తీవ్ర నష్టమే జరుగుతుంది. టీఐఏ బాధితుల మెదడులోనూ స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నట్టు, కొందరిలో ఆయా భాగాలు శాశ్వతంగా దెబ్బతింటున్నట్టు స్కాన్ పరీక్షలు చెబుతున్నాయి. పక్షవాతంలో నాడీ కణాలు, వీటి మధ్య అనుసంధానాలు చాలా వేగంగా చనిపోవటం ఆరంభిస్తాయి. కొద్దిసేపు రక్త సరఫరా ఆగినా మెదడు దెబ్బతినటానికి దారితీస్తుంది.