తెలంగాణ

telangana

ETV Bharat / sukhibhava

వ్యాయామం ఎక్కువగా చేస్తే గుండెపోటు వస్తుందా? వైద్యుల మాటేంటి? - వ్యాయామం వల్ల గుండెపోటు

Exercise Heart Attack Risk in Telugu : ఆరోగ్యానికి వ్యాయామం ఎంతో మేలు చేస్తుంది. రోజూ కొంత సమయం ఎక్సర్​సైజ్​కు కేటాయించడం వల్ల ఆరోగ్యంగా ఉంటాం. కొంతమంది వ్యాయామం చేసేటప్పుడు ఉన్నట్టుండి కుప్పకూలిపోవడం చూసే ఉంటారు. దీనికి కారణం అతిగా వ్యాయామం చేయడమే. ఇలా అతి వ్యాయామం చేయడం వల్ల జరిగే నష్టాలేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.

Exercise Heart Attack Risk
Exercise Heart Attack Risk

By ETV Bharat Telugu Team

Published : Jan 17, 2024, 4:51 PM IST

Exercise Heart Attack Risk in Telugu :మన ఆరోగ్యానికి వ్యాయామం చేసే మేలు అంతా ఇంతా కాదు. కానీ ఇదే వ్యాయామం కొంత మందికి గుండె పోటును తెచ్చిపెడుతుంది. ఎక్సర్​సైజ్ చేస్తున్నప్పుడు కొంత మంది కుప్పకూలిపోతున్నారు. ఇలా జరగడం వెనుక అతిగా వ్యాయామం చేయడం, శరీర సామర్థ్యాల్ని పట్టించుకోకపోవడం లాంటివి కారణాలుగా వైద్యులు చెబుతున్నారు. శక్తికి మించి వ్యాయామం చేస్తున్నప్పుడు గుండెలోని విద్యుత్ కేంద్రం కొన్నిసార్లు అస్తవ్యస్తం అయ్యే అవకాశముంటుంది. ఈ నేపథ్యంలో అతి వ్యాయామం వల్ల పొంచి ఉన్న గుండె పోటు ముప్పు గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Exercise Heart Attack Cause :నిత్యం కాసేపు వ్యాయామం చేయడం శారీరక, మానసిక సామర్థ్యాలను పెంచడం సహా మధుమేహం, అధిక బరువు, అధిక రక్తపోటు వంటి జబ్బుల నియంత్రణకు, నివారణకు తోడ్పడుతుంది. అతి ఏదైనా మంచిది కాదని పెద్దలు అంటారు కదా! వ్యాయాయం మన ఆరోగ్యానికి ఎంత మంచిదైనా దానికీ ఓ పరిమితి ఉంది. శరీర సామర్థ్యాన్ని పట్టించుకోకుండా అదే పనిగా కసరత్తులతో కష్టపెడితే తీవ్ర దుష్పరిణామాలుంటాయి. ఇటీవలి కాలంలో వ్యాయామం చేస్తూ గుండెపోటుకు గురైన వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది. కొందరు వేగంగా పరిగెత్తడం, ఆటలు ఆడుతూ, జిమ్​లో కసరత్తు చేస్తూ సెడన్​గా పడిపోతుంటారు. ఇందుకు అతిగా వ్యాయామం చేయడం సహా ఇప్పటికే తెలియకుండా ఉన్న గుండె సమస్యలు కారణం కావచ్చని వైద్యులు చెబుతున్నారు.

మానసిక ఒత్తిడితోనూ ముప్పే!
గుండెపోటు రాకుండా నివారించేందుకు వ్యాయామం అనేది చాలా మంచిది. గుండె సంబంధ వ్యాధుల్లో చికిత్స తీసుకున్న వారు రోజూ కాసేపు వ్యాయామం చేయాలని సలహా ఇస్తాం. వ్యాయామ సమయంలో గుండె పోట్లు రావడానికి గల ప్రధాన కారణం ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రెస్పాన్స్. సింపుల్​గా చెప్పాలంటే గుండె స్పందించే తీరు. ఈ మధ్య కాలంలో పెరుగుతున్న మానసిక ఒత్తిడి కారణంగా రోజులో చాలా సార్లు వస్తుంది. దీని వల్ల రక్తనాళాలు దెబ్బతింటాయి. మనం ఒక నియంత్రిత వేగంలో ఎక్సర్​సైజ్ చేయడం వల్ల గుండె కూడా స్పీడుగా కొట్టుకుంటుంది. గుండె వేగం పెరిగినప్పుడు రక్త సరఫరా పెరిగి రక్తనాళాలు శుభ్రపడుతాయి. ఇది నెమ్మదిగా పెంచుకుంటూ పోవాలి కానీ ఒకేసారి చేయకూడదు.

"ఎక్సర్​సైజ్​లో వార్మప్ దశ, కసరత్తులు చేసే దశ, కూల్ డౌన్ దశ ఉండాలి. ఇందులో ముఖ్యంగా మెంటల్ రిలాక్సేషన్ ఉండాలి. మోతాదుకు మించి చేడయం వల్లే ముప్పు తప్ప నార్మల్​గా వ్యాయామం చేయడం వల్ల ఎలాంటి ఇబ్బందులు, నష్టం ఉండదు. గుండె పోటు వచ్చిన వాళ్లను కూడా రోజూ వ్యాయామం చెయ్యాలని చెబుతుంటాం."
-డా. వీఎస్. రామచంద్ర, ఎలక్ట్రో ఫిజియాలజిస్టు

వంశపారంపర్య సమస్యలు ఉన్నాయా?
వ్యాయామం చేస్తున్నప్పుడు గుండె పోటు రావడానికి ఆ రోజు అప్పటి శారీరక స్థితి, ఆరోగ్యం, ఇతరత్రా సమస్యలన్నీ కారణాలుగా ఉంటాయి. ముందు రోజు తీసుకున్న మద్యం, ఒత్తిడి, నిద్రలేమి వంటి సమస్యల కారణంగా మరునాడు శరీరం వ్యాయామానికి సహకరించకపోవచ్చు. వీటిని పట్టించుకోకుండా ఎప్పటి లాగానే వ్యాయామానికి ఉపక్రమించినప్పుడు లేదా విపరీతంగా ఎక్సర్​సైజ్ చేసినప్పుడు గుండెపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. కొంత మందికి వంశపారంపర్యంగా గుండె సంబంధిత సమస్యలుంటాయి. కానీ ఆ విషయం వారికి తెలియకపోవచ్చు. అలాంటి వారు తీవ్రంగా శ్రమించినప్పుడు అడ్రినలిన్ హార్మోన్ విడుదలై విద్యుత్ వ్యవస్థ మీద విపరీత ప్రభావం పడుతుంది. ఈ వ్యవస్థ అస్తవ్యస్తమైతే గుండె లయ దెబ్బతింటుంది. అప్పుడు గుండె బాగా నెమ్మదిగా, వేగంగా లేదా పూర్తిగా ఆగిపోవచ్చు.

Exercise Heart Attack Symptoms :గుండెపోటుకు వ్యాయామం ప్రత్యక్ష కారణం కాదు. శరీరం సహకరించపోతున్నా బలవంతంగా చేయడమే ముప్పు తెచ్చిపెడుతుంది. అప్పటికీ శరీరం కొన్ని హెచ్చరికలు జారీ చేస్తూనే ఉంటుంది. వాటిని గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవడం ఎంతైనా అవసరం. నోరు ఎండిపోవడం, శరీరం కాస్త చల్లబడటం, తీవ్రమైన ఆయాసం, గుండె దడ, వణకటం, వికారాలు వంటి లక్షణాలు కనిపించినప్పుడు వ్యాయామం ఆపేయాలి. శరీరం మాములు స్థితికి చేరుకున్నాక, గుండె, శ్వాస వేగం నెమ్మదించాక తిరిగి కొనసాగించవచ్చు. ఈసారి కాస్త తక్కువ వేగంతో చేయాలి.

వ్యాయామం మూలంగా గుండె పోటు వచ్చిందని, ఎక్కడో, ఎవరికో ఏదో అయిందని భయపడటం సరికాదు. రోజూ ఎంతో మంది సురక్షిత వ్యాయామాలు చేస్తూనే ఉన్నారు. అయితే వ్యాయామాలు ఆరంభించే ముందు ఒకసారి ఈసీజీ, టుడీ ఎకో, ట్రెడ్ మిల్ వంటి పరీక్షలు చేసుకోవడం మంచిది. గుండె లయ సమస్యలు, రక్తనాళాల్లో పూడికలు ఏవైనా ఉంటే వీటిల్లో బయటపడతాయి. మధుమేహం, అధిక రక్తపోటు, పొగతాగే అలవాటు, అధిక కొలెస్ట్రాల్, కుటుంబంలో ఎవరికైనా గుండె జబ్బులు వంటి ముప్పు కారణాలు గలవారికి ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయి. వ్యాయామంతో తలెత్తే గుండెపోటు ముప్పును చాలా వరకు నివారిస్తాయి.

వ్యాయామంతో అధిక గుండెపోటు ముప్పుందా?

నల్లద్రాక్షతో క్యాన్సర్​కు చెక్​ - గుండె జబ్బులకు, మైగ్రేన్ సమస్య​లకు పరిష్కారం!

అధిక కొలెస్ట్రాల్​ వెన్నలా కరగాలా? మార్నింగ్​ ఈ డ్రింక్స్​ ట్రై చేయండి!

ABOUT THE AUTHOR

...view details