ఒకసారి మధుమేహం వచ్చిందంటే నయం కావటం అసాధ్యం. దీన్ని నియంత్రణలో ఉంచుకోవటం తప్పించి చేయగలిగిందేమీ లేదు. అందుకే జీవనశైలి మార్పులతో దీని బారినపడకుండా చూసుకోవటమే మేలన్నది నిపుణుల సూచన.
వ్యాయామం తప్పనిసరి..
జీవనశైలి మార్పుల్లో ప్రధానంగా చెప్పుకోవాల్సింది వ్యాయామం. మధుమేహ నివారణలో ఇంతకుమంచి తేలికైన, చవకైన మార్గం మరోటి లేదు. అయితే కొందరికి ఎంత వ్యాయామం చేసినా పెద్దగా ఫలితం కనిపించదు. ఎందుకిలా? హాంకాంగ్ విశ్వవిద్యాలయ పరిశోధకులకు ఇలాంటి అనుమానమే వచ్చింది. ముందస్తు మధుమేహ దశలో ఉన్న కొందరిని ఎంచుకొని.. వ్యాయామానికీ పేగుల్లోని బ్యాక్టీరియా, జీవక్రియలకూ గల సంబంధం మీద అధ్యయనం చేశారు. వ్యాయామంతో గ్లూకోజు జీవక్రియలు, ఇన్సులిన్ స్పందనలు మెరుగుపడినవారి పేగుల్లో భిన్నమైన బ్యాక్టీరియా ఉంటున్నట్టు గుర్తించారు. ఈ బ్యాక్టీరియా కొవ్వు ఆమ్లాలను మరింత ఎక్కువగా పుట్టిస్తుండటం, అమైనో ఆమ్లాలను ఇంకాస్త అధికంగా విడగొడుతుండటం విశేషం. వీరిలో జీవక్రియలు చురుకుగా సాగుతున్నాయనటానికి ఇది నిదర్శనం.