మూర్ఛవ్యాధి.. సమాజాన్ని వేధిస్తున్న ప్రధాన రుగ్మతల్లో ఒకటి. బాల్యంలో దీని బారిన పడేవారి సంఖ్య ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. మూర్ఛ సమయంలో వారి స్మృతి దెబ్బతింటుంది. తరువాత కొంత సేపట్లోనే కోలుకుని యథాస్థితికి వస్తారు. యవ్వనావస్థలో ఈ వ్యాధి తీవ్రత తగ్గిపోవచ్చు లేదా పూర్తిగా అదృశ్యం కావచ్చు. ఈ వ్యాధిలో కలిగే మూర్ఛా సమయాన్ని బట్టి ఆధునిక వైద్యులు గ్రాండ్ మాల్, పెటిట్ మాల్ గా వర్గీకరించారు. మూర్ఛ సమయంలో మొత్తం మెదడు నుంచి కానీ, ఏదైనా ఒక భాగం నుంచి కానీ విద్యుత్ ప్రకంపనలు కంకాళ కండరాలకు చేరి శరీరం బిగుసుకుపోవడానికి కారణమవుతాయి.
మూర్ఛ వ్యాధిని ప్రేరేపించే అనేక అంశాలను ఆయుర్వేదం విశ్లేషించింది. అవి ఇవి..
- సరిపడని, అనారోగ్యకర ఆహరం
- అపరిశుభ్రత, వేళకు భోజనం చేయకపోవడం
- వేగ నిరోధం అనగా మలమూత్ర విసర్జన, ఆకలి మొదలైన శరీర అవసరాలను ఆలస్యం చేయడం లేదా పాటించకపోవడం
- అనారోగ్యకరమైన లైంగిక అలవాట్లు, ఉదాహరణకు రుతుస్రావ సమయంలో సంభోగం.
- తలకు దెబ్బలు తగలడం
- మానసిక ఒత్తిడి, ఆందోళన
మూర్ఛ వ్యాధికి గురైనప్పుడు కనిపించే లక్షణాలు:
- నోటి నుంచి లాలాజల స్రావం
- కాళ్లు, చేతులు తీవ్రంగా కంపించడం
- అరికాళ్లల్లోనూ, అరచేతుల్లోనూ మంట
- 10 నుంచి 15 సెకన్ల వరకు కాని లేదా ఒక నిమిషం వరకు స్పృహ కోల్పోవచ్చు.
మూర్ఛ వ్యాధికి సంబంధించిన చికిత్సను అందించేందుకు ఆయుర్వేదం అనేక ఔషధాలను సిఫార్స్ చేస్తోంది. వీటితో ప్రధానంగా చెప్పుకునేది చికిత్స దీర్ఘకాలం. అంటే కొన్ని నెలల పాటు దీని చికిత్స సాగుతుంది. ఈ ఔషధాల్లో ఏది ఉత్తమ ఫలితాలను అందించగలదో ఆయుర్వేద వైద్యున్ని సంప్రదించి ఎన్నుకోవాలి.
- సరస్వతీ ఆకు (బ్రాహ్మీ) రసం 200 మి.లీ తేనెతో కలిపి తీసుకోవాలి
- పిల్లి పీచుర (శతావరి) 10 గ్రా. చూర్ణం 100 మి.లీ పాలతో కలిపి తీసుకోవాలి
- నేతిలో వేయించిన వస చూర్ణం 1గ్రా. తేనెతో కలిపి తీసుకోవాలి
- అతిమధురం పొడి 5 గ్రా. గుమ్మడి రసంతో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి
- సారస్వత చూర్ణం, 1-3 గ్రా. 50 మి.లీ మంచినీళ్లతో కలిపి రోజుకు రెండు సార్లు తీసుకోవాలి
- దశమూల క్వాథం, 20 మి.లీ. రోజుకు రెండు సార్లు తీసుకోవాలి
- బ్రాహ్మీ వటి రోజుకు 2 మాత్రలు నీటితో తీసుకోవాలి
- పంచగవ్య ఘృతం, 3-6 గ్రా. రోజుకు 2 సార్లు తీసుకోవాలి
- బ్రాహ్మీ ఘృతం.. ఒక చెంచా చొప్పున రోజుకు 2 సార్లు తీసుకోవాలి
- సారస్వతారిష్ట.. 20 మి.లీ. రోజుకు రెండు సార్లు తీసుకోవాలి.
చికిత్సా సమయంలో మద్యపానం, మసాలా దినుసులు, అతి చల్లని లేదా చాలా వేడిగా ఉన్న పదార్ధాలను మానేయాలి. శరీర పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఘాటైన వాసనలు, కాంతివంతమైన పరిసరాలు, కొత్త ప్రదేశాలకు దూరంగా ఉండాలి. మూర్ఛవ్యాధి గ్రస్థులు వాహనాలు నడపడం, ఈత కొట్టడం శ్రేయస్కరం కాదు.