వ్యాయామం చేసినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. దీంతో మెదడుకు మరింత ఎక్కువ రక్తం, ఆక్సిజన్ సరఫరా అవుతాయి. వ్యాయామంతో మెదడు కణాల ఎదుగుదలకు తోడ్పడే హార్మోన్లు విడుదలవుతాయి. వాటి మధ్య కొత్త అనుసంధానాలు పుట్టుకొచ్చేలానూ ప్రేరేపిస్తుంది. ఇవన్నీ రకరకాల ప్రయోజనాలు చేకూరేలా చేస్తాయి.
1. కుదురైన ఏకాగ్రత
చదువుల మీద, పనుల మీద ధ్యాస ఉండటం లేదా? అయితే వ్యాయామాల వైపు ఓ కన్నేయండి. దీంతో ఏకాగ్రత మెరగవుతుంది. తీవ్రంగా వ్యాయామాలు చేసేవారిలో ఏకాగ్రత సామర్థ్యాన్ని సూచించే ఐఏపీఎఫ్ (ఇండివిడ్యువల్ అల్ఫా పీక్ ఫ్రీక్వెన్సీ) పుంజుకుంటున్నట్టు అధ్యయనాలు పేర్కొంటుండటమే దీనికి నిదర్శనం. అయితే జాగింగ్, సైకిల్ తొక్కటం వంటి ఒకింత 'నిలకడ స్థితి' వ్యాయామాలతో పెద్దగా మార్పేమీ కనిపించకపోవటం గమనార్హం.
2. జ్ఞాపకశక్తి మెరుగు
నడక, జాగింగ్, తోటపని వంటి ఏరోబిక్ వ్యాయామాలు (గుండె, శ్వాస వేగం పెరిగేలా చేసేవి) మెదడులోని హిప్పోక్యాంపస్ అనే భాగం వృద్ధి చెందేలా చేస్తాయి. మనం ఆయా విషయాలను నేర్చుకోవటం, జ్ఞాపకం పెట్టుకోవటం వంటివాటికి తోడ్పడేది హిప్పోక్యాంపసే. ఇది వయసుతో పాటు కుంచించుకుపోకుండానూ వ్యాయామం కాపాడుతుంది. అంటే వృద్ధాప్యంలో మతిమరుపు రాకుండానూ చూస్తుందన్నమాట. పనులను మరింత ఇష్టంగా చేసేవారిలో మెదడు కణాలు తిరిగి ఉత్తేజితం కావటం ఇంకాస్త ఎక్కువగా ఉంటున్నట్టూ కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇంకేం మనసుకు ఆనందాన్ని, ఉత్సాహాన్నిచ్చే పనులను, వ్యాయామాలను ఎంచుకోవటం మీద దృష్టి సారించండి.
3. కుంగుబాటు, ఆందోళన తగ్గుముఖం
ఏరోబిక్ వ్యాయామాలు కుంగుబాటు (డిప్రెషన్), ఆందోళన (యాంగ్జయిటీ) లక్షణాలు తగ్గటానికీ తోడ్పడతాయి. అందుకే ఇలాంటి సమస్యలు గలవారికి డాక్టర్లు చికిత్సలో భాగంగా వ్యాయామాన్నీ సూచిస్తుంటారు. మెదడు కణాలు దెబ్బతినటాన్ని, విచ్ఛిన్నం కావటాన్ని వ్యాయామం నెమ్మదింపజేస్తుంది. దీని పూర్తి ప్రయోజనాలు పొందటానికి కొన్ని నెలలు పట్టొచ్చు. అందువల్ల వ్యాయామాన్ని ఒక అలవాటుగా మలచుకొని, కొనసాగించటం మంచిది.
4. కొత్త విషయాలు నేర్చుకునేలా..
కొత్త విషయాలను నేర్చుకునేటప్పుడు మెదడు కూడా అందుకు అనుగుణంగా మార్పు చెందుతుంటుంది (న్యూరోప్లాస్టిసిటీ). వ్యాయామంతో ఇలాంటి సామర్థ్యం బాగా పుంజుకుంటుంది. సాధారణంగా పెద్దవాళ్ల కన్నా చిన్నవారిలో ఇది ఎక్కువ. కానీ ఒకే వయసువారిని తీసుకుంటే వ్యాయామం చేసేవారిలో కొత్త విషయాలను నేర్చుకునే సామర్థ్యం అధికంగా ఉంటుంది. ఏరోబిక్, కండరాలను బలోపేతం చేసే వ్యాయామాలు ఏవైనా ఇందుకు తోడ్పడతాయన్నది శాస్త్రవేత్తల భావన.
5. డిమెన్షియా నుంచి రక్షణ