anemia treatment:రక్తహీనత సర్వ సాధారణ సమస్య. వయసు, జాతి, లింగభేదం తేడా లేదు. పసికందుల దగ్గర్నుంచి పండు ముదుసలి వరకూ.. ఎవరికైనా రావొచ్చు, ఎప్పుడైనా రావొచ్చు. అయినా దీనిపై ఇప్పటికీ అవగాహన తక్కువే. కొందరిని ఇదేమీ పెద్దగా ఇబ్బంది పెట్టకపోవచ్చు. మందులకు త్వరగానూ స్పందించొచ్చు. కానీ కొందరిని తీవ్రంగా వేధించొచ్చు చికిత్సకు లొంగకుండా ప్రాణాల మీదికీ తేవొచ్చు. కాబట్టి రక్తహీనత (ఎనీమియా) గురించి తెలుసుకొని ఉండటం మంచిది.
anemia symptoms:కొద్దిసేపు పని చేయగానే నీరసం ముంచుకొస్తుంది. కాసేపు నడిస్తే ఆయాసం వచ్చేస్తుంది. ఏకాగ్రత కుదరదు. పని మీద శ్రద్ధా ఉండదు. చిరాకు, కోపం. ఇలాంటి వాటిని చాలామంది పెద్దగా పట్టించుకోరు. సరిగా తినకపోవటం వల్ల వచ్చిన బలహీనతగానో.. రాత్రి నిద్ర పట్టకపోవటంతో తలెత్తిన అలసటగానో భావిస్తుంటారు. లేదూ వయసు మీద పడినప్పుడు ఒకింత నిస్సత్తువ, ఆందోళన సహజమేననీ అనుకుంటుంటారు. రక్తహీనత ఇలాగే బురిడీ కొట్టిస్తుంది. దీని లక్షణాలు నెమ్మదిగా మొదలై, క్రమంగా తీవ్రమవుతూ రావటం.. శరీరం వీటికి అలవాటు పడటం వల్ల మామూలు ఇబ్బందులుగా పొరపడేలా చేస్తుంది. అందుకే ఎంతోమందికి రక్తహీనత ఉందన్న సంగతైనా తెలియదు. రోజురోజుకీ చాపకింద నీరులా విస్తరిస్తూనే ఉంటుంది. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేల ప్రకారం.. 2015-16లో మనదేశంలో 6 నెలల నుంచి ఆరేళ్ల వయసు పిల్లల్లో 59 శాతం మంది రక్తహీనతతో బాధపడుతుండగా.. 2019-21లో వీరి సంఖ్య 67 శాతానికి ఎగబాకింది. మహిళల్లోనైతే ఇది 53 శాతం నుంచి 57 శాతానికి ఎగబాకింది. మన జీవన విధానం మెరుగుపడుతోందని, పోషకాహార స్థాయి పెరిగిందని సంతోషిస్తున్న తరుణంలో ఇది నిజంగా ఆందోళన కలిగించేదే. తాజా గ్లోబల్ న్యూట్రిషన్ నివేదిక సైతం ప్రపంచమంతా రక్తహీనత, పోషణలోపాన్ని ఎదుర్కొంటోందనే ఘోషిస్తోంది. రక్తహీనతతో రాన్రానూ శారీరక, మానసిక సామర్థ్యం తగ్గుతుంది. దీంతో చదువులు, ఉద్యోగాలు, పనుల్లో రాణించటమూ తగ్గుతుంది. రోగనిరోధకశక్తి తగ్గటం మూలంగా వివిధ జబ్బుల ముప్పూ పెరగొచ్ఛు గర్భిణులకు రక్తహీనత ఉంటే పిండం సరిగా ఎదగకపోవచ్చు, నెలలు నిండకముందే కాన్పు కావచ్ఛు పిల్లల్లో రక్తహీనత ఎదుగుదలను దెబ్బతీస్తుంది. ఇది జీవితాంతం ప్రభావం చూపుతుంది. కాబట్టి రక్తహీనతను తేలికగా తీసుకోవటానికి లేదు.
anemia causes:
ఎముకమజ్జలోంచి తగినన్ని ఎర్ర రక్తకణాలు ఉత్పత్తి కాకపోవటం, ఉత్పత్తి అయినా త్వరగా క్షీణించటం, లేదూ రక్తం కోల్పోవటం.. రక్తహీనతకు మూలం ఇవే. రకరకాల సమస్యలు, కారణాలు దీనికి దోహదం చేస్తుంటాయి. జన్యుపరంగా పుట్టుకతో తలెత్తే సమస్యలూ కారణం కావొచ్ఛు కొన్నిసార్లు ఎలాంటి కారణమూ ఉండకపోవచ్చు.
తక్కువగా ఉత్పత్తి కావటం:మంచి ఆరోగ్యకరమైన ఎర్ర రక్తకణాలు, హిమోగ్లోబిన్ ఉత్పత్తి కావటానికి ఐరన్, విటమిన్ బి12, ఫోలిక్ యాసిడ్, విటమిన్ సి వంటి పోషకాలు అవసరం. కొన్ని ఖనిజాలు, ప్రొటీన్ సైతం ఇందుకు తోడ్పడతాయి. హార్మోన్లు.. ముఖ్యంగా ఎర్ర కణాల ఉత్పత్తిని పెంచే ఎరిత్రోపాయిటిన్ సమతులంగానూ ఉండాలి. మంచి పోషకాహారం తినకపోతే ఐరన్, విటమిన్ల వంటి పోషకాలు లోపిస్తాయి. దీంతో ఎర్ర రక్తకణాలు సరిగా ఉత్పత్తి కావు. మనదేశంలో రక్తహీనతకు ప్రధాన కారణం ఇదే. మహిళలు, బడికి వెళ్లే వయసు పిల్లలు, వృద్ధుల్లో సుమారు 60% మందిలో కనిపించేది ఇలాంటి రకం సమస్యే. కొందరిలో ఆహారం ద్వారా లభించే విటమిన్ బి12ను శరీరం సరిగా గ్రహించుకోదు. మధుమేహ చికిత్సలో ఇచ్చే మెట్‌ఫార్మిన్ మందుతోనూ విటమిన్ బి12ను గ్రహించుకునే సామర్థ్యం తగ్గొచ్ఛు క్యాన్సర్, హెచ్‌ఐవీ/ఎయిడ్స్, రుమటాయిడ్ ఆర్థ్రయిటిస్, ల్యూపస్, కిడ్నీ జబ్బుల వంటివీ ఎర్ర రక్తకణాల తయారీని దెబ్బతీయొచ్చు.
త్వరగా క్షీణించటం:ఎర్ర రక్తకణాలు సగటున 120 రోజుల వరకు జీవిస్తాయి. ఆ తర్వాత చనిపోతాయి. వీటి స్థానంలో ఎప్పటికప్పుడు కొత్తవి పుట్టుకొస్తుంటాయి. ఇదంతా ఒక క్రమపద్ధతిలో సాగుతూ వస్తుంది. కానీ కొన్నిసార్లు ఎర్ర కణాలు ముందుగానే క్షీణిస్తుంటాయి. వీటిని భర్తీ చేయటానికి ఎముకమజ్జలోంచి తగినన్ని కణాలు తయారవ్వకపోవచ్చు. ఎర్ర కణాలు త్వరగా క్షీణించటానికి రకరకాల సమస్యలు దోహదం చేయొచ్ఛు ల్యూపస్ వంటి ఆటోఇమ్యూన్ జబ్బుల్లో పుట్టుకొచ్చే యాంటీబాడీలు రక్త కణాల మీద దాడి చేసి, త్వరగా క్షీణించేలా చేయొచ్ఛు హెపటైటిస్, మలేరియా వంటి ఇన్‌ఫెక్షన్లు.. ప్లీహం పెద్దగా అవ్వటం, కొన్నిరకాల మందుల వంటివీ ఇందుకు కారణం కావొచ్ఛు కొందరికి జన్యుపరంగా వచ్చే సికిల్‌సెల్, థలసీమియా వంటి జబ్బులతోనూ ఎర్ర కణాలు త్వరగా క్షీణించొచ్చు.
రక్తం కోల్పోవటం:రక్తహీనతకు మరో కారణం రక్తం పోవటం. రక్తం పోయినప్పుడు ఎర్ర కణాల సంఖ్యా తగ్గుతుంది. ఇది ఒంట్లో ఐరన్ మోతాదులు తగ్గటానికీ దోహదం చేస్తుంది. తగినంత ఐరన్ లేకపోతే ఎర్ర కణాల ఉత్పత్తీ తగ్గుతుంది. ఇదీ తిరిగి రక్తహీనతకు దారితీస్తుంది. పొట్టలో అల్సర్లు.. జీర్ణాశయంలో పెద్దపేగులో క్యాన్సర్లు గలవారికి లోలోపలే రక్తస్రావం కావొచ్చు. ఇది క్రమంగా రక్తహీనతకు దారితీస్తుంది. ఇటీవల పెద్దపేగులో క్యాన్సర్ ఎక్కువగానూ చూస్తున్నాం. కొన్నిసార్లు దీన్ని రక్తహీనతతోనే గుర్తిస్తుండటం గమనార్హం. మొలల సమస్యతో బాధపడేవారు అప్పుడప్పుడు రక్తం పడుతోందని చెబుతుంటారు. కానీ చాలాసార్లు తెలియకుండానే రోజూ కొద్దికొద్దిగా మలంలో రక్తం పోతుండొచ్ఛు దీంతో రక్తహీనత ముప్పు పెరుగుతుంది. మహిళల్లో కొందరికి మామూలు కన్నా ఎక్కువగా రుతుస్రావం కావొచ్చు. ఇదీ సమస్యను తెచ్చిపెట్టొచ్చు. ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడటం, కాన్పు, రక్తనాళాలు చిట్లటం, సర్జరీ చేసేటప్పుడు పెద్దఎత్తున రక్తస్రావం కావటంతోనూ ఎనీమియా తలెత్తొచ్చు. మనదగ్గర పిల్లల్లోనే కాదు, పెద్దవారిలోనూ పేగుల్లో కొంకి పురుగులు ఉంటుంటాయి. ఇవి రక్తాన్ని పీల్చుకొని జీవిస్తాయి. దీంతో రక్తం తగ్గిపోతుంది. క్రమంగా రక్తహీనత మొదలవుతుంది.
నిర్ధరణ ఎలా?
రక్తహీనత అనుమానిత లక్షణాలు సంపూర్ణ రక్తపరీక్ష చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎర్ర రక్తకణాలు, తెల్ల రక్తకణాలు, ప్లేట్‌లెట్లు, హిమోగ్లోబిన్ మోతాదుల వంటివి బయటపడతాయి. సాధారణంగా హిమోగ్లోబిన్ మగవారిలో సగటున 14.5 గ్రాములు, ఆడవారిలో 13.5 గ్రాములు ఉండాలి. ఇంతకన్నా తగ్గితే సమస్య ఉన్నట్టే. స్వల్పంగా తగ్గితే మామూలుగా, కాస్త ఎక్కువగా తగ్గితే మధ్యస్థంగా, 7 గ్రాముల కన్నా తగ్గితే తీవ్ర సమస్యగా భావిస్తారు. ఎర్ర రక్తకణాల పరీక్షలో సంఖ్యతో పాటు వాటి పరిమాణం, ఆకారం కూడా తెలుస్తాయి. దీంతో ఎర్ర కణాలు తక్కువగా ఉత్పత్తి కావటం, త్వరగా క్షీణించటం, రక్తం పోవటం వంటివేవైనా సమస్యకు కారణమవుతున్నాయా అనేదీ బయటపడుతుంది. రక్తహీనత ఉన్నట్టు తేలితే అది ఎలాంటి రకం? ఎంత తీవ్రంగా ఉంది? అనేవి తెలుసుకోవటానికి మరికొన్ని పరీక్షలు అవసరమవుతాయి.